సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరగాలన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని గృహ నిర్మాణ కార్యక్రమాలపై హౌసింగ్ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలసి ఆయన గురువారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ, హౌసింగ్ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ గ్రేటర్ పరిధిలో ఉన్న ఇతర జిల్లాల కలెక్టర్లతో కలసి లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని సూచించారు.
జీహెచ్‌ఎంసీ కోసం ఇతర జిల్లాల పరిధిలో కడుతున్న ఇళ్లలో పది శాతం లేదా 1,000 మించకుండా స్థానికులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుందని మంత్రులు తెలిపారు. గతంలో ఇల్లు పొందిన వారికి మరోసారి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు రాకుండా చూడాలని సూచించారు. డబుల్ ఇళ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో గ్రీనరీకి ప్రాధాన్యం ఇవ్వాలని, ఇప్పటి నుంచే అక్కడ మొక్కల పెంపకం చేపట్టాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికలో హౌసింగ్ శాఖ అధికారులతో కలిసి పనిచేయాలని అధికారులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచించారు. త్వరలోనే మరోసారి హౌసింగ్ శాఖ అధికారులతో సమావేశం అవుతామని కేటీఆర్ తెలిపారు. సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, హౌసింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment