♦ కాంట్రాక్టర్లకు వెసులుబాటు కల్పించేలా ప్రభుత్వం చర్యలు
♦ ‘పాలమూరు-రంగారెడ్డి’లో ప్రవేశపెట్టే అవకాశం
సాక్షి, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో ఎప్పటికప్పుడు పెరిగే ధరలకు అనుగుణంగా ధరల సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కాంట్రాక్టర్లకు కల్పించే అంశమై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాల మూరు కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్న బిడ్ డాక్యుమెంట్‌లో ఈ వెసులుబాటును నీటి పారుదల శాఖ పొందుపరచగా, దీన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. నిజానికి ఇప్పుడు అమలవుతున్న ఈపీసీ విధానంలో సిమెంట్, స్టీలు, ఇంధన ధరలు పెరిగినప్పుడు ఆ మేరకు కాం ట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు చేయాలనే నిబంధన ఉంది. కార్మికుల వ్యయాన్ని పెంచకూడదనే నిబంధనను ప్రభుత్వం అనుసరిస్తోంది.
నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుండడంతో తమకు గిట్టుబాటు కావడం లేదంటూ కాం ట్రాక్టర్లు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. సకాలంలో భూ సేకరణ పూర్తి కాకపోవడం, అటవీ అనుమతులు రాకపోవడంతో మెటీరియల్, లేబర్ ధరలు భారీగా పెరిగి ఆర్ధిక నష్టాలను కలిగిస్తున్నాయని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ వినతిని పరిశీలించిన నీటి పారుదల శాఖ పాలమూరు కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బిడ్ డాక్యుమెంట్‌లో లేబర్, ఇసుక, కంకర వంటి ఇతర మెటీరియల్‌కు పెరిగే ధరలకు అనుగుణంగా ధరలను సర్దుబాటు చేయాలనే వెసులుబాటును చేర్చినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటివరకు ఈ విధానం ప్రపంచబ్యాంకు, జైకా సహకారంతో జరుగుతున్న ప్రాజెక్టు పనుల్లో మా త్రమే అమల్లో ఉంది. దీన్ని ప్రస్తుతం కొత్తగా పాలమూరు ప్రాజెక్టు నిర్మాణంలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ బిడ్ డాక్యుమెంట్‌ను న్యాయ, ఆర్థిక శాఖ ఆమోదించాల్సి ఉండగా ఇప్పటికే న్యాయ శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆర్ధిక శాఖ దీనిపై పరిశీలన చేస్తోంది.. అక్కడ క్లియరెన్స్ వచ్చిన వెంటనే ధరల సర్దుబాటు అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో ఏదైనా కారణంతో ఆలస్యం జరిగి, ధరలు పెరిగినా కాంట్రాక్టర్ వెనక్కిపోకుండా ఉండేందుకే ఇలాంటి వెసులుబాటును చేర్చామని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
ధరలు పెరిగితే.. అదనపు చెల్లింపులు
Published Tue, Oct 6 2015 1:13 AM | Last Updated on Sun, Sep 3 2017 10:29 AM
Advertisement
Advertisement