
పోలీస్ బాస్ వచ్చేశారు
ఇక నెలలో 15 రోజులు ఇక్కడే
క్యాంపు కార్యాలయం ప్రారంభం
దశలవారీగా ఇతర విభాగాల రాక
ఇకపై డీజీపీ జె.వి.రాముడు కూడా నెలలో సగం రోజులు నగరంలోనే మకాం వేస్తారు. బుధవారం ఆయన తన క్యాంపు ఆఫీసును ప్రారంభించి పనుల పురోగతిని పరిశీలించారు.
విజయవాడ సిటీ : పోలీస్ బాస్ డీజీపీ జె.వి.రాముడు ఇకపై నెలలో 15 రోజులు ఇక్కడే ఉంటారు. ఇదే విషయాన్ని బుధవారం నగరానికి వచ్చిన ఆయన స్పష్టం చేశారు. వారంలో కొన్ని రోజులు తాను ఇక్కడే అందుబాటులో ఉంటానని వెల్లడించారు. తన క్యాంప్ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సీఎస్‌ఐ ఎదురుగా ఉన్న ఇరిగేషన్ శాఖ ఎస్‌ఈ బంగళాను డీజీపీ నివాస భవనంగా తీర్చిదిద్దుతున్నారు. పక్కనే ఉన్న ఆఫీసర్స్ క్లబ్ స్థలంలో పోలీసు ప్రధాన కార్యాలయం ఏర్పాటుచేయాలనేది అధికారుల నిర్ణయం. అనంతరం డీజీపీ క్యాంపు కార్యాలయం, పోలీసు ప్రధాన కార్యాలయం నిర్మాణ పనులను పరిశీలించి పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో 15 రోజుల్లో పనులన్నీ పూర్తి చేయాలని సంబంధిత వ్యక్తులను ఆదేశించారు. చేయలేని పక్షంలో మరొకరికి అప్పగిస్తామని హెచ్చరించారు. ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలించి, ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలో వారికి వివరించారు. వెంటనే ఆయా పనులను పూర్తిచేయాలని ఆదేశించారు.
తొలి అడుగు...
ఇది తొలి అడుగని, రానున్న రోజుల్లో అన్ని విభాగాలూ దశలవారీగా ఇక్కడికి తరలి వస్తాయని డీజీపీ రాముడు స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయం ప్రారంభించిన తర్వాత పోలీసు అతిథి గృహంలో కొద్దిసేపు ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతి కమిషనరేట్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఎప్పుడో పంపామని, ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ముందుకెళతామని చెప్పారు. రాజధాని పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించాల్సి ఉంటుందన్నారు. శాస్త్రీయ పద్ధతిలో వీటిని అధిగమించనున్నట్టు తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో పోలీసింగ్...
స్మార్ట్ సిటీల నిర్మాణంలో పోలీసు శాఖ నుంచి భద్రత కల్పించటం ప్రధాన అంశమని డీజీపీ తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పోలీసింగ్‌కు చర్యలు చేపడతామన్నారు. ఇందులో భాగంగా సీఆర్‌డీఏ కమిషనర్‌తో చర్చించనున్నట్టు చెప్పారు. డీజీపీ వెంట నగర పోలీసు కమిషనర్ డి.గౌతమ్ సవాంగ్, ఐజీలు రాజీవ్‌కుమార్ మెహతా, సంజయ్, డీసీపీలు ఎల్.కాళిదాస్, జి.వి.జి.అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ విజయకుమార్, రైల్వే ఎస్పీ షిమోషీ బాజ్‌పాయ్ తదితరులున్నారు.