ఇళ్ల నిర్మాణంపై అధికారులతో సమీక్షిస్తున్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఏడాది జూన్‌లోగా హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. రాజధానిలోని మొత్తం 109 ప్రాంతాల్లో లక్ష ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. బేగంపేటలోని మెట్రోరైల్ భవనంలో బుధవారంఆయన జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి, ఇతర అధికారులతో ఇళ్ల నిర్మాణంపై సమీక్షించారు. ఇళ్ల నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అడ్డంకులను తొలగిస్తూ ముందుకు వెళ్తున్నామని అధికారులు మంత్రికి నివేదించారు.
ఇదే వేగంతో పనులు కొనసాగితే వచ్చే డిసెంబర్‌లోగా 40 వేల ఇళ్లు నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటాయన్నారు. మిగిలిన ఇళ్లను వచ్చే ఏడాది జూన్‌లోగా పూర్తి చేస్తామని అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణంలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలను మరింతగా భాగస్వాములను చేయడం ద్వారా పర్యవేక్షణ, నిర్మాణ వేగం పెరుగుతుందన్నారు. నియోజకవర్గాలవారీగా నిర్మిస్తున్న ఇళ్ల సంఖ్య, ప్రాంతాల వివరాలతో జాబితా రూపొందించి స్థానిక ఎమ్మెల్యేలకు అందించాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం పారదర్శక విధానాన్ని రూపొందించేందుకు కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది, జీహెచ్‌ఎంసీ, హౌసింగ్ బోర్డు అధికారులు చర్చించాలని కేటీఆర్ సూచించారు. ఆధార్, బయోమెట్రిక్, సమగ్ర కుటుంబ సర్వే వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని లోపరహిత విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు.
జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, రాజీవ్ గృహకల్ప ప్రాజెక్టుల కింద మిగిలిపోయిన 13 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అవసరమైతే అదనపు నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. వందలు, వేలల్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో రోడ్లు, తాగునీటి సరఫరా, పోలీస్ స్టేషన్ల వంటి మౌలిక వసతుల కల్పన కోసం వివిధ శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి అన్ని వసతులు కల్పించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment