రద్దు వద్దు.. విలీనమే ముద్దు
♦ పథకాల రద్దుకు పలు శాఖల అభ్యంతరం
♦ ఆసక్తి రేపుతున్న కుదింపు ప్రక్రియ
♦ ఊపందుకోనున్న బడ్జెట్ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: సంఖ్యాపరంగా పథకాలను రద్దు చేసే బదులు చిన్న పథకాలను విలీనం చేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. వివిధ శాఖల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సర్కారు ఈ దిశగా పునరాలోచనలో పడింది. కేంద్ర ప్రాయోజిత పథకాలు, వాటికి అనుసంధానంగా రాష్ట్రంలో అమలవుతున్న పథకాలున్నందున చిన్న పథకాలనీ, అక్కర్లేనివాటినీ పక్కనబెట్టవద్దని వివిధ శాఖల కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు ఆర్థిక శాఖకు సూచించారు.
పూర్తిగా అవసరం లేని పథకాలు వేళ్లపై లెక్కించే స్థాయిలోనే ఉన్నాయని, మిగతా పథకాలన్నీ నిధులు కేటాయిస్తే మళ్లీ పట్టాలెక్కే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అందుకే తొందరపాటుగా పథకాల రద్దుకు సిఫారసు చేయకుండా.. చిన్న పథకాలు, తక్కువ ప్రాధాన్యమున్నవి రెండు మూడు కలిపి ఒకే పథకంగా పరిగణించాలని సూచించారు. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టి.. ఇప్పుడు పూర్తిగా అమలుకు నోచుకోని బంగారు తల్లి లాంటి పథకాలను రద్దు చేయాలని నిర్ణయించారు. మిగతా పథకాలను సంఖ్యాపరంగా పరిగణించాల్సిన అవసరం లేదని, ఇప్పటికిప్పుడు ప్రాధాన్యం లేకుంటే బడ్జెట్‌లో తక్కువ కేటాయింపులు ఇవ్వాలని, మొత్తంగా పథకం తీసేయాల్సిన అవసరం లేదని ఎక్కువ శాఖల అధికారులు సూచించారు. దీంతో బడ్జెట్ తయారీ కసరత్తు ఆసక్తి రేపుతోంది.
రాష్ట్రంలోని అన్ని శాఖల్లో దాదాపు 870 పథకాలున్నాయి. వీటిని సగానికి పైగా తగ్గించాలని ఆర్థిక శాఖ ప్రాథమికంగా కసరత్తు చేసింది. కానీ వీటి అమలు, ప్రాధాన్యతను నిర్ణయించాల్సింది తాము కాదని, ఆ కీలక బాధ్యతను సంబంధిత శాఖల అధిపతులకు అప్పగించింది. ఎక్కువ సంఖ్యలో పద్దులు ఉండటంతో బడ్జెట్ సంక్లిష్టంగా మారుతోందని, వీలైనంత మేరకు పద్దుల సంఖ్యను తగ్గించాలని, అమలు చేస్తున్న పథకాలను కొనసాగించి, మిగతా వాటిపై సమీక్ష చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పథకాల కుదింపు ఎజెండాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
సోమవారంతో ఈ సమావేశాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా వచ్చిన సూచనలు, సలహాలతో బడ్జెట్‌లో పొందుపరచాల్సిన పథకాల తుది జాబితా సిద్ధమవనుంది. వ్యవసాయ శాఖలో 109 పథకాలు, వైద్యారోగ్య శాఖలో 80, నీటిపారుదల శాఖలో 82 పథకాలున్నాయి. వీటిలో వీలైనన్ని పథకాలను పక్కనబెట్టాలని భావిస్తున్నారు. బడ్జెట్‌లో ఉన్న కొన్ని పథకాలు తెలంగాణ ప్రాంతానికి అవసరం లేకున్నా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్లుగా యథాతథంగా పొందుపరిచినట్లుగా గుర్తించారు. ఇలాంటి పద్దులన్నీ రద్దు చేసి పథకాల విషయంలో అధికారులు ఇచ్చిన సలహాల మేరకు ఆచితూచి వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సీఎం సమీక్ష
బడ్జెట్ తయారీ కసరత్తు ఈ వారం నుంచి ఊపందుకోనుంది. పథకాల కుదింపు ప్రక్రి య ముగిసిన వెంటనే స్వయంగా సీఎం కేసీఆర్ వచ్చే ఏడాది బడ్జెట్ తయారీపై సమీక్ష జరపనున్నారు. ప్రతి రోజు రెండు, మూడు శాఖలతో సమీక్ష నిర్వహించి బడ్జెట్ ప్రతిపాదనలు, కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి రెండో వారంలోగా ఈ కసరత్తు పూర్తవనుంది.