జిల్లాకు వచ్చిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సులు
-
నేడు డిప్యూటీ సీఎం కడియం చేతుల మీదుగా ప్రారంభం
హన్మకొండ :
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రినివల్ మిషన్ (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) హైటెక్ బస్సులు జిల్లాకు వచ్చాయి. ఆర్టీసీ వరంగల్ రీజియన్‌కు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సులు కావాలని స్థానిక అధికారులు కొంత కాలంగా సంస్థను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం రీజియన్‌కు 24 జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సులు కేటాయించింది. కాగా, ఈ బస్సులు వరంగల్ గ్రేటర్ పరిధితో పాటు హన్మకొండ–జనగామ, నర్సం పేట–హన్మకొండ రూట్లలో నడవనున్నాయి. నగరంలోని ప్రయాణికులను ఆర్టీసీ వైపునకు ఆకర్షించేందుకు వరంగల్ రీజియన్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఆర్టీసీ రీజినల్ మేనేజర్ తోట సూర్యకిరణ్ ప్రత్యేక చొరవ తీసుకుని యాజమాన్యాన్ని ఒప్పించి బస్సులు తెప్పించారు.
ఆర్టీసీ పూర్వ వైభవానికి కృషి
ఒకప్పుడు వరంగల్ నగరంలో లోకల్ బస్సులు చాలా నడిచేవి. అయితే ఆటోల సంఖ్య పెరగడం, ప్రయాణికులు వాటినే ఆశ్రయింస్తుండడంతో తగ్గించారు. హన్మ కొండ డిపో లోకల్ బస్సులను మాత్రమే నడిపేది. లోకల్ బస్సుల సంఖ్య తగ్గడంతో ఈ డిపో నుంచి వాటితో పాటు జిల్లాల బస్సులు నడుపుతోంది. ఈ క్రమంలో నగరంలో ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకురావాలని సంస్థ యోచిస్తోంది. ఇందులో భాగంగానే ప్రయాణికులను త్వరగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు జేఎన్ ఎన్‌యూఆర్‌ఎం ఎక్స్‌ప్రెస్ బస్సులను నడిపించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ బస్సులను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేతుల మీదుగా బుధవారం ఉదయం 11 గంటలకు హన్మకొండలోని జవహలాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.