జమ్మూకశ్మీర్ ఓటర్లకు ఫరూక్ అబ్దుల్లా హెచ్చరిక
శ్రీనగర్: ‘ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి..ఢిల్లీ పంపిన వ్యక్తులతో జాగ్రత్త ఉండండి..! మారు వేషంలో ఉన్న దయ్యాలను తిరస్కరించండి’అంటూ నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ)చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఓటర్లను హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో ఎన్‌సీ, కాంగ్రెస్‌ల కూటమి అసెంబ్లీలో మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాలేదని ఆయన కుండబద్దలు కొట్టారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి అక్టోబర్ ఒకటో తేదీన జరిగే మూడో, చివరి విడత ఎన్నికలు ఆదివారం సాయంత్రంతో ప్రచారం గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఓటర్లు విజ్ఞతతో ఓటేయాలన్నారు. ‘చేయి (కాంగ్రెస్ ఎన్నికల గుర్తు) కనిపిస్తే చేతికే ఓటేయండి. నాగలి(ఎన్‌సీ ఎన్నికల గుర్తు) కనిపిస్తే నాగలికే ఓటేయండి’అని కోరారు.
బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్‌ను కేంద్రంలోని బీజేపీయే రంగంలోకి దించిందని ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. ఓటర్లలో విభజనలు తెచ్చేందుకే ఆయన ప్రయతి్నస్తున్నారన్నారు. ‘దేశంలోని ముస్లింలను ఎలా చూస్తున్నారో ఆయనకు తెలుసు. అదే వైఖరిని ఇక్కడా తేవాలని బీజేపీ ప్రయతి్నస్తోందన్న విషయం రషీద్ గ్రహించడం లేదు. చివరికి ఆయనకు కూడా అదేగతి పట్టొచ్చు. రషీద్‌ను చూస్తే జాలేస్తోంది.’అని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌కు ఎన్నికల తర్వాత రాష్ట్ర హోదా ఇస్తామన్న బీజేపీ వ్యాఖ్యలపై ఆయన..బీజేపీ చెప్పేదొకటి, చేసేదొకటి అని పేర్కొన్నారు.
చర్చలతోనే కశ్మీర్‌కు పరిష్కారం
‘ఉగ్రవాదం తీవ్రస్థాయిలో ఉంది. దీనిని అంతం చేయాలంటే ఒక్కటే మార్గం. ప్రజలందరినీ మనతో కలుపుకుని ముందుకు వెళ్లడం’అని వ్యాఖ్యానించారు. సమస్య పరిష్కారానికి పొరుగుదేశాలతో చర్చలు మేలన్న అభిప్రాయాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ‘పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తే పురోగమిస్తాం, వేగంగా ముందుకు సాగుతాం.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌పై డబ్బు ఖర్చు చేయడం కంటే మన ప్రజలను మరింత అభివృద్ధి చేయడం ఉత్తమం. ఈ విషయంలో సార్క్‌ను బలోపేతం చేయాలి.
భారత్ పెద్దన్న పాత్ర పోషించాలి. ఇరుగుపొరుగుతో స్నేహ సంబంధాలు సాగించలేకుంటే ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగుతాయి’అని అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. కశ్మీర్ ఎన్నికలకు విదేశీ ప్రతినిధులు రావడంపై ఆయన..కశ్మీర్ భారత్‌లో భాగమని వారనుకుంటున్నారా? భారత్‌లో మేం భాగమే అయితే, కశ్మీర్‌కు మాత్రమే వాళ్లు ఎందుకొస్తున్నట్లు? హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఎన్నికలప్పుడు ఎందుకు వెళ్లరు?’అని ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. ‘విదేశీ ప్రతినిధులను అనుమతిస్తున్న ప్రభుత్వం..విదేశీ జర్నలిస్టులపై ఆంక్షలు పెడుతోంది. నిజాలు బయటకొస్తాయని కేంద్రం భయపడుతోంది’అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment