రాష్ట్రాలకు తగ్గట్టు కేంద్ర పథకాలు
- కేంద్ర మంత్రి వెంకయ్య
- ‘జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం’ స్థానంలో కొత్త పథకం
ఢిల్లీ: పట్టణాభివృద్ధికి సంబంధించి గత యూపీఏ ప్రభుత్వం అమలు చేసిన ‘జవహర్‌లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పథకం (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం)’ పథకం పూర్తిగా లోపభూయిష్టమైనదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పైస్థాయి (కేంద్రం)లో పథకాలు రూపొందించి, అమలుబాధ్యతను రాష్ట్రాలకు అప్పగించడం సరికాదని చెప్పారు. దీనికి స్వస్తిపలికి క్షేత్రస్థాయి సూచనల ఆధారంగా పట్టణాభివృద్ధికి కొత్త పథకాన్ని రూపొందించనున్నామని తెలిపారు.
కేంద్ర పట్టణాభివృద్ధి, హౌసింగ్, పట్టణపేదరిక నిర్మూలన శాఖల బాధ్యతలు చేపట్టిన అనంతరం వెంకయ్యనాయుడు... ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ సిటీ, 2022 నాటికి అందరికీ ఇళ్లు వంటి పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అందులో భాగంగా శనివారం కోల్‌కతాలో పర్యటించారు కూడా. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు ఆదివారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
‘‘ఇప్పటివరకు పట్టణాభివృద్ధి పథకాలను ఢిల్లీ(కేంద్రం)లో రూపొందించి, వాటిని అమలు చేయాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించేవారు. పైనుంచి కిందికి వచ్చే ఈ తరహా విధానం సరికాదు. అలా రూపొందించిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం నిర్మాణాత్మక లోపాలకు, ఆచరణలో రాష్ట్రాలు విఫలం కావడానికి ఇది కారణమైంది. అందువల్ల ఈ విధానానికి స్వస్తి పలికి.. క్షేత్రస్థాయి నుంచి వచ్చే సూచనలు, సలహాల ఆధారంగా పైన (కేంద్రం) పథకాలు రూపొందించే విధానానికి శ్రీకారం చుట్టనున్నాం..’’ అని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగానే రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని.. స్మార్ట్ సిటీలు, అందరికీ ఇళ్లు వంటి పథకాలపై సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నామని తెలిపారు.
అంతేగాకుండా పట్టణ పాలనను మరింత మెరుగుపర్చేందుకు, అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకొనేలా ‘ఎన్‌ఏఆర్‌ఈడీసీవో, ఐఆర్‌ఈడీఏ’ వంటి సంస్థలతో, ఐటీ కంపెనీలతో సంప్రదింపుల్లో ఉన్నామని వెల్లడించారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం స్థానంలో తీసుకురానున్న కొత్త పథకానికి సంబంధించి బడ్జెట్ సమావేశాల్లోగా ప్రజా ప్రయోజనకర ప్రణాళికను రూపొందిస్తామని వెల్లడించారు.