జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద కేంద్రం ఆర్టీసీకి బస్సులు ఇచ్చింది. వీటి వ్యయంలో 35% నాటి యూపీఏ ప్రభుత్వం భరించింది. వాటి విలువను లెక్కకడితే ఒక్కో బస్సుపై ఆ మొత్తం రూ.7 లక్షల వరకు అవుతుంది. అంటే అంతమేర ఆర్టీసీకి ఆదా అయినట్లే. కానీ ఒక్కో బస్సు వల్ల తెలంగాణ ఆర్టీసీకి ఇప్పుడు రూ.9 లక్షల చిల్లు పడింది. కేంద్రం సహకరిస్తే ఆర్టీసీ లాభాల బాట పట్టాల్సింది పోయి ఈ నష్టమేంటన్న అనుమానం, ఆశ్చర్యం కలగడం సహజం. ఈ కథ వెనక మర్మం తెలియాలంటే ఆర్థికమాంద్యం నాటి పరిస్థితిలోకి తొంగి చూడాలి. అలా చూస్తే ఓ కుంభకోణం కనిపిస్తుంది. దాని మూల్యం ఆర్టీసీకి భారీ నష్టం.. దాదాపు రూ.80 కోట్ల వరకు నష్టం ఉంటుందని అంచనా. 2011లో నాటి యూపీఏ ప్రభుత్వం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద రాష్ట్రాల రవాణా సంస్థలకు సబ్సిడీపై బస్సులు అందించాలని నిర్ణయించింది. పథకం తొలి విడతలో హైదరాబాద్‌కు 600 బస్సులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తం వ్యయంలో కేంద్రం 35 శాతం, రాష్ట్రప్రభుత్వం 15 శాతం భరించాల్సి ఉండగా మిగతా 50 శాతం ఆర్టీసీ వ్యయం చేయాల్సి ఉంది. సగం ఖర్చుతో అన్ని బస్సులు రావటం ఆర్టీసీకి బాగా కలిసొస్తుందని అప్పట్లో భావించారు.
అక్కడే కథ అడ్డం తిరిగింది.
సంవత్సరం తిరిగే సరికి వాటి అసలు రూపం బయటపడటంతో ఆర్టీసీ బెంబేలెత్తాల్సి వచ్చింది. బస్‌బాడీ మొత్తం ఎక్కడికక్కడ ఊడిపోవడం మొదలైంది. కొన్ని బస్సుల ఇంజిన్లలో సరైన నాణ్యత లేక కాస్త ఎత్తు రోడ్డు వచ్చేసరికి బస్సు ఫెయిల్ కావటం సాధారణమై పోయింది. దీంతో వాటి నిర్వహణ దినదినగండంగా మారింది. ఆక్యుపెన్సీ రేషియో కూడా పడిపోయింది. సాధారణంగా సిటీ బస్సులు లీటర్ డీజిల్‌కు 5 కి.మీ. వరకు తిరిగితే ఇవి 3 కి.మీ. ఇవ్వటం కూడా గగన మైంది. ఈ బస్సులు ఇక నడవలేని స్థితిలోకి రావటంతో వాటికి కొత్త బాడీ రూపొందించటం మినహా పరిష్కారం లేదని నిపుణులు తేల్చటంతో ఆ పని ప్రారంభించింది.
ఆర్థికమాంద్యం పేరుతో మోసం..
2010లో దేశం ఆర్థిక మాంద్యం దెబ్బకు విలవిల్లాడింది. ఆ సమయంలో చాలా కంపెనీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అదే సమయంలో కొందరు ఢిల్లీ స్థాయి బడా నేతలు రంగప్రవేశం చేశారు. ఆర్థికమాంద్యంతో దెబ్బతిన్న కంపెనీలకు ప్రభుత్వం చేయూతనందించాలని, ఇందుకు ప్రత్యేక చర్యలు అవసరమని కేంద్రాన్ని నమ్మించారు. ఆ క్రమంలోనే ఈ బస్సుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ కొనుగోలు వ్యవహారం అంతా లోపాలపుట్టగా మారింది. ఏమాత్రం నాణ్యత లేని బస్సులను అంటగట్టేశారు. కేంద్రం భారీ సంఖ్యలో బస్సులను కొన్న ఈ వ్యవహారంలో నేతలు మధ్యవర్తులుగా వ్యవహరించి పెద్దమొత్తంలో కమీషన్లు దండుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో నాణ్యతలేని బస్సులను సరఫరా చేసి కొన్ని కంపెనీలు ఆర్థికమాంద్యం నష్టాన్ని పూడ్చుకున్నాయని చెబుతున్నారు.
- సిటీ బస్సులకు ఆర్టీసీ అల్యూమినియం బాడీలను వాడుతోంది. కానీ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సులు ఎంఎస్ (స్టీల్) బాడీతో రూపొందించారు.
- ఆర్టీసీ డిపోల్లో బస్సులను క్రమం తప్పకుండా కడుగుతారు. బస్సును కడిగాక ఆరబెట్టే ఏర్పాట్లు లేవు. అల్యూమినియం బాడీతో సమస్య ఉండదు. స్టీల్ బాడీలపై తడి నిలిచి తప్పు పడుతోంది. అసలే నాణ్యత లేని రేకులు కావటం, తుప్పు పట్టడంతో జాయింట్లు ఊడిపోతున్నాయి.
- సూపర్‌లగ్జరీ బస్సులకు ఎంఎస్ బాడీ వాడుతున్నారు. 8 లక్షల కిలోమీటర్లు తిరిగాక పాత బాడీ తొలగించి అల్యూమినియంతో కొత్త బాడీ నిర్మించి వాటిని పల్లెవెలుగు బస్సుల్లాగా తిప్పుతున్నారు.
- ఈ బస్సుల కొనుగోలులో 15% భరించాల్సిన రాష్ట్రప్రభుత్వం చేతులెత్తేయటంతో ఆ మొత్తాన్ని కూడా ఆర్టీసీనే భరించాల్సి వచ్చింది. ఈ రూపంలో నష్టం మరింత పెరిగింది.
రోజుకో బస్సు రీమోడలింగ్
మియాపూర్‌లో ఉన్న ఆర్టీసీ సొంత బస్‌బాడీ యూనిట్‌లో బస్సుకు కొత్త బాడీ తయారు చేసి ఇంజిన్ ఓవర్‌హాలింగ్ చేసి వాటికి కొత్త రూపునిస్తోంది. ఇలా ఒక్కో బస్సును పూర్తి స్థాయిలో మార్చేందుకు ఆర్టీసీకి దాదాపు రూ.9 లక్షల వరకు ఖర్చవుతోంది. ఇలా ఏడాదిగా 250 బస్సులకు కొత్త రూపునిచ్చింది. మరో 350 బస్సులను ఇంకో ఏడాదిలో సిద్ధం చేయాలని నిర్ణయించింది. మొత్తం ప్రాజెక్టు కోసం ఆర్టీసీ రూ.50 కోట్ల వరకు ఖర్చు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. ఈ బస్సులను అందించినప్పుడు కేంద్రం రూ.40 కోట్ల మేర భరించగా, ఇప్పుడు ఆర్టీసీ రూ.50 కోట్లకుపైగా నష్టపోతోంది. ఇన్నేళ్లు వాటి నిర్వహణ కోసం చేసిన ఖర్చు మరో రూ.30 కోట్ల వరకు అయి ఉంటుందని అంచనా.
కంపెనీలు, రాజకీయ నేతలు మిలాఖత్ అయితే ఎలా ఉంటుంది.. కమీషన్ల నీడలో కోరుకున్న పనులు చకచకా జరిగిపోతాయి. ఆ కోవలోదే ఈ బస్సు కథ. జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం).. యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఉదాత్త పథకం. కానీ కమీషన్ల ముఠా దీన్నీ వదల్లేదు. ఆ పథకంలో ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకుని అందినంత దండుకుంది.
– సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment