సాక్షి, హైదరాబాద్: మీరు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినప్పుడు ఏం చేస్తారు. ఆదాయం పెంచుకునేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. రూపాయికి రూపాయి చేర్చి ఇబ్బందులను దూరం చేసుకుని ఆదాయాన్ని పెంపు చేసుకుంటారు. కానీ... ఆర్టీసీ దీనికి భిన్నం. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు తంటాలు పడుతున్న వేళ.. మంచి ఆదాయమార్గాన్ని కాలదన్నుకుంది. భారీగా ఆదాయంపొందే అవకాశం ఉన్నా, కమీషన్ల మత్తులో మునిగిపోయిన కొందరు అధికారులు దాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించి నామమాత్రపు ఆదాయంతో సరిపెట్టేందుకు తెరదీశారు. సంస్థ కంటే సొంతజేబు నింపుకునేందుకే ఓ ఉన్నతాధికారి తెరవెనుక చక్రం తిప్పినట్టు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మూడు రెట్లు ఆదాయం పొందే వీలున్నా...
దేశంలో తెలంగాణ ఆర్టీసీకి మంచి పేరుంది. దాదాపు 10,500 బస్సులతో 9 వేల గ్రామాలు, అన్ని పట్టణాలతో అనుసంధానమై ఉంది. ఇదే సమయంలో తక్కువ మోతాదు సరుకు రవాణాలోనూ ఆర్టీసీ బస్సులు కీలక భూమిక నిర్వహిస్తున్నాయి. ప్రైవేటు పార్సిల్ సర్వీసు ధరలతో పోలిస్తే ఆర్టీసీ బస్సుల్లో సరుకు తరలింపు తక్కువ ఖర్చుతో కూడుకున్నది, సురక్షితం కూడా కావటంతో చాలామంది దీనివైపు మొగ్గుతున్నారు. ఇప్పటివరకు ఈ సరుకు రవాణా బాధ్యతను ఆర్టీసీ ప్రైవేట్ సంస్థకు కట్టబెడుతూ వస్తోంది. ఆర్టీసీ ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతి కొనసాగింది. విడిపోయిన తర్వాత ఏపీఎస్ ఆర్టీసీ సొంతంగా నిర్వహిస్తూ ఆదాయాన్ని పెంచుకున్నా, తెలంగాణ ఆర్టీసీ మాత్రం సొంతంగా నిర్వహించే ఆలోచనను పక్కనపెట్టి ప్రైవేటుకు అప్పగించేందుకే మొగ్గు చూపుతోంది.
ఇటీవలి వరకు ఓ ప్రైవేటు సంస్థ ఆ బాధ్యతను చూసింది. ప్రస్తుతం దాని గడువు తీరిపోవటంతో తాజాగా ఆర్టీసీ మళ్లీ టెండర్లు పిలిచింది. ప్రస్తుతం ప్రైవేటు సంస్థ ఆర్టీసీకి సంవత్సరానికి రూ.కోటిన్నర మాత్రమే చెల్లిస్తోంది. కానీ సరుకు రవాణాను ఆర్టీసీనే సొంతంగా నిర్వహిస్తే ఆ మొత్తం రూ.20 కోట్లకు చేరుతుందని ఓ అంచనా. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున సొంతంగా సరుకు రవాణా నిర్వహిస్తూ ఆదాయాన్ని పెంచుకోవాలని యాజమాన్యానికి సూచనలు అందుతూనే ఉన్నాయి. నెల రోజుల క్రితం అప్పటి ఉన్నతాధికారి ఒకరు ప్రైవేటు సంస్థలతో సమావేశం ఏర్పాటుచేసి సరుకు రవాణాకు టెండర్లు పిలుస్తామని, ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని సూచించారు. శనివారం టెండర్లు ఆహ్వానించారు.
కమీషన్ల దందాయే కారణమా?
ఈ వ్యవహారం వెనక కమీషన్ల దందా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఆర్టీసీలో కీలక బాధ్యత నిర్వహించిన ఓ ‘అధికారి’కమీషన్లకు అలవాటుపడి సంస్థ ఆదాయాన్ని సొంత జేబులోకి మళ్లించాడన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. ఆ అధికారి నిర్వాకం వల్లనే ఆర్టీసీ నష్టాలు మూటగట్టుకున్నదన్న వాదనా ఉంది. ఇప్పుడు మరోసారి టెండర్ల వ్యవహారంతో ఆ విషయం చర్చనీయాంశమైంది. గతంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీపై సమీక్ష సందర్భంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేం దుకు ఆయన సూచన మేరకు రెవెన్యూ విభాగాన్ని ఏర్పాటుచేసి ఈడీ స్థాయి అధికారికి అప్పగించారు. కానీ సీఎం ఆదేశాలను ధిక్కరించి సరుకు రవాణా రూపంలో భారీ ఆదాయం వచ్చే వీలున్నా... ప్రైవేటు సంస్థకు కట్టబెట్టి మరోసారి ఆర్టీసీ ఖజానాపై దెబ్బకొట్టేందుకు సిద్ధమయ్యారు.
ఐఏఎస్/ఐపీఎస్‌కు అప్పగించాలి
ఆర్టీసీని అస్తవ్యస్త విధానాలతో తీవ్ర నష్టాలపాలు జేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత రూ.2,500 కోట్ల నష్టాలు వచ్చి పడ్డాయి. కానీ బాధ్యులను గుర్తించలేదు. ఇకనైనా బాధ్యులను గుర్తించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆదాయం వచ్చే మార్గాలను కూడా కమీషన్ల కోసం మళ్లిస్తున్నవారిని వదలొద్దు. ఆర్టీసీని బాగుచేయాలంటే వెంటనే మంచి పేరున్న ఐఏఎస్ అధికారికి గానీ, ఐపీఎస్ అధికారికిగానీ అప్పగించాలి. కనీసం కార్మికులకు యూనిఫామ్ ఇచ్చే స్థితిలో కూడా లేని సంస్థను వెంటనే గాడిలో పెట్టాల్సిన అవసరముంది.
– ఎన్‌ఎంయూ నేత నాగేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment