సాక్షి, హైదరాబాద్: సరిగ్గా నాలుగు నెలల క్రితం.. ఆర్టీసీ ఉద్యోగులకు 23 రోజులు ఆలస్యంగా జీతాలు అందాయి. ఆర్టీసీ చరిత్రలో ఇంత ఆలస్యంగా జీతాలు చెల్లించటం అదే తొలిసారి. ఇది ఆర్టీసీ పతనావస్థలో ఉందని చెప్పే ఉదంతం. అప్పటి వరకు ప్రభుత్వం ప్రతినెలా నిధులు కేటాయిస్తే తప్ప జీతాలు చెల్లించలేని దుస్థితి. కానీ ఇప్పుడు ఠంఛన్‌గా ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నారు. గతంలో మాదిరి ప్రతినెలా జీతాలపై ప్రభుత్వంపై ఆధారపడటం లేదు. ఇప్పుడు రోజువారీ టికెట్ ఆదాయం రూ.13 కోట్లకు చేరింది.
ఇది రెండున్నర ఏళ్ల తర్వాత నమోదవుతున్న గరిష్ట మొత్తం. దశాబ్దాలపాటు ప్రజలకు సేవలందించి.. ‘ఎర్రబస్సు’గా ఆప్యాయతను చూరగొన్న ఆర్టీసీ కథ దాదాపు ముగిసిపోయిందని, దాన్ని నడిపే పరిస్థితి లేక ప్రభుత్వం మూసేయబోతోందన్న వ్యాఖ్యలు సైతం వినిపించాయి. అలాంటి స్థితి నుంచి ఆర్టీసీ పడిలేచిన కెరటం మాదిరి శక్తిని కూడగట్టుకుంటోంది. ప్రగతి రథ చక్రాలు మళ్లీ సొంత శక్తితో పరుగు మొదలుపెట్టాయి. ఈ సంవత్సరం ముగింపులో ప్రజారవాణా సంస్థకు ప్రాణం పోస్తూ సంస్కరణలు ప్రారంభమయ్యాయి.
చదవండి: ఈ ఏడాది యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ ఏంటో తెలుసా?
బకాయిలు.. నష్టాలు..
రూ.మూడు వేల కోట్ల అప్పులు.. రూ.రెండు వేల కోట్ల నష్టాలు.. చమురు సంస్థలకు బకాయిలు.. గత వేతన సవరణ తాలూకు బకాయిలు.. ఇలాంటి తరుణంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్‌ను ప్రభుత్వం ఆర్టీసీ ఎండీగా నియమించింది. ఆర్టీసీ తిరిగి పుంజుకునేందుకు ఈ నియామకం దోహదపడుతుందన్న అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.
► తొలుత సిబ్బందికి ఒకటో తేదీనే జీతాలు ఇస్తామన్న నిర్ణయాన్ని వెల్లడించి దానికి కట్టుబడటం ద్వారా వారిలో సంస్థ పట్ల విశ్వాశాన్ని పాదుగొల్పే ప్రయత్నం చేశారు.
► ఈ ఉద్యోగం చేయలేం వీఆర్‌ఎస్ ఇవ్వండి అంటూ కొంతకాలంగా వేడుకుంటూ వస్తున్న సిబ్బందిలో ఇప్పుడు ఆ ఆవేదన కొంతమేర తగ్గింది. సంక్షోభానికి ముందులాగా ఉత్సాహంగానే డ్యూటీలకు వస్తున్నారు. పాత బకాయిల విషయంలో మాత్రం ఆగ్రహం అలాగే ఉంది.
చదవండి: TS: పబ్స్, హోటళ్లు, క్లబ్‌లు న్యూఇయర్ గైడ్ లైన్స్ పాటించాలి
► ఒకప్పుడు ఆసియాలోనే మంచి సహకార సంఘాల్లో ఒకటిగా వెలుగొందిన ఆర్టీసీ సహకార పరపతి సంఘం నాలుగేళ్లుగా చిక్కుల్లో పడింది. దాదాపు రెండేళ్లుగా సరిగా రుణాలు రావటం లేదు. ఏడాది కాలంగా పూర్తిగా కుంటుపడింది. 10 వేలకుపైగా దరఖాస్తులు పేరుకుపోయి ఉన్న తరుణంలో ఇప్పుడిప్పుడు మళ్లీ రుణాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
► ప్రస్తుతం బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 66 శాతానికి చేరుకుంది. ఇది రెండేళ్లలో గరిష్టం. ఇక రోజుకు 35 లక్షల కి.మీ. గరిష్ట స్థాయిలో బస్సులు తిరుగుతున్నాయి. గతంతో పోలిస్తే వేయి బస్సులు తగ్గినా దాన్ని అందుకోవడం విశేషం.
► కొత్త బస్సులు కొనే ప్రసక్తే లేదని కొంతకాలం క్రితం తేల్చి చెప్పిన ఆర్టీసీ.. ఇప్పుడు తీరు మార్చుకుంటోంది. కొత్త బస్సుల అవసరాన్ని గుర్తించి కొనేందుకు సిద్ధమైంది.
► ఆదాయం కోసం బస్సులపై అడ్డదిడ్డంగా ప్రకటనలు వేయించుకుని అందవిహీనంగా మారిన బస్సులు ఇప్పుడు మళ్లీ ఆర్టీసీ బస్సుల్లాగా మారాయి. ఆదాయం కూడా వదులుకుని ప్రకటనలను నిషేధించి బస్సులకు కొత్తగా రంగులద్దడం విశేషం.
► మందులకు, సాధారణ వైద్యానికి కూడా కొరగాకుండా పోయిన హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీస్థాయికి చేరుకుంటోంది. ఇప్పుడు అక్కడ డయాలసిస్‌తోపాటు చాలా రకాల వైద్యం అందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment