గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నేతలెందుకు..?
గ్రేటర్ ఎన్నిక ల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ నుంచి పెద్ద నాయకులను తీసుకొచ్చి ప్రచారం చేయించాలని కొందరు నాయకులు పట్టుపడుతుండగా, ఎందుకు అనవసర ప్రయాస అని మరికొందరు దానిని కొట్టిపారేస్తున్నారు. మొన్ననే కదా వరంగల్ ఎంపీ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో .పెద్దనాయకులను తీసుకొచ్చి తలబొప్పికట్టించుకున్న సంగతిని అప్పుడే మరిచిపోయారా అని ఈ ఎన్నికల్లో హైకమాండ్ నేతల ప్రచారాన్ని వ్యతిరేకిస్తున్న నేతలు అంటున్నారట.
లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ మొదలుకుని, కేంద్ర మాజీ మంత్రులు సుశీల్‌కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, సచిన్‌పెలైట్ వంటి వారిని తీసుకొచ్చినా వరంగల్ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కలేదని వారు వాపోతున్నారట. ఈ పరిస్థితుల్లో గ్రేటర్ వంటి గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నేతలెందుకు, వారొచ్చినా జాతీయసమస్యలు, అంశాలపై మాట్లాడగలరు కాని గల్లీ పాలిటిక్స్‌పై ఏమి చెప్పగలరని ప్రశ్నిస్తున్నారట.
ఈ ఎన్నికలకు కూడా జాతీయనాయకులను తీసుకొచ్చినా తగినన్ని సీట్లు రాకపోతే పార్టీ గాలిపోతుందని, అందువల్ల హైకమాండ్ నేతల ప్రచారం వద్దే వద్దని వారు భీష్మించుకుని కూర్చున్నారట. అయితే గులాంనబీఆజాద్, ఇతర నాయకుల అనుయాయులు, అనుచరులు మాత్రం, హైకమాండ్ ప్రతినిధులు వచ్చి ప్రచారం చేయాల్సిందేనని పట్టుబడుతున్నారట. తమ నేతలను ప్రచారానికి తీసుకొచ్చి తమ పట్టును చూపించుకోవాల్సిందేనని చెబుతున్నారట. మళ్లీ ఢిల్లీలో హైకమాండ్ నేతల హవా పెరిగితే ఏదో ఒక పదవో, ఎన్నికల్లో టికెట్టో దొరకకపోతుందా అన్నదే ఈ నాయకుల ధ్యాసంతా అని ఢిల్లీనేతల ప్రచారాన్ని వ్యతిరేకిస్తున్న వారు గొణుక్కుంటున్నారట.