బాబు దుబారా భరించలేనంత..! | Another camp office in Hyderabad specially for Chandrababu | Sakshi
Sakshi News home page

బాబు దుబారా భరించలేనంత..!

Published Wed, Oct 16 2024 4:29 AM | Last Updated on Wed, Oct 16 2024 5:04 AM

Another camp office in Hyderabad specially for Chandrababu

2014–19 మధ్య చంద్రబాబు బంగ్లాలు, క్యాంపు ఆఫీసులు, హంగులకు భారీ వ్యయం

హైదరాబాద్, విజయవాడల్లో రెండేసి క్యాంపు ఆఫీసులు

ప్రత్యేకంగా హైదరాబాద్‌లో మరో క్యాంపు కార్యాలయం

భద్రత, సీసీ కెమెరాలు, రిపేర్ల పేరుతో ప్రజాధనం దుబారా

హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉన్నా, పార్క్‌ హయత్‌ హోటల్‌లో బస

పార్క్‌ హయత్‌ హోటల్‌కే రూ. 30 కోట్లు ఖర్చు

అప్పట్లోనే బాబు చేసిన దుబారా రూ.126.76 కోట్లు

సాక్షి, అమరావతి: ప్రజల సొమ్ము దుబారా చేయడంలో చంద్రబాబు కేరాఫ్‌ అడ్రస్‌. గతంలో 2014 – 19 మధ్య సీఎంగా ఉండగా ఆయన విలాసాలు, హంగు, ఆర్భాటం, సొంత ఇళ్లు, క్యాంప్‌ ఆఫీసులకు పెట్టిన ఖర్చు వంద కోట్లకు పైనే. ఆ ఐదేళ్లలో హైదరాబాద్‌లో రెండేసి బంగ్లాలు, రెండేసి క్యాంపు ఆఫీస్‌లు, విజయవాడలో రెండేసి క్యాంపు ఆఫీస్‌ల పేరుతో మరమ్మతులకు, సెక్యూరిటీ, సీసీ కెమేరాలు, పోలీస్‌ బరాక్‌లకు కోట్ల రూపాయల ప్రజా ధనం ఖర్చు చేశారు.

హైదరాబాద్‌లో ఏడు నక్షత్రాల పార్క్‌ హయత్‌ హోటల్‌లో ఉంటూ ప్రభుత్వ ఖజానా నుంచి ఏకంగా రూ.30 కోట్లు ఖర్చు చేశారు. చంద్రబా­బుకు హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉన్నప్పటికీ, స్టార్‌ హోటల్లో ఉంటూ కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేయడం గమనార్హం. ఇవన్నీ టీడీపీ సోషల్‌ మీడియాకు మచ్చుకు కూడా కనిపించడంలేదు. పైగా వైఎస్‌ జగన్‌ భద్రత కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటూ దుష్ప్రచారానికి దిగారు.

చంద్రబాబు 2014లో సీఎం అయిన తర్వాత హైదరాబాద్‌ మదీనాగూడలోని తన బంగ్లాను క్యాంపు ఆఫీస్‌గా ప్రకటించుకున్నారు. అలాగే బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 65లోని తన ఇంటిని కూడా సీఎం క్యాంపు ఆఫీస్‌గా ప్రకటించుకున్నారు. ఇవే కాకుండా హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌ను సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించుకున్నారు. 

ఇక విజయ­వాడలోని కలెక్టరేట్‌ కార్యాలయాన్ని, ఇరిగేషన్‌ గెస్ట్‌ హౌస్‌ను కూడా క్యాంపు కార్యాలయంగా ప్రకటించుకున్నారు. ఆ తరువాత లింగమనేని గెస్ట్‌ హౌస్‌ను సీఎం క్యాంపు, నివాస భవనంగా చేసుకున్నారు. వీటన్నింటికీ మరమ్మత్తులు చేయడంతో పాటు భద్రత ఏర్పాట్లు, సీసీ కెమేరాల ఏర్పాటు, పోలీస్‌ బరాక్‌ల నిర్మాణం, 24 గంటలు నిఘా ఏర్పాట్లు, విద్యుత్తు పనులు, విజయవాడ క్యాంపు ఆఫీస్‌లో కంట్రోల్‌ ఎక్విప్‌మెంట్, రహదారుల నిర్మాణాలకు చంద్రబాబు ఆ ఐదేళ్లలో ఏకంగా 126.76 కోట్లు ఖర్చు చేశారు. 

రాష్ట్ర విభజన అనంతరం భారీ రెవెన్యూ లోటులో ఉన్న రాష్ట్రానికి సీఎంగా ఉన్న చంద్రబాబు ఆ సమయంలో ఇష్టానుసారం క్యాంపు ఆఫీస్‌లకు కోట్ల రూపాయలు వెచ్చించడాన్ని అప్పట్లోనే అధికార వర్గాలు తప్పుపట్టాయి. అక్రమ కట్టడమైన లింగమనేని గెస్ట్‌ హౌస్‌ను ముఖ్యమంత్రి నివాసంగా మార్చుకుని అక్కడ రోడ్ల నిర్మాణం, భద్రత కోసం ఏకంగా రూ.10 కోట్లు వ్యయం చేశారు.

కార్యాలయాల పేరుతో సెక్యూరిటీ తదితరాలకు 2014–19 మధ్య చంద్రబాబు చేసిన కొన్ని ఖర్చులు ఇలా.. ఇదంతా జీవోల ద్వారా చేసిన ఖర్చే..

» హైదరాబాద్‌ సెక్రటేరియట్‌లోని సీఎం కార్యాలయం (ఎల్‌ బ్లాక్‌)రూ.14.63 కోట్లు
»సీఎం కోసంహైదరాబాద్‌ సెక్రటేరియట్‌లో హెచ్‌ బ్లాక్‌కు రూ.6.29 కోట్లు
»హైదరాబాద్‌ లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌ కోసం రూ.9.47 కోట్లు
»సీఎం కార్యాలయం ఫర్నిచర్‌కు  రూ.10.00 కోట్లు
»మదీనాగూడ ఫామ్‌ హౌస్, జూబ్లిహిల్స్‌ అద్దె ఇంటికి రూ.4.37 కోట్లు
»విజయవాడ ఇరిగేషన్‌ గెస్ట్‌ హౌస్, కలెక్టరేట్‌లో సీఎం క్యాంపు ఆఫీసులకు రూ.42.00 కోట్లు
»లింగమనేని గెస్ట్‌ హౌస్‌కు  రూ.10.00 కోట్లు
»హైదరాబాద్‌లో పార్క్‌ హయత్‌ హోటల్లో బసకురూ.30.00 కోట్లు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement