సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ నష్టాలకు కార్మికుల పనితీరుకు ఏమాత్రం సంబంధం లేదని ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం నేతలు తేల్చి చెప్పారు. అధికారుల పనితీరు సరిగా లేకపోవటం, గతంలో తీసుకున్న అప్పులకు ఇప్పటికీ వడ్డీలు చెల్లిస్తుండటం, భారీగా పెరిగిన డీజిల్ ధరల వల్ల ఆర్టీసీ నష్టాల్లో ఉందని, దానికి కార్మికులను బాధ్యులను చేయటం సరికాదని స్పష్టంచేశారు. వాస్తవాలను దాచి అధికారులు తప్పుడు లెక్కలతో సీఎంనే తప్పుదారి పట్టించారని ఆరోపించారు. బుధవారం ఆర్థిక మంత్రి ఈటల అధ్యక్షతన మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డిలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో మరోసారి ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ ప్రతినిధులతో భేటీ అయింది. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్న సమయంలో జీతాల కోసం పట్టుపట్టడం, సమ్మె నోటీసు ఇవ్వటం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మంగళవారం మంత్రివర్గ ఉపసంఘం, ఆర్టీసీ అధికారులతో చర్చ సందర్భంగా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బుధవారం నాటి సమావేశంలో గుర్తింపు సంఘం నేతలు దానికి కౌంటర్ ఇచ్చారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులను బాధ్యులను చేయటం ఏమాత్రం సరికాదని, నష్టాల బూచి చూపి వేతన సవరణ నుంచి తప్పించుకునే ప్రయత్నం సరికాదని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీ సిబ్బంది వేతనాలు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల కంటే తక్కువగా ఉన్నాయని సీఎం అన్న మాటలను ఖండించారు. మహారాష్ట్ర లాంటి చోట్ల ఆర్టీసీ కార్మికుల బేసిక్ తక్కువగా ఉన్నా అలవెన్సులు మనకంటే చాలా ఎక్కువని, మొత్తంగా చూస్తే వారి వేతనాలు తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది వేతనాల కంటే ఎక్కువే ఉంటాయని వివరించారు. ‘‘ఢిల్లీ, హరియాణ లాంటి చోట్ల ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోరు? కావాలంటే ఆర్టీసీ అధికారులతో కలసి తాము అధ్యయనానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. ఉద్యమంలో ముందున్న ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకోవాల్సిందే’’అని పేర్కొన్నారు.
జాప్యమైతే 25% ఐఆర్ ప్రకటించండి
వేతన సవరణ ఇవ్వటం సాధ్యం కాదనుకుంటే ఇంటీరియమ్ రిలీఫ్ (ఐఆర్) 25 శాతం ప్రకటించాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు.
హరీశ్‌పై గుర్రు: టీఎంయూ గౌరవాధ్యక్షుడిగా ఉన్న మంత్రి హరీశ్‌రావు బుధవారం నాటి సమావేశానికి హాజరయ్యారు. కానీ ఆయన తమకు అనుకూలంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తాము డి మాండ్లపై మొత్తుకుంటున్నా ఏమీ పట్టనట్టు కూర్చున్నారని ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వాదనతో మంత్రులు ఏకీభవించారని, వేతన సవరణ విషయంలో సీఎంతో మరోసారి చర్చిస్తామని మంత్రులు హామీ ఇచ్చారని సమావేశానంతరం ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణరావు, సంఘం ప్రతినిధులు తిరుపతి, థామస్‌రెడ్డి, అశ్వత్థామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమ్మె చేస్తామంటే చేసుకోమనండి
‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన ఉదంతం ఎప్పుడైనా ఉందా? మా ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని తరహాలో కార్మికులు అడిగినదాని కంటే ఎక్కువ ప్రకటిస్తే.. ఇప్పుడు ప్రభుత్వాన్నే బ్లాక్‌మెయిల్ చేస్తారా? వేతన సవరణ చేయకుంటే సమ్మె చేస్తామని హెచ్చరిస్తారా? అదీ రూ.750 కోట్ల మేర వార్షిక నష్టాలున్నప్పుడు... ఏమనుకుంటున్నారు..? చేస్తామంటే చేసుకోమనండి.. చేస్తే అట్నుంచి అటే పోతే?’’అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి ఆర్టీసీ కార్మిక సంఘాల తీరుపై నిప్పులు చెరిగారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా వేతన సవరణ కోసం ఆర్టీసీ కార్మికులు పట్టుబడుతున్న నేపథ్యంలో ఆయన వారి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. బుధవారం రాత్రి మంత్రివర్గ ఉప సంఘం, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలోనూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెరసి కార్మిక సంఘాల డిమాండ్‌కు తగ్గట్టు వేతన సవరణ జరగదనే స్పష్టమైన సంకేతాలిచ్చారు. అయినా ఈ అంశం మంత్రివర్గ ఉపసంఘం పరిశీలనలో ఉందని, సంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
‘‘నేను ఓ దినమంతా ఆర్టీసీ సమీక్షలో గడిపాను. వేల ఆటోలు, బైకులు రోడ్డుమీదకు వచ్చిన తరుణంలో ఆర్టీసీ ఎలా మనుగడ సాగించాలో స్పష్టంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోమని చెప్పాను. ఆర్టీసీని రక్షించేందుకు రూ.3,400 కోట్ల మొత్తాన్ని విడుదల చేశాం. ఈ సంవత్సరం బడ్జెట్‌లో కూడా నిధులు పెట్టాం. అయినా ఇంకా డిమాండ్లు చేస్తే ఏమనాలి? సమ్మె చేస్తామంటే చేసుకోమనండి. కార్మికులు, యాజమాన్యం అంతా కలిసి మునుగుతారు’’అని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లాంటి కొన్ని రాష్ట్రాల్లో అసలు ఆర్టీసీలే లేవని, కేరళలో బస్సుల సంఖ్య బాగా తగ్గిపోయిందని పేర్కొన్నారు.
ఇలాంటి తరుణంలో తెలంగాణ ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తుంటే వారు పట్టించుకోకుండా సమ్మెకు పోతామంటే చేసేదేముంటుందని ప్రశ్నించారు. అధికారులు తనకు ఇచ్చిన లెక్కలు తప్పులని, నన్ను తప్పుదోవ పట్టించారని కార్మిక సంఘాలు అనడం తప్పన్నారు. ఓ ముఖ్యమంత్రికి తప్పుడు లెక్కలు ఎలా ఇవ్వగలుగుతారని, వాస్తవ పరిస్థితిని తనకు అధికారులు వివరించారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ విషయంలో పూర్తి సానుకూలత వ్యక్తం చేయటమే కాకుండా ఉద్యోగుల పనితీరుపై అభినందనల వర్షం కురిపించిన సీఎం.. అదే వేదికపై ఆర్టీసీ కార్మిక సంఘాల తీరుపై విమర్శల వర్షం కురిపించటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment