ఇక ఆర్టీసీ మోత!
* 15 శాతం వరకు చార్జీలు పెంచేందుకు ఆర్టీసీ కసరత్తు
* రూ. 450 కోట్ల వరకు భారం పడే అవకాశం
* సిబ్బంది వేతన సవరణ కోసం టికెట్ ధరల పెంపు యోచన
* వ్యాట్, ఎంవీ ట్యాక్స్ రీయింబర్స్ చేయాలని సర్కారును కోరనున్న ఆర్టీసీ
* త్వరలో ముఖ్యమంత్రిని కలిసి ప్రతిపాదించనున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు చార్జీల మోత మోగనుంది.. దాదాపు 15 శాతం వరకు చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఉద్యోగులకు వేతన సవరణను అమలు చేయడానికి, నష్టాలను తగ్గించుకోవడానికి చార్జీలు పెంచడమే శరణ్యమని ఆ సంస్థ భావిస్తోంది. వేతన సవరణ రూపంలో ఎదురయ్యే భారాన్ని భరిం చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్టీసీ కోరనుంది. ఇందుకు సర్కారు ముందుకు రాని పక్షంలో చార్జీలు పెంచుకొనేందుకు అనుమతించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనుంది. సోమవారం హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ బహిరంగసభ జరుగనున్న నేపథ్యంలో.. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో సీఎం కేసీఆర్‌ను కలిసి ఈ మేరకు ప్రతిపాదనను ఆయన దృష్టికి తీసుకురానుంది. దీనికి సీఎం ఆమోదిస్తే.. త్వరలోనే ఆర్టీసీ బస్సు చార్జీలు పెరగనున్నాయి.
వేతనాల పెంపు కోసం..
ఆర్టీసీలో వేతన సవరణ గడువు 2013 మార్చితో ముగిసింది. అప్పటి నుంచి పీఆర్సీ పెండింగ్‌లో ఉంది. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన నేపథ్యంలో... వారితో సమంగా తమ వేతనాలనూ సవరించాలని ఆర్టీసీ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. దీనికి అంగీకరిస్తే తెలంగాణ ఆర్టీసీపై రూ.700 కోట్ల వరకు భారం పడనుంది. అయితే అంత భారం మోయలేమని కార్మిక సంఘం నేతలకు ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో కార్మిక నేతలు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ విషయాన్ని సంస్థ ఎండీ సాంబశివరావు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మరోవైపు భారీగా సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన నేపథ్యంలో ప్రభుత్వానికి ఇప్పటికే నిధుల సమీకరణ కష్టంగా మారింది. ఇలాంటి తరుణంలో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల మొత్తాన్ని భరించాలంటే సర్కారుకు ఇబ్బందే. దీంతో ఆర్టీసీ చార్జీల పెంపు మినహా మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు.
సిబ్బందికి 33% వరకూ ఫిట్‌మెంట్
ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లుగా తమకూ 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నా.. 33 శాతంలోపే స్థిరీకరించే దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లకోసారి వేతన సవరణ జరుగుతుంది. కానీ ఆర్టీసీలో అది నాలుగేళ్లకోసారే జరుగుతుంది. ఈ లెక్కన 33 శాతం ఫిట్‌మెంట్ సరిపోతుందనే వాదన తెరపైకి వచ్చింది. ఇలా అయినా కూడా రూ.450 కోట్ల వరకు భారం పడుతుంది.
ఆదుకోవాలని విజ్ఞప్తి..
ప్రస్తుతం ఆర్టీసీ డీజిల్‌పై 22.5 శాతం చొప్పున వ్యాట్ చెల్లిస్తోంది. దీనిని ప్రభుత్వం రీయింబర్స్ చేయాలని ఆర్టీసీ కోరుతోంది. సర్కారు అంగీకరిస్తే రూ.250 కోట్లు మిగులుతాయి. ఇక అయితే ఇటీవల ఆటోలు, వ్యవ సాయ ట్రాక్టర్‌లకు ఇచ్చినట్లుగానే ఆర్టీసీ బస్సులకు ఈ పన్ను మినహాయింపు ఇవ్వాలని యాజమాన్యం కోరనుంది. దీనికి ప్రభుత్వం అంగీకరిస్తే రూ.275 కోట్ల వరకు భారం తగ్గుతుంది. అలాగే వరుసగా మూడేళ్ల పాటు ఏటా వెయ్యి బస్సుల చొప్పున కొనేందుకు ప్రభుత్వం సాయం చేయాలని.. ఇందుకు ఏటా రూ.250 కోట్లు చొప్పున గ్రాంట్ ఇవ్వాలని కోరనుంది.
కనీసం 15 శాతం..
15 శాతం వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతించాలని సీఎంను కోరాలని ఆర్టీసీ భావిస్తున్నట్టు సమాచారం. ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా 25 శాతం చార్జీల పెంపును ప్రతిపాదించాలని అధికారులు భావించారు. కానీ అంత భారీ పెంపునకు అనుమతి లభించదనే ఉద్దేశంతో 15 శాతానికి తగ్గకుండా పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నట్టు తెలిసింది. 15% పెంచితే సాలీనా ప్రజలపై దాదాపు రూ.450 కోట్ల వరకు భారం పడనుంది. చార్జీల పెంపునకు ప్రభుత్వం ఓకే చెబితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆర్టీసీ చార్జీలు పెంచినట్లు అవుతుంది. 2004 నుంచి 2009 వరకు వైఎస్ సీఎంగా ఉండగా చార్జీలు పెంచలేదు. ఆ తర్వాత వరుసగా మూడేళ్ల పాటు చార్జీలు పెంచారు. విభజన జరిగిన 2014లో మాత్రం చార్జీలు పెంచలేదు.