
ఆర్టీసీకి 1,391 కొత్త బస్సులు
► కొత్తగా 750 గ్రామాలకు రవాణా సౌకర్యం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ రికార్డు స్థాయిలో కొత్త బస్సులను రోడ్డెక్కించబోతోంది. ఈ ఏడాది 1,391 కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. రూ.350 కోట్లను ఇందుకోసం ఖర్చు చేయనుంది. ఇప్పటికే కొనుగోలు ఆర్డర్లను కూడా జారీ చేసింది. రాష్ట్రంలో 1,100 గ్రామాలకు ఆర్టీసీ బస్సులు వెళ్లటం లేదు. కొత్త బస్సులతో మొత్తం 750 గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించబోతోంది. అన్ని నియోజకవర్గ కేంద్రాల నుంచి భాగ్యనగరానికి ‘రాజధాని’ ఏసీ బస్సులు నడిపేందుకు అదనంగా 95 ఏసీ బస్సులను సమకూర్చుకోబోతోంది.
తొలిసారిగా 236 మినీ బస్సులను కూడా కొంటోంది. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉందన్న ఉద్దేశంతో గతంలో చాలా ఊళ్లకు బస్సులను నిలిపివేసింది. ఆ సమస్యకు మినీ బస్సులతో చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఇక ఇందులో 100 వరకు ఏసీ బస్సులుంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక సందర్భాల్లో ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇవ్వటంతోపాటు, నగరాల్లోని కాలనీల నుంచి వేరే ప్రాంతాలకు నడిపేందుకు వాటిని వాడతారని పేర్కొంటున్నారు. ఇవి కాకుండా 386 సూపర్ లగ్జరీ బస్సులు, 600 ఎక్స్‌ప్రెస్ బస్సులు, 74 పల్లెవెలుగు బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి.