సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC)ను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ మంత్రి మండలి నిర్ణయించింది. సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో ఐదుగంటలకు పైగా జరిగిన సమావేశం అనంతరం.. కేబినెట్ భేటీ సారాంశాన్ని మీడియాకు వివరించారు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు.
ఇక నుంచి 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని, ఈ మేరకు కేబినెట్ భేటీలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విలీనం, విధివిధానాలు నిర్ణయించేందుకు ఒక కమిటీని(సబ్ కమిటీ) ఏర్పాటు చేయనున్నట్లు, త్వరలోనే అసెంబ్లీలో బిల్లు తేనున్నట్లు తెలిపారాయన.
► హైదరాబాద్‌లో మెట్రో రైలును విస్తరిస్తాం. రూ. 60వేల కోట్లతో విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. Lb నగర్ పెద్ద అంబర్ పేట వరకు, ఉప్పల్ నుంచి బీ బీ నగర్ వరకు, ఉప్పల్ నుంచి ECIL దాకామెట్రో నిర్మాణం చేపడుతున్నాం. మూడు-నాలుగేళ్లలో మెట్రో విస్తరణ పూర్తవుతుంది. ప్యాట్నీ నుంచి కండ్లకోయ ORR వరకు, అలాగే.. జేబీఎస్ నుంచి తూంకుంట వరకు డబుల్ డెక్కర్ మెట్రో రహదారి.. ఆపైనే మెట్రో నిర్మాణం ఏర్పాటు చేస్తాం.
► పది జిల్లాల్లో వరద నష్టం తీవ్రంగా ఉంది. వరదలు వచ్చినప్పుడు కేంద్రం ఏనాడూ ఆదుకోలేదు. నష్టపోయిన రైతులను తెలంగాణ ప్రభుత్వమే ఆదుకుంటోంది.
► ప్రజాభిప్రాయాన్ని అపహాస్యం చేసేలా గవర్నర్ వ్యవస్థ ఉంది. చట్టపరంగా ఆమోదించిన బిల్లులను గవర్నర్ వెనక్కి పంపారు. తిరిగి పంపిన మూడు బిల్లులను అసెంబ్లీలో మరోసారి పాస్ చేస్తం. రెండోసారి పాస్ చేశాక.. గవర్నర్ ఆమోదించాల్సిందే.
► గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను కేబినెట్ ఎంపిక చేసింది. ఎస్టీ కేటగిరి కుర్రా సత్యనారాయణ, బీసీ కేటగిరీలో దాసోజు శ్రవణ్‌ను ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తున్నాం. ఎమ్మెల్సీల ఎంపికలో గవర్నర్‌కు ఎలాంటి అభ్యంతరం ఉండదని అనుకుంటున్నాం.
► నిమ్స్‌లో కొత్తగా 2వేల పడకల ఏర్పాటుకు నిర్ణయం.
► వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు 253 ఎకరాలు కేటాయింపు.
► బీడీ టేకేదార్‌లకు పెన్షన్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.
► తెలంగాణలో మరో ఎనిమిది మెడికల్ కాలేజీల ఏర్పాటు
► సౌత్ ఇండియా కాపు సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయం.
► అనాథ పిల్లల కోసం కొత్త పాలసీ తీసుకొస్తున్నాం
► హకింపేట్ ఎయిర్‌పోర్ట్‌ను పూణే తరహాలో పౌరవిమానయాన సేవలకు వినియోగించాలని కేంద్ర పౌరవిమానయాన శాఖకు ప్రతిపాదన పంపుతున్నాం. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
రాబోయే కేంద్రం లో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది అందులో బీఆర్ఎస్ కీలకంగా వ్యవహరిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment