JNNURM
-
పట్టణాలకు ప్రత్యేక బస్సులు!
సాక్షి, హైదరాబాద్: ఇక పట్టణాల్లో అద్దె బస్సులు రాజ్యమేలబోతున్నాయి. నగరాలు, పట్టణాల్లో ప్రజా రవాణా భారీ నష్టాలతో ఆర్టీసీ కుదేలవుతున్న వేళ.. వాటిని పూడ్చేందుకు కేంద్రం ఓ అడుగు ముందుకేసింది. ప్రపంచ బ్యాంకు చేయూతతో ప్రత్యేక ప్రాజెక్టును తెస్తోంది. ఇందులో భాగంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రధాన పట్టణాల మధ్య అద్దె బస్సులను భారీగా తిప్పేందుకు వీలుగా రంగం సిద్ధం చేస్తోంది. వీటి నిర్వహణతో వచ్చే నష్టాలను ఐదేళ్లపాటు భరించేందుకు సమాయత్తమైంది. ఈలోపు వాటి నష్టాలను పూడ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఐదేళ్ల కాలానికి గాను రూ.75 వేల కోట్లను ఇందు కోసం ఖర్చు చేయనున్నారు. ఈ మొత్తాన్ని ఆయా రాష్ట్రాల డిమాండ్ ఆధారంగా పంచుతారు. ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యేందుకు ఉన్న సంసిద్ధతను తెలపాల్సిందిగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం ఓకే అంటే అందులో భాగస్వామ్యం ఉంటుంది. పట్టణ ప్రాంతంలో ప్రత్యేకంగా తిప్పే బస్సుల నిర్వహణతో వచ్చే నష్టాలతో పాటు, వాటి నిర్వహణకు సంబంధించిన మౌలిక వసతుల కల్పనకు అయ్యే వ్యయంలో సగభాగాన్ని భరించేందుకు వీలుగా గ్రాంట్లు అందించనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా వచ్చే బస్సులన్నీ ఆర్టీసీ సొంత బస్సులుగా కాకుండా పూర్తిగా అద్దె ప్రాతిపదికన ప్రైవేటు ఆపరేటర్లే నిర్వహించనున్నారు. వెరసి ప్రజా రవాణా సంస్థలో అద్దె బస్సుల హవా మరింతగా పెరగనుంది. ప్రపంచ బ్యాంకు సాంకేతిక సహకారంతో.. ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ అత్యంత వేగంగా పెరుగుతోంది. కానీ, పెరుగుతున్న జనాభాకు వీలుగా ఆయా ప్రాంతాల్లో ప్రజా రవాణా విస్తరించటం లేదని ప్రపంచ బ్యాంకు ప్రత్యేక అధ్యయనాలతో తేల్చింది. దీన్ని మార్చాలంటే పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణాను బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మన దేశంతో కూడా అవగాహనకు వచ్చింది. కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆధ్వర్యంలో ఈ బృహత్ ప్రాజెక్టును చేపట్టబోతోంది. ఇందుకు సంబంధించి తన వంతుగా సాంకేతిక సహకారాన్ని ఉచితంగా అందించటంతో పాటు కేంద్రానికి అవసరమైన కొంత ఆర్థిక చేయూతను అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు వచ్చే ఐదేళ్లలో పట్టణ ప్రజా రవాణా రూపురేఖలు మార్చాలన్నది ప్రణాళిక. ఇందుకు ఐదేళ్ల కాలానికి రూ.75 వేల కోట్లు ఖర్చవుతాయని ఓ అంచనా. దీనికి కేంద్రం కూడా సానుకూలంగా ఉండి, రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వాములు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి తాజాగా ఢిల్లీలో ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ప్రాజెక్టు వివరాలు వెల్లడించింది. ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేసేందుకు మహారాష్ట్ర, ఏపీలను ఎంపిక చేసి, మిగతా రాష్ట్రాలు సమ్మతిని తెలపాల్సిందిగా కేంద్రం కోరింది. ప్రాజెక్టులో చేరేందుకు ఉన్న అభ్యంతరాలను తెలపాల్సిందిగా సూచించింది. ఈ సమావేశానికి టీఎస్ఆర్టీసీ తరుఫున పలువురు హాజరయ్యారు. దీనిపై కేంద్రానికి తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. పదేళ్లు భరించాలి.. ఈ సమావేశంలో పేర్కొన్న వయబిలీటీ గ్యాప్ ఫండ్‌ను ఐదేళ్లు కాకుండా పదేళ్లు భరించాలని సమావేశంలో వివిధ రాష్ట్రాల ప్రతినిధులు కోరారు. దీనిపై ఇంకా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. ఇక బస్సులను కూడా తమ ప్రాంతాలకు సూటయ్యే వాటిని తామే సమకూర్చుకునే వెసులుబాటు కల్పించాలని కూడా కోరారు. గతంలో జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద నాసిరకమైన బస్సులు సరఫరా కావటంతో అవి కేవలం మూడేళ్లకే పాడై ఆ తర్వాత భారీ నష్టాలు మూటగట్టినట్టు వారు కేంద్రం దృష్టికి తెచ్చారు. అందుకోసం నాణ్యమైన బస్సులను తామే సమకూర్చుకుంటామని, అందుకయ్యే వ్యయాన్ని కేంద్రం భరించాలని కోరారు. దీనిపై కేంద్రం నిర్ణయం తెలపాల్సి ఉంది. -
వచ్చే జూన్‌కల్లా లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఏడాది జూన్‌లోగా హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. రాజధానిలోని మొత్తం 109 ప్రాంతాల్లో లక్ష ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. బేగంపేటలోని మెట్రోరైల్ భవనంలో బుధవారంఆయన జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి, ఇతర అధికారులతో ఇళ్ల నిర్మాణంపై సమీక్షించారు. ఇళ్ల నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అడ్డంకులను తొలగిస్తూ ముందుకు వెళ్తున్నామని అధికారులు మంత్రికి నివేదించారు. ఇదే వేగంతో పనులు కొనసాగితే వచ్చే డిసెంబర్‌లోగా 40 వేల ఇళ్లు నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటాయన్నారు. మిగిలిన ఇళ్లను వచ్చే ఏడాది జూన్‌లోగా పూర్తి చేస్తామని అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణంలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలను మరింతగా భాగస్వాములను చేయడం ద్వారా పర్యవేక్షణ, నిర్మాణ వేగం పెరుగుతుందన్నారు. నియోజకవర్గాలవారీగా నిర్మిస్తున్న ఇళ్ల సంఖ్య, ప్రాంతాల వివరాలతో జాబితా రూపొందించి స్థానిక ఎమ్మెల్యేలకు అందించాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం పారదర్శక విధానాన్ని రూపొందించేందుకు కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది, జీహెచ్ఎంసీ, హౌసింగ్ బోర్డు అధికారులు చర్చించాలని కేటీఆర్ సూచించారు. ఆధార్, బయోమెట్రిక్, సమగ్ర కుటుంబ సర్వే వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని లోపరహిత విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. జేఎన్ఎన్యూఆర్ఎం, రాజీవ్ గృహకల్ప ప్రాజెక్టుల కింద మిగిలిపోయిన 13 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అవసరమైతే అదనపు నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. వందలు, వేలల్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో రోడ్లు, తాగునీటి సరఫరా, పోలీస్ స్టేషన్ల వంటి మౌలిక వసతుల కల్పన కోసం వివిధ శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి అన్ని వసతులు కల్పించాలన్నారు. -
రాయితీ బస్సు కోట్లు మేసింది!
జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద కేంద్రం ఆర్టీసీకి బస్సులు ఇచ్చింది. వీటి వ్యయంలో 35% నాటి యూపీఏ ప్రభుత్వం భరించింది. వాటి విలువను లెక్కకడితే ఒక్కో బస్సుపై ఆ మొత్తం రూ.7 లక్షల వరకు అవుతుంది. అంటే అంతమేర ఆర్టీసీకి ఆదా అయినట్లే. కానీ ఒక్కో బస్సు వల్ల తెలంగాణ ఆర్టీసీకి ఇప్పుడు రూ.9 లక్షల చిల్లు పడింది. కేంద్రం సహకరిస్తే ఆర్టీసీ లాభాల బాట పట్టాల్సింది పోయి ఈ నష్టమేంటన్న అనుమానం, ఆశ్చర్యం కలగడం సహజం. ఈ కథ వెనక మర్మం తెలియాలంటే ఆర్థికమాంద్యం నాటి పరిస్థితిలోకి తొంగి చూడాలి. అలా చూస్తే ఓ కుంభకోణం కనిపిస్తుంది. దాని మూల్యం ఆర్టీసీకి భారీ నష్టం.. దాదాపు రూ.80 కోట్ల వరకు నష్టం ఉంటుందని అంచనా. 2011లో నాటి యూపీఏ ప్రభుత్వం జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద రాష్ట్రాల రవాణా సంస్థలకు సబ్సిడీపై బస్సులు అందించాలని నిర్ణయించింది. పథకం తొలి విడతలో హైదరాబాద్‌కు 600 బస్సులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తం వ్యయంలో కేంద్రం 35 శాతం, రాష్ట్రప్రభుత్వం 15 శాతం భరించాల్సి ఉండగా మిగతా 50 శాతం ఆర్టీసీ వ్యయం చేయాల్సి ఉంది. సగం ఖర్చుతో అన్ని బస్సులు రావటం ఆర్టీసీకి బాగా కలిసొస్తుందని అప్పట్లో భావించారు. అక్కడే కథ అడ్డం తిరిగింది. సంవత్సరం తిరిగే సరికి వాటి అసలు రూపం బయటపడటంతో ఆర్టీసీ బెంబేలెత్తాల్సి వచ్చింది. బస్‌బాడీ మొత్తం ఎక్కడికక్కడ ఊడిపోవడం మొదలైంది. కొన్ని బస్సుల ఇంజిన్లలో సరైన నాణ్యత లేక కాస్త ఎత్తు రోడ్డు వచ్చేసరికి బస్సు ఫెయిల్ కావటం సాధారణమై పోయింది. దీంతో వాటి నిర్వహణ దినదినగండంగా మారింది. ఆక్యుపెన్సీ రేషియో కూడా పడిపోయింది. సాధారణంగా సిటీ బస్సులు లీటర్ డీజిల్‌కు 5 కి.మీ. వరకు తిరిగితే ఇవి 3 కి.మీ. ఇవ్వటం కూడా గగన మైంది. ఈ బస్సులు ఇక నడవలేని స్థితిలోకి రావటంతో వాటికి కొత్త బాడీ రూపొందించటం మినహా పరిష్కారం లేదని నిపుణులు తేల్చటంతో ఆ పని ప్రారంభించింది. ఆర్థికమాంద్యం పేరుతో మోసం.. 2010లో దేశం ఆర్థిక మాంద్యం దెబ్బకు విలవిల్లాడింది. ఆ సమయంలో చాలా కంపెనీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అదే సమయంలో కొందరు ఢిల్లీ స్థాయి బడా నేతలు రంగప్రవేశం చేశారు. ఆర్థికమాంద్యంతో దెబ్బతిన్న కంపెనీలకు ప్రభుత్వం చేయూతనందించాలని, ఇందుకు ప్రత్యేక చర్యలు అవసరమని కేంద్రాన్ని నమ్మించారు. ఆ క్రమంలోనే ఈ బస్సుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ కొనుగోలు వ్యవహారం అంతా లోపాలపుట్టగా మారింది. ఏమాత్రం నాణ్యత లేని బస్సులను అంటగట్టేశారు. కేంద్రం భారీ సంఖ్యలో బస్సులను కొన్న ఈ వ్యవహారంలో నేతలు మధ్యవర్తులుగా వ్యవహరించి పెద్దమొత్తంలో కమీషన్లు దండుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో నాణ్యతలేని బస్సులను సరఫరా చేసి కొన్ని కంపెనీలు ఆర్థికమాంద్యం నష్టాన్ని పూడ్చుకున్నాయని చెబుతున్నారు. - సిటీ బస్సులకు ఆర్టీసీ అల్యూమినియం బాడీలను వాడుతోంది. కానీ జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులు ఎంఎస్ (స్టీల్) బాడీతో రూపొందించారు. - ఆర్టీసీ డిపోల్లో బస్సులను క్రమం తప్పకుండా కడుగుతారు. బస్సును కడిగాక ఆరబెట్టే ఏర్పాట్లు లేవు. అల్యూమినియం బాడీతో సమస్య ఉండదు. స్టీల్ బాడీలపై తడి నిలిచి తప్పు పడుతోంది. అసలే నాణ్యత లేని రేకులు కావటం, తుప్పు పట్టడంతో జాయింట్లు ఊడిపోతున్నాయి. - సూపర్‌లగ్జరీ బస్సులకు ఎంఎస్ బాడీ వాడుతున్నారు. 8 లక్షల కిలోమీటర్లు తిరిగాక పాత బాడీ తొలగించి అల్యూమినియంతో కొత్త బాడీ నిర్మించి వాటిని పల్లెవెలుగు బస్సుల్లాగా తిప్పుతున్నారు. - ఈ బస్సుల కొనుగోలులో 15% భరించాల్సిన రాష్ట్రప్రభుత్వం చేతులెత్తేయటంతో ఆ మొత్తాన్ని కూడా ఆర్టీసీనే భరించాల్సి వచ్చింది. ఈ రూపంలో నష్టం మరింత పెరిగింది. రోజుకో బస్సు రీమోడలింగ్ మియాపూర్‌లో ఉన్న ఆర్టీసీ సొంత బస్‌బాడీ యూనిట్లో బస్సుకు కొత్త బాడీ తయారు చేసి ఇంజిన్ ఓవర్‌హాలింగ్ చేసి వాటికి కొత్త రూపునిస్తోంది. ఇలా ఒక్కో బస్సును పూర్తి స్థాయిలో మార్చేందుకు ఆర్టీసీకి దాదాపు రూ.9 లక్షల వరకు ఖర్చవుతోంది. ఇలా ఏడాదిగా 250 బస్సులకు కొత్త రూపునిచ్చింది. మరో 350 బస్సులను ఇంకో ఏడాదిలో సిద్ధం చేయాలని నిర్ణయించింది. మొత్తం ప్రాజెక్టు కోసం ఆర్టీసీ రూ.50 కోట్ల వరకు ఖర్చు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. ఈ బస్సులను అందించినప్పుడు కేంద్రం రూ.40 కోట్ల మేర భరించగా, ఇప్పుడు ఆర్టీసీ రూ.50 కోట్లకుపైగా నష్టపోతోంది. ఇన్నేళ్లు వాటి నిర్వహణ కోసం చేసిన ఖర్చు మరో రూ.30 కోట్ల వరకు అయి ఉంటుందని అంచనా. కంపెనీలు, రాజకీయ నేతలు మిలాఖత్ అయితే ఎలా ఉంటుంది.. కమీషన్ల నీడలో కోరుకున్న పనులు చకచకా జరిగిపోతాయి. ఆ కోవలోదే ఈ బస్సు కథ. జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం).. యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఉదాత్త పథకం. కానీ కమీషన్ల ముఠా దీన్నీ వదల్లేదు. ఆ పథకంలో ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకుని అందినంత దండుకుంది. – సాక్షి, హైదరాబాద్ -
జిల్లాకు వచ్చిన జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులు
నేడు డిప్యూటీ సీఎం కడియం చేతుల మీదుగా ప్రారంభం హన్మకొండ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రినివల్ మిషన్ (జేఎన్ఎన్యూఆర్ఎం) హైటెక్ బస్సులు జిల్లాకు వచ్చాయి. ఆర్టీసీ వరంగల్ రీజియన్‌కు జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులు కావాలని స్థానిక అధికారులు కొంత కాలంగా సంస్థను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం రీజియన్‌కు 24 జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులు కేటాయించింది. కాగా, ఈ బస్సులు వరంగల్ గ్రేటర్ పరిధితో పాటు హన్మకొండ–జనగామ, నర్సం పేట–హన్మకొండ రూట్లలో నడవనున్నాయి. నగరంలోని ప్రయాణికులను ఆర్టీసీ వైపునకు ఆకర్షించేందుకు వరంగల్ రీజియన్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఆర్టీసీ రీజినల్ మేనేజర్ తోట సూర్యకిరణ్ ప్రత్యేక చొరవ తీసుకుని యాజమాన్యాన్ని ఒప్పించి బస్సులు తెప్పించారు. ఆర్టీసీ పూర్వ వైభవానికి కృషి ఒకప్పుడు వరంగల్ నగరంలో లోకల్ బస్సులు చాలా నడిచేవి. అయితే ఆటోల సంఖ్య పెరగడం, ప్రయాణికులు వాటినే ఆశ్రయింస్తుండడంతో తగ్గించారు. హన్మ కొండ డిపో లోకల్ బస్సులను మాత్రమే నడిపేది. లోకల్ బస్సుల సంఖ్య తగ్గడంతో ఈ డిపో నుంచి వాటితో పాటు జిల్లాల బస్సులు నడుపుతోంది. ఈ క్రమంలో నగరంలో ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకురావాలని సంస్థ యోచిస్తోంది. ఇందులో భాగంగానే ప్రయాణికులను త్వరగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు జేఎన్ ఎన్యూఆర్ఎం ఎక్స్‌ప్రెస్ బస్సులను నడిపించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ బస్సులను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేతుల మీదుగా బుధవారం ఉదయం 11 గంటలకు హన్మకొండలోని జవహలాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. -
రోడ్డెక్కిన 12 నూతన బస్సులు
ఖమ్మం: ఖమ్మం నగరంతో పాటు శివారు ప్రాంతాలకు సిటీ బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. జేఎన్ఎన్యూఆర్ఎం కింద కేంద్రం కేటాయించిన 12 నూతన బస్సులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నెస్పీ ప్రాంతంలో మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఓ బస్సులో మంత్రి తుమ్మలతోపాటు, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, సుధాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ గడిపల్లి కవిత, కలెక్టర్, ఇతర అధికారులు నగరంలో పర్యటించారు. -
రాష్ట్రాలకు తగ్గట్టు కేంద్ర పథకాలు
- కేంద్ర మంత్రి వెంకయ్య - ‘జేఎన్ఎన్యూఆర్ఎం’ స్థానంలో కొత్త పథకం ఢిల్లీ: పట్టణాభివృద్ధికి సంబంధించి గత యూపీఏ ప్రభుత్వం అమలు చేసిన ‘జవహర్లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం)’ పథకం పూర్తిగా లోపభూయిష్టమైనదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పైస్థాయి (కేంద్రం)లో పథకాలు రూపొందించి, అమలుబాధ్యతను రాష్ట్రాలకు అప్పగించడం సరికాదని చెప్పారు. దీనికి స్వస్తిపలికి క్షేత్రస్థాయి సూచనల ఆధారంగా పట్టణాభివృద్ధికి కొత్త పథకాన్ని రూపొందించనున్నామని తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి, హౌసింగ్, పట్టణపేదరిక నిర్మూలన శాఖల బాధ్యతలు చేపట్టిన అనంతరం వెంకయ్యనాయుడు... ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ సిటీ, 2022 నాటికి అందరికీ ఇళ్లు వంటి పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అందులో భాగంగా శనివారం కోల్‌కతాలో పర్యటించారు కూడా. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు ఆదివారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇప్పటివరకు పట్టణాభివృద్ధి పథకాలను ఢిల్లీ(కేంద్రం)లో రూపొందించి, వాటిని అమలు చేయాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించేవారు. పైనుంచి కిందికి వచ్చే ఈ తరహా విధానం సరికాదు. అలా రూపొందించిన జేఎన్ఎన్యూఆర్ఎం పథకం నిర్మాణాత్మక లోపాలకు, ఆచరణలో రాష్ట్రాలు విఫలం కావడానికి ఇది కారణమైంది. అందువల్ల ఈ విధానానికి స్వస్తి పలికి.. క్షేత్రస్థాయి నుంచి వచ్చే సూచనలు, సలహాల ఆధారంగా పైన (కేంద్రం) పథకాలు రూపొందించే విధానానికి శ్రీకారం చుట్టనున్నాం..’’ అని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగానే రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని.. స్మార్ట్ సిటీలు, అందరికీ ఇళ్లు వంటి పథకాలపై సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నామని తెలిపారు. అంతేగాకుండా పట్టణ పాలనను మరింత మెరుగుపర్చేందుకు, అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకొనేలా ‘ఎన్ఏఆర్ఈడీసీవో, ఐఆర్ఈడీఏ’ వంటి సంస్థలతో, ఐటీ కంపెనీలతో సంప్రదింపుల్లో ఉన్నామని వెల్లడించారు. జేఎన్ఎన్యూఆర్ఎం స్థానంలో తీసుకురానున్న కొత్త పథకానికి సంబంధించి బడ్జెట్ సమావేశాల్లోగా ప్రజా ప్రయోజనకర ప్రణాళికను రూపొందిస్తామని వెల్లడించారు. -
జేఎన్ఎన్ యూ ఆర్ఎం వరమా...! శాపమా..!!
‘కొండనాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక పోరుుంది..’ అన్న చందంగా ఉంది విజయవాడ నగరపాలక సంస్థ పరిస్థితి. జవహర్లాల్ నెహ్రూ జాతీయ నవీనీకరణ పథకం(జేఎన్ఎన్యూఆర్ఎం) ద్వారా వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి నగరాన్ని సింగపూర్ తరహాలో అభివృద్ధి చేస్తామని చెప్పిన నేతలు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. కోట్ల రూపాయలు తీసుకురాకపోగా... నగరపాలక సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టారు. ఆస్తులను తాకట్టు పెట్టేలా చేశారు. ఇంతజరిగినా జేఎన్ఎన్యూఆర్ఎం కింద చేపట్టిన పనులన్నీ అసంపూర్తిగానే మిగిలిపోయూరుు. ఎన్నికలు సమీపించిన తరుణంలో అసలు జేఎన్ఎన్యూఆర్ఎం నగరానికి వరమా.. శాపమా... అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. సాక్షి, విజయవాడ : జవహర్లాల్ నెహ్రూ జాతీయ నవీనీకరణ పథకం(జేఎన్ఎన్యూఆర్ఎం) ద్వారా నగర రూపు రేఖలు మార్చేందుకు వేల కోట్ల రూపాయలు తీసుకువస్తామని ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా ప్రచారం చేశారు. ఆచరణలో మాత్రం వందల కోట్ల రూపాయలకే పరిమితమయ్యూరు. ఫలితంగా నగరాభివృద్ధి జరగకపోగా.. షరతుల వల్ల నగరపాలక సంస్థ నడ్డివిరిగింది. ప్రజలకే కాదు.. కాంట్రాక్టర్లకు కూడా కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితిపై నమ్మకం కుదరడం లేదు. ఇప్పటికే కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలు వంద కోట్ల రూపాయలు దాటిపోవడంతో వారు కొత్త పనులు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. మంజూరై టెండర్లు పిలిచిన పనులకు కాంట్రాక్టర్లు దొరకని పరిస్థితి. ఒకే పనికి ఏడెనిమిదిసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం నగరపాలక సంస్థ ఆర్థిక దుస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికి మంజూరైన ప్రాజెక్టుల్లో 62 శాతం నిధులు మాత్రమే కార్పొరేషన్‌కు చేరుకున్నాయి. మిగిలిన 38 శాతం నిధులు ఇంకా రావాల్సి ఉంది. విఫలమైన యంత్రాంగం... ఈ పథకాన్ని ఉృపయోగించుకోవడంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందింది. ఒక్కో ప్రాజెక్టు తీసుకుని అది పూర్తయిన తర్వాత మరో ప్రాజెక్టు చేపట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అధికారులు మాత్రం అన్ని ప్రాజెక్టులు ఒకేసారి మంజూరు చేయించారు. కార్పొరేషన్ తన వాటా ఎలా సమకూర్చుకుంటుందన్న కనీస అవగాహన కూడా లేకుండా చేసిన పనులు కార్పొరేషన్‌ను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి. ఆఖరికి తన వాటా సమకూర్చుకునేందుకు ఆస్తులను తనఖా పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే అప్పుల కోసం వస్త్రలత, ఐవీ ప్యాలెస్, కేబీఎన్ షాపింగ్ కాంప్లెక్సులను రూ.100 కోట్ల కోసం తనఖా పెట్టారు. మరో రూ. 50 కోట్ల కోసం కాళేశ్వరరావు మార్కెట్, సింగ్‌నగర్ ఎస్టీపీ, మాకినేని బసవపున్నయ్య స్టేడియం తనఖా పెట్టేందుకు సిద్ధమయ్యారు. అభివృద్ధి పనులు సగంలోనే నిలిచిపోయినా షరతుల వల్ల ఇబ్బందులు మాత్రం కార్పొరేషన్‌కు పెరిగిపోయాయి. రెండేళ్ల కాలంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్యూఆర్ఎం పథకానికి నిధులు రావడం ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వం తన వాటాను విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెట్టి తన అవసరాలకు వాడేసుకుంది. ఈ నిధుల కోసం అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వడం లేదు. నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతినిధి బృందాలు వచ్చి హడావుడి చేసి వెళ్లాయి. వైఎస్ హయాంలో.. జేఎన్ఎన్యూఆర్ఎంలో విజయవాడను చేర్చే అవకాశం లేకపోయినా నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్పందించి చుట్టుపక్కల గ్రామాలను కూడా చేర్చి ఈ పథకాన్ని మంజూరు చేరుుంచారు. ఆయన స్ఫూర్తిని ఆ తర్వాత నాయకులు కొనసాగించలేకపోయూరు. 2006లో రూ.7,400 కోట్లతో సిటీ డెవలప్మెంట్ ప్లాన్‌ను రూపొందిస్తే రూ.1,422 కోట్ల ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. ఆరేళ్లలో నగరానికి 62 శాతం అంటే రూ.891 కోట్లు మాత్రమే వచ్చాయి. -
అభివృద్ధి ప్రణాళికకు ఆమోదం
పుణే: నగరం ఇక అభివృద్ధి దిశగా పరుగులు తీయనుంది. రానున్న మూడు దశాబ్దాల కాలానికి సంబంధించి రూపొందించిన నగర అభివృద్ధి ప్రణాళిక (సీడీపీ)కు పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) ఆమోదం తె లిపింది. ఈ ప్రణాళిక అమలుకు అయ్యే మొత్తాన్ని జవహర్లాల్ నెహ్రూ పట్టణ పునరాభివృద్ధి పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం) కింద కేంద్ర ప్రభుత ్వం అందజేస్తుంది. ఈ ప్రణాళికకు బుధవారం జరిగిన సమావేశంలో సభ్యులు తమ ఆమోదముద్ర వేశారు. కాగా జవహర్లాల్ నెహ్రూ పట్టణ పునరాభివృద్ధి పథకం కింద ఎంపికైన నగరాలకు కేంద్ర ప్రభుత్వం రెండో విడత కింద నిధులను అందజేయనుంది. ఈ విషయమై పీఎంసీ ఇంజనీర్ ప్రశాంత్ వాఘ్మారే బుధవారం మీడియాతో మాట్లాడుతూ జేఎన్ఎన్యూఆర్ఎం మార్గదర్శకాలకు లోబడి సీడీపీని రూపొందించామన్నారు. కాగా అనేక అధ్యయనాల అనంతరం పీఎంసీ నగర అభివృద్ధి ప్రణాళికను రూపొం దించింది. అంతేకాకుండా అనేకమంది నిపుణుల సలహాలు, సూచనలను స్వీకరించింది. దీంతోపాటు నగరవాసుల అభిప్రాయాలను కూడా సేకరించింది. ఆ తర్వాతే ఈ ప్రణాళికకు తుదిరూపు ఇచ్చింది. ఈ విషయమై పీఎంసీ కమిషనర్ మహేష్ పాఠక్ మాట్లాడుతూ పెద్ద పెద్ద ప్రాజెక్టులను సమర్థంగా చేపట్టేందుకు నగర అభివృద్ధి ప్రణాళిక (సీడీపీ) దోహదం చేస్తుందన్నారు. కాగా రూ. 88.443 కోట్లతో సంబంధిత అధికారులు ఈ ప్రణాళికను రూపొందించారు.