అప్రాధాన్య ఖర్చులు తగ్గించండి
సాక్షి, హైదరాబాద్: నాన్ ప్లాన్ పద్దుల్లో ఖర్చులు తగ్గించాలని.. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు ఎక్కువ నిధులు వెచ్చించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్థిక శాఖకు దిశానిర్దేశం చేశారు. వరుసగా రెండు రోజుల పాటు ఈ ఆర్థిక సంవత్సరపు ఆదాయ వ్యయాలను ప్రభుత్వం సమీక్షించింది. సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్, మంగళవారం సచివాలయంలో సీఎస్ రాజీవ్‌శర్మ ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి శివశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు గడిచిన ఏడు నెలల్లో ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి పద్దును సీఎం ఈ సందర్భంగా పరిశీలించారు.
నెలనెలా ఆశించిన మేరకు ఆదాయం వస్తున్నా.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఎందుకుందని ఆరా తీశారు. ప్రధానంగా వచ్చే ఆదాయంలో సగం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు ఖర్చవుతుందని ఆర్థిక శాఖ అధికారులు వివరించారు. దీంతో కొత్త రిక్రూట్‌మెంట్, తాజా డీఏ పెంపు, పీఆర్‌సీ బకాయిలు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న చెల్లింపులన్నింటికీ అదనంగా ఎంత భారం పడుతుందని సీఎం అడిగి తెలుసుకున్నారు. డీఏ పెంపుతో నెలనెలా రూ.70 కోట్లు అవసరమవుతాయని, పీఆర్‌సీ బకాయిలు దాదాపు రూ.2,500 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ సీఎంకు నివేదించింది. అప్రాధాన్యంగా ఉన్న పథకాలకు నిధులు కేటాయించవద్దని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎంచుకున్న పథకాలకే అధిక ప్రాధాన్యమివ్వాలని సీఎం సూచించారు. దీంతో పాటు వీలైనంత మేరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించాలని ఆదేశించారు.
నాబార్డు నిధులు వాడుకోండి: సీఎస్
నాబార్డు నుంచి తీసుకున్న రుణంతో చేపట్టే పనులను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆర్థిక శాఖకు సూచించారు. ఈ ఏడాది దాదాపు రూ.700 కోట్ల రుణంతో వివిధ విభాగాల్లో పనులు మంజూరు చేశారు. వీటి వినియోగం నిదానంగా ఉందని అయిదో వంతు నిధులు కూడా ఖర్చు కాలేదని చర్చ జరిగింది. దీంతో ఈ పనులు, బిల్లుల చెల్లింపులు వేగంగా జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. దీంతోపాటు బీఆర్‌వోలు మంజూరు చేసినా ఖర్చుకు సంబంధించిన నిధులు చూపించటం లేదని వివిధ శాఖలు చెబుతున్నాయని, వెంటనే వీటిని సరిదిద్దాలని ఆర్థిక శాఖను అప్రమత్తం చేశారు.