Delhi leaders
-
Farooq Abdullah: వాళ్లు ఢిల్లీ పంపిన వ్యక్తులు..జాగ్రత్త!
శ్రీనగర్: ‘ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి..ఢిల్లీ పంపిన వ్యక్తులతో జాగ్రత్త ఉండండి..! మారు వేషంలో ఉన్న దయ్యాలను తిరస్కరించండి’అంటూ నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఓటర్లను హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో ఎన్సీ, కాంగ్రెస్‌ల కూటమి అసెంబ్లీలో మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి అక్టోబర్ ఒకటో తేదీన జరిగే మూడో, చివరి విడత ఎన్నికలు ఆదివారం సాయంత్రంతో ప్రచారం గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఓటర్లు విజ్ఞతతో ఓటేయాలన్నారు. ‘చేయి (కాంగ్రెస్ ఎన్నికల గుర్తు) కనిపిస్తే చేతికే ఓటేయండి. నాగలి(ఎన్సీ ఎన్నికల గుర్తు) కనిపిస్తే నాగలికే ఓటేయండి’అని కోరారు. బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్‌ను కేంద్రంలోని బీజేపీయే రంగంలోకి దించిందని ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. ఓటర్లలో విభజనలు తెచ్చేందుకే ఆయన ప్రయతి్నస్తున్నారన్నారు. ‘దేశంలోని ముస్లింలను ఎలా చూస్తున్నారో ఆయనకు తెలుసు. అదే వైఖరిని ఇక్కడా తేవాలని బీజేపీ ప్రయతి్నస్తోందన్న విషయం రషీద్ గ్రహించడం లేదు. చివరికి ఆయనకు కూడా అదేగతి పట్టొచ్చు. రషీద్‌ను చూస్తే జాలేస్తోంది.’అని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌కు ఎన్నికల తర్వాత రాష్ట్ర హోదా ఇస్తామన్న బీజేపీ వ్యాఖ్యలపై ఆయన..బీజేపీ చెప్పేదొకటి, చేసేదొకటి అని పేర్కొన్నారు. చర్చలతోనే కశ్మీర్‌కు పరిష్కారం ‘ఉగ్రవాదం తీవ్రస్థాయిలో ఉంది. దీనిని అంతం చేయాలంటే ఒక్కటే మార్గం. ప్రజలందరినీ మనతో కలుపుకుని ముందుకు వెళ్లడం’అని వ్యాఖ్యానించారు. సమస్య పరిష్కారానికి పొరుగుదేశాలతో చర్చలు మేలన్న అభిప్రాయాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ‘పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తే పురోగమిస్తాం, వేగంగా ముందుకు సాగుతాం.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌పై డబ్బు ఖర్చు చేయడం కంటే మన ప్రజలను మరింత అభివృద్ధి చేయడం ఉత్తమం. ఈ విషయంలో సార్క్‌ను బలోపేతం చేయాలి. భారత్ పెద్దన్న పాత్ర పోషించాలి. ఇరుగుపొరుగుతో స్నేహ సంబంధాలు సాగించలేకుంటే ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగుతాయి’అని అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. కశ్మీర్ ఎన్నికలకు విదేశీ ప్రతినిధులు రావడంపై ఆయన..కశ్మీర్ భారత్‌లో భాగమని వారనుకుంటున్నారా? భారత్‌లో మేం భాగమే అయితే, కశ్మీర్‌కు మాత్రమే వాళ్లు ఎందుకొస్తున్నట్లు? హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఎన్నికలప్పుడు ఎందుకు వెళ్లరు?’అని ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. ‘విదేశీ ప్రతినిధులను అనుమతిస్తున్న ప్రభుత్వం..విదేశీ జర్నలిస్టులపై ఆంక్షలు పెడుతోంది. నిజాలు బయటకొస్తాయని కేంద్రం భయపడుతోంది’అని వ్యాఖ్యానించారు. -
రాయితీ బస్సు కోట్లు మేసింది!
జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద కేంద్రం ఆర్టీసీకి బస్సులు ఇచ్చింది. వీటి వ్యయంలో 35% నాటి యూపీఏ ప్రభుత్వం భరించింది. వాటి విలువను లెక్కకడితే ఒక్కో బస్సుపై ఆ మొత్తం రూ.7 లక్షల వరకు అవుతుంది. అంటే అంతమేర ఆర్టీసీకి ఆదా అయినట్లే. కానీ ఒక్కో బస్సు వల్ల తెలంగాణ ఆర్టీసీకి ఇప్పుడు రూ.9 లక్షల చిల్లు పడింది. కేంద్రం సహకరిస్తే ఆర్టీసీ లాభాల బాట పట్టాల్సింది పోయి ఈ నష్టమేంటన్న అనుమానం, ఆశ్చర్యం కలగడం సహజం. ఈ కథ వెనక మర్మం తెలియాలంటే ఆర్థికమాంద్యం నాటి పరిస్థితిలోకి తొంగి చూడాలి. అలా చూస్తే ఓ కుంభకోణం కనిపిస్తుంది. దాని మూల్యం ఆర్టీసీకి భారీ నష్టం.. దాదాపు రూ.80 కోట్ల వరకు నష్టం ఉంటుందని అంచనా. 2011లో నాటి యూపీఏ ప్రభుత్వం జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద రాష్ట్రాల రవాణా సంస్థలకు సబ్సిడీపై బస్సులు అందించాలని నిర్ణయించింది. పథకం తొలి విడతలో హైదరాబాద్‌కు 600 బస్సులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తం వ్యయంలో కేంద్రం 35 శాతం, రాష్ట్రప్రభుత్వం 15 శాతం భరించాల్సి ఉండగా మిగతా 50 శాతం ఆర్టీసీ వ్యయం చేయాల్సి ఉంది. సగం ఖర్చుతో అన్ని బస్సులు రావటం ఆర్టీసీకి బాగా కలిసొస్తుందని అప్పట్లో భావించారు. అక్కడే కథ అడ్డం తిరిగింది. సంవత్సరం తిరిగే సరికి వాటి అసలు రూపం బయటపడటంతో ఆర్టీసీ బెంబేలెత్తాల్సి వచ్చింది. బస్‌బాడీ మొత్తం ఎక్కడికక్కడ ఊడిపోవడం మొదలైంది. కొన్ని బస్సుల ఇంజిన్లలో సరైన నాణ్యత లేక కాస్త ఎత్తు రోడ్డు వచ్చేసరికి బస్సు ఫెయిల్ కావటం సాధారణమై పోయింది. దీంతో వాటి నిర్వహణ దినదినగండంగా మారింది. ఆక్యుపెన్సీ రేషియో కూడా పడిపోయింది. సాధారణంగా సిటీ బస్సులు లీటర్ డీజిల్‌కు 5 కి.మీ. వరకు తిరిగితే ఇవి 3 కి.మీ. ఇవ్వటం కూడా గగన మైంది. ఈ బస్సులు ఇక నడవలేని స్థితిలోకి రావటంతో వాటికి కొత్త బాడీ రూపొందించటం మినహా పరిష్కారం లేదని నిపుణులు తేల్చటంతో ఆ పని ప్రారంభించింది. ఆర్థికమాంద్యం పేరుతో మోసం.. 2010లో దేశం ఆర్థిక మాంద్యం దెబ్బకు విలవిల్లాడింది. ఆ సమయంలో చాలా కంపెనీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అదే సమయంలో కొందరు ఢిల్లీ స్థాయి బడా నేతలు రంగప్రవేశం చేశారు. ఆర్థికమాంద్యంతో దెబ్బతిన్న కంపెనీలకు ప్రభుత్వం చేయూతనందించాలని, ఇందుకు ప్రత్యేక చర్యలు అవసరమని కేంద్రాన్ని నమ్మించారు. ఆ క్రమంలోనే ఈ బస్సుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ కొనుగోలు వ్యవహారం అంతా లోపాలపుట్టగా మారింది. ఏమాత్రం నాణ్యత లేని బస్సులను అంటగట్టేశారు. కేంద్రం భారీ సంఖ్యలో బస్సులను కొన్న ఈ వ్యవహారంలో నేతలు మధ్యవర్తులుగా వ్యవహరించి పెద్దమొత్తంలో కమీషన్లు దండుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో నాణ్యతలేని బస్సులను సరఫరా చేసి కొన్ని కంపెనీలు ఆర్థికమాంద్యం నష్టాన్ని పూడ్చుకున్నాయని చెబుతున్నారు. - సిటీ బస్సులకు ఆర్టీసీ అల్యూమినియం బాడీలను వాడుతోంది. కానీ జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులు ఎంఎస్ (స్టీల్) బాడీతో రూపొందించారు. - ఆర్టీసీ డిపోల్లో బస్సులను క్రమం తప్పకుండా కడుగుతారు. బస్సును కడిగాక ఆరబెట్టే ఏర్పాట్లు లేవు. అల్యూమినియం బాడీతో సమస్య ఉండదు. స్టీల్ బాడీలపై తడి నిలిచి తప్పు పడుతోంది. అసలే నాణ్యత లేని రేకులు కావటం, తుప్పు పట్టడంతో జాయింట్లు ఊడిపోతున్నాయి. - సూపర్‌లగ్జరీ బస్సులకు ఎంఎస్ బాడీ వాడుతున్నారు. 8 లక్షల కిలోమీటర్లు తిరిగాక పాత బాడీ తొలగించి అల్యూమినియంతో కొత్త బాడీ నిర్మించి వాటిని పల్లెవెలుగు బస్సుల్లాగా తిప్పుతున్నారు. - ఈ బస్సుల కొనుగోలులో 15% భరించాల్సిన రాష్ట్రప్రభుత్వం చేతులెత్తేయటంతో ఆ మొత్తాన్ని కూడా ఆర్టీసీనే భరించాల్సి వచ్చింది. ఈ రూపంలో నష్టం మరింత పెరిగింది. రోజుకో బస్సు రీమోడలింగ్ మియాపూర్‌లో ఉన్న ఆర్టీసీ సొంత బస్‌బాడీ యూనిట్లో బస్సుకు కొత్త బాడీ తయారు చేసి ఇంజిన్ ఓవర్‌హాలింగ్ చేసి వాటికి కొత్త రూపునిస్తోంది. ఇలా ఒక్కో బస్సును పూర్తి స్థాయిలో మార్చేందుకు ఆర్టీసీకి దాదాపు రూ.9 లక్షల వరకు ఖర్చవుతోంది. ఇలా ఏడాదిగా 250 బస్సులకు కొత్త రూపునిచ్చింది. మరో 350 బస్సులను ఇంకో ఏడాదిలో సిద్ధం చేయాలని నిర్ణయించింది. మొత్తం ప్రాజెక్టు కోసం ఆర్టీసీ రూ.50 కోట్ల వరకు ఖర్చు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. ఈ బస్సులను అందించినప్పుడు కేంద్రం రూ.40 కోట్ల మేర భరించగా, ఇప్పుడు ఆర్టీసీ రూ.50 కోట్లకుపైగా నష్టపోతోంది. ఇన్నేళ్లు వాటి నిర్వహణ కోసం చేసిన ఖర్చు మరో రూ.30 కోట్ల వరకు అయి ఉంటుందని అంచనా. కంపెనీలు, రాజకీయ నేతలు మిలాఖత్ అయితే ఎలా ఉంటుంది.. కమీషన్ల నీడలో కోరుకున్న పనులు చకచకా జరిగిపోతాయి. ఆ కోవలోదే ఈ బస్సు కథ. జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం).. యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఉదాత్త పథకం. కానీ కమీషన్ల ముఠా దీన్నీ వదల్లేదు. ఆ పథకంలో ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకుని అందినంత దండుకుంది. – సాక్షి, హైదరాబాద్ -
గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నేతలెందుకు..?
గ్రేటర్ ఎన్నిక ల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ నుంచి పెద్ద నాయకులను తీసుకొచ్చి ప్రచారం చేయించాలని కొందరు నాయకులు పట్టుపడుతుండగా, ఎందుకు అనవసర ప్రయాస అని మరికొందరు దానిని కొట్టిపారేస్తున్నారు. మొన్ననే కదా వరంగల్ ఎంపీ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో .పెద్దనాయకులను తీసుకొచ్చి తలబొప్పికట్టించుకున్న సంగతిని అప్పుడే మరిచిపోయారా అని ఈ ఎన్నికల్లో హైకమాండ్ నేతల ప్రచారాన్ని వ్యతిరేకిస్తున్న నేతలు అంటున్నారట. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ మొదలుకుని, కేంద్ర మాజీ మంత్రులు సుశీల్‌కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, సచిన్‌పెలైట్ వంటి వారిని తీసుకొచ్చినా వరంగల్ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కలేదని వారు వాపోతున్నారట. ఈ పరిస్థితుల్లో గ్రేటర్ వంటి గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నేతలెందుకు, వారొచ్చినా జాతీయసమస్యలు, అంశాలపై మాట్లాడగలరు కాని గల్లీ పాలిటిక్స్‌పై ఏమి చెప్పగలరని ప్రశ్నిస్తున్నారట. ఈ ఎన్నికలకు కూడా జాతీయనాయకులను తీసుకొచ్చినా తగినన్ని సీట్లు రాకపోతే పార్టీ గాలిపోతుందని, అందువల్ల హైకమాండ్ నేతల ప్రచారం వద్దే వద్దని వారు భీష్మించుకుని కూర్చున్నారట. అయితే గులాంనబీఆజాద్, ఇతర నాయకుల అనుయాయులు, అనుచరులు మాత్రం, హైకమాండ్ ప్రతినిధులు వచ్చి ప్రచారం చేయాల్సిందేనని పట్టుబడుతున్నారట. తమ నేతలను ప్రచారానికి తీసుకొచ్చి తమ పట్టును చూపించుకోవాల్సిందేనని చెబుతున్నారట. మళ్లీ ఢిల్లీలో హైకమాండ్ నేతల హవా పెరిగితే ఏదో ఒక పదవో, ఎన్నికల్లో టికెట్టో దొరకకపోతుందా అన్నదే ఈ నాయకుల ధ్యాసంతా అని ఢిల్లీనేతల ప్రచారాన్ని వ్యతిరేకిస్తున్న వారు గొణుక్కుంటున్నారట. -
బీజేపీ పీఠానికి పోటీ
- రంగంలో న లుగురు నేతలు - ఢిల్లీలో రాయబారాలు - 9వ తేదీలోగా ఖరారు చెన్నై, సాక్షి ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్ష స్థానానికి గతంలో ఎన్నడూ లేని విధంగా పోటీ నెలకొంది. రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు తమదైన శైలిలో రాజకీయం నెరపుతున్నారు. ఏడాది క్రితం వరకు రాష్ట్రంలో బీజేపీ ఒక నామమాత్రపు జాతీయ పార్టీ. ఢిల్లీ నేతలు చెన్నైకి చేరుకున్నపుడు అడపాదడపా మినహా ఎన్నడూ తగిన ప్రాధాన్యత లేని పార్టీ. రాష్ట్ర అధ్యక్షుని స్థానం నుంచి సాధారణ కార్యక ర్తలు దొరికేదే కష్టం. గత ఏడాది రాష్ట్రంలో న రేంద్రమోడీ సుడిగాలి పర్యటనలు సాగించడం ద్వారా పార్టీ చరిష్మానే మార్చివేశారు. తమిళ ప్రజలను పెద్ద సంఖ్యలో పార్టీవైపు తిప్పుకోగలిగారు. ఇందుకు కొనసాగింపు అన్నట్లుగా కేంద్రంలో బీజేపీ ఒంటరిగా అధికారంలోకి రావడంతో ఇప్పుడు సీను మారింది. అన్ని స్థానాలకు గిరాకీ ఏర్పడింది. పార్టీ పదవులకు గట్టి పోటీ ఏర్పడింది. కేంద్రంలో తమ ప్రభుత్వమేనని గర్వంగా చెప్పుకునే నేతలంతా రాష్ట్ర స్థాయి పార్టీ పదవులకు పోటీ పడుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర మంత్రిగా మారడంతో ఆయన స్థానంలో అమిత్‌షా అధ్యక్షులయ్యూరు. రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ కన్యాకుమారి నుంచి ఎంపీగా ఎన్నికై కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కించుకోవడంతో ఇక్కడ ఖాళీ ఏర్పడింది. బీజేపీ సిద్ధాంతాల ప్రకారం ఒక వ్యక్తికి ఒకే పదవి ప్రాతిపదికన పొన్ రాధాకృష్ణన్‌కు వారసుడిని ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తుండగా ఇంతవరకు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనేది తేలలేదు. పార్టీ సీనియర్ నేత ఇల గణేషన్ పేరును ప్రతిపాదించగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. కేంద్రం మంత్రి పదవి లేదా గవర్నర్ గిరిని ఆయన ఆశిస్తున్నారు. ఇల గణేషన్ అంగీకరించి ఉంటే అధ్యక్ష పదవి ఏకగ్రీవమయ్యేది. ఆయన కాదు అన్న తరువాత అనేకమంది పోటీకి ముందుకు వచ్చారు. పార్టీ సీనియర్ నేత హెచ్ రాజా, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సీపీ రాధాకృష్ణన్, నిర్వాహక ప్రధాన కార్యదర్శి మోహన్‌రాజ్ తదితరులు గట్టిగా పోటీపడుతున్నారు. వీరిలో రాజా, తమిళిసైలు పార్టీ అధిష్టానం దృష్టిలో ముందంజలో ఉన్నారు. ఢిల్లీలోని బీజేపీ పెద్దల వద్ద తమకున్న పలుకుబడిని ప్రయోగించి ఎలాగైన రాష్ట్ర పీఠం దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తమిళనాడుతోపాటూ ఉత్తరప్రదేశ్, అసోం రాష్ట్రాలకు అధ్యక్షుల నియామకంపై ఢిల్లీలో కసరత్తు జరుగుతుండగా, హెచ్ రాజా శుక్రవారం ఢిల్లీ పయనం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్తోపాటూ ఇతర పార్టీ పెద్దల దృష్టిలో తమిళిసైకు కూడా మంచి పేరుంది. దీంతో ఆమె చెన్నై నుంచి చక్రం తిప్పుతున్నారు. ఈనెల 9 వ తేదీలోగా రాష్ట్ర అధ్యక్షుని పేరును ప్రకటించే అవకాశం ఉండటంతో ప్రయత్నాలు ముమ్మరమయ్యూరు.