
పరుగులు పెట్టాలంటే... పైసలివ్వాల్సిందే
♦ ప్రాజెక్టుల్లో పూర్తయిన పనులకు తక్షణం నిధులు చెల్లించాలి
♦ ప్రణాళిక బడ్జెట్ నిధుల కేటాయింపుల్లో ఆటంకాలు లేకుండా చూడాలి
♦ లక్ష్యం మేరకు ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే ఇవి తప్పనిసరి
♦ రాష్ట్ర ప్రభుత్వానికి నీటి పారుదల శాఖ విన్నపాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టించాలంటే.. అందుకు తగ్గట్లే నిధుల కేటాయింపుతో పాటు వాటి విడుదలలో ఆర్థిక శాఖ సహకారం అవసరమని నీటి పారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నొక్కి చెప్పింది. పూర్తయిన పనులకు నిధులు విడుదల చేయడంలో ఆటంకాలు లేకుండా చూడటం, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అధికారాల కల్పనలో మార్పులు చేయాల్సిన అవసరాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజేసింది. ఆర్థిక సాంత్వన కల్పిస్తేనే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులను నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయగలమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి కావాల్సిన సహకారంపై నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి వినతితో కూడిన ప్రత్యేక నోట్‌ను సమర్పించింది.
సీఎం సూచనల మేరకే...
రాష్ట్రంలో ప్రస్తుతం 25 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. మరో రూ.12 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తే వీటి పనులు పూర్తవుతాయి. వీటితో పాటే కొత్తగా కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీటికి మరో రూ.80 వేల కోట్ల మేర నిధులు అవసరం. అలాగే చిన్న నీటి వనరుల కోసం సుమారు రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు ఖర్చు చేయాలని భావిస్తోంది. ఇందుకు తొలి దశలో ఇప్పటికే రూ.2,600 కోట్ల మేర నిధులు కేటాయించగా, రెండో విడతకు మరో రూ.3 వేల కోట్లతో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. కొత్త ప్రాజెక్టులను పాక్షికంగా అయినా పూర్తిచేయాలని భావిస్తోంది. అయితే నిర్ణీత లక్ష్యం మేరకు ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే ఆర్థిక శాఖ సహకారం ఎంతో అవసరం. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే ఆర్థిక నివేదికల తయారీ, విధానాల ప్రక్రియను సరళతరం చేయాల్సి ఉంటుంది. పరిపాలనా అనుమతులు, మంజూరు, విడుదలలో ఆటంకాలు లేకుండా చూడాల్సి ఉంటుందని ఇటీవల ప్రాజెక్టులపై సమీక్ష సంసదర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. విధాన ప్రక్రియ సరళీకరణ, ఆర్థిక శాఖ సహకారంపై నోట్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించి దానిపై చర్చించాలని నీటి పారుదల శాఖ అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో అధికారులు నోట్‌ను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది.
నిధుల విడుదలలో ఆటంకాలు ఉండొద్దు..
ప్రాజెక్టులకు నిధుల విడుదలలో ఆర్థిక శాఖ ఎలాంటి ఆటంకాలు కల్పించరాదని నీటి పారుదల శాఖ గట్టిగా కోరుతోంది. సాగునీటి రంగానికి చెందిన ప్రణాళిక బడ్జెట్‌ను ఎప్పుడు అడిగినా ఇవ్వాలంటోంది. జరిగిన పనులకు జరిగినట్లుగా నిధుల విడుదల చేయాలని కోరుతోంది. సీఈ, ఎస్‌ఈ, ఈఈ స్థాయి అధికారుల బదిలీలను ప్రతిసారీ ఆర్థిక శాఖకు చెప్పి చేయడం కాక.. వారిని శాఖ పరిధిలోనే మార్చుకునే అవకాశం కల్పించాలని కోరుతోంది. దీంతో పాటే మిషన్ కాకతీయ పనులను డిసెంబర్ లేదా జనవరిలో ఆరంభించేలా కసరత్తు చేస్తున్న దృష్ట్యా, అందుకు అనుగుణంగా చెరువుల పరిపాలనా అనుమతులను నవంబర్ నెలాఖరుకే పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి విన్నవించింది.