తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు
హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు త్వరలో చార్జీల మోత మోగనుంది. తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల వడ్డనకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో చార్జీల బాదుడుకు షురూ అయింది. అధికారులు బుధవారం ముఖ్యమంత్రితో సమావేశమై విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను వివరించారు.
ఈ సందర్భంగా సామాన్య, గృహ వినియోగదారులపై అదనపు భారం పడకుండా విద్యుత్ చార్జీల పెంపుకు కేసీఆర్ ఆమోదం తెలిపారు. 100 యూనిట్ల లోపు ఎలాంటి పెంపుదల ఉండదని.. 100 యూనిట్ల పైబడి స్వల్ప పెరుగుదల ఉంటుందని సమాచారం. విద్యుత్ చార్జీల పెంపుకు అధికారులు ప్రతిపాదనలు ఇవ్వగా, ఏ మేరకు విద్యుత్ చార్జీల పెంచాలన్నదానిపై గురువారం తుది నిర్ణయం వెలువడనుంది.
మరోవైపు ఆర్టీసీ చార్జీలు 10 శాతం పెంచనున్నారు. 30 కిలోమీటర్ల లోపు పల్లెవెలుగు బస్సుల్లో రూపాయి, 30 కిలోమీటర్ల పైన 2 రెండు రూపాయలు, పల్లె వెలుగు మినహా మిగతా బస్సుల్లో 10 శాతానికి మించకుండా ఛార్జీలు పెంచాలని నిర్ణయించారు.