ఉద్యోగులకు దసరా నిరాశే!
♦ పీఆర్‌సీ బకాయిలు ఇప్పట్లో రానట్టే
♦ జీపీఎఫ్‌లో జమ చేసేందుకు యోచన
♦ జీపీఎఫ్ ఖాతాల్లేని వారికి బాండ్లు
♦ ముఖ్యమంత్రికి సిఫారసు చేసిన ఆర్థిక శాఖ
సాక్షి,హైదరాబాద్: దసరా పండుగ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశనే మిగల్చనుంది. తమకు రావాల్సిన పీఆర్‌సీ బకాయిలను పండుగ లోపు ప్రభుత్వం చెల్లిస్తుందని ఆశపడ్డ ఉద్యోగులు, పెన్షన్‌దారులు భంగపడ్డారు. అక్టోబరు ఆరంభంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో బకాయిల చెల్లింపులపై సర్కారు వెనక్కి తగ్గింది. పీఆర్ సీ ప్రకటించిన రోజున సీఎం కేసీఆర్ చెప్పిన విధంగానే బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేయాలని యోచిస్తోంది. రెండేళ్లపాటు ఉద్యోగులు ఆ సొమ్మును డ్రా చేసుకోకుండా ఆంక్షలు విధించాలని ఆర్థిక శాఖ సిఫారసు చేసింది. ఇటీవలే ఈ ఫైలును సీఎం ఆమోదానికి పంపింది. బకాయిల చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని.. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే పలుమా ర్లు ఆర్థిక శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశాయి.
సీఎం ఆమోదం తర్వాత...
పీఆర్‌సీ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 2014 జూన్ నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి వచ్చాయి. 2015 మార్చి నుంచి నగదు రూపంలో చెల్లించిన ప్రభుత్వం.. అప్పటివరకు చెల్లించాల్సిన తొమ్మిది నెలల మొత్తాన్ని బకాయిలుగా పెండింగ్‌లో పెట్టింది. వీటిపై తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామని పీఆర్‌సీ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఉద్యోగులందరూ తమ వేతనాలను సవరించుకోవడంతో.. పెరిగిన జీతాల ప్రకారం బకాయిల చెల్లింపులకు ఎంత మొత్తం కావాలో ఆర్థిక శాఖ స్పష్టమైన అంచనాకు వచ్చింది. మొత్తం రూ.2,500 కోట్లు అవసరమవుతాయని లెక్కలేసుకుంది. బకాయిలు పొందే లబ్ధిదారులను మూడు కేటగిరీలుగా విభజించింది.
సర్వీసులో ఉన్న ఉద్యోగుల్లో జీపీఎఫ్ ఖాతాలు ఉన్నవారు.. లేని వారుండగా.. మూడో కేటగిరీలో పెన్షన్‌దారులున్నారు. 2004 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులు కొత్త పెన్షన్ విధానంలో ఉన్నందున వీరికి జీపీఎఫ్ ఖాతాలు లేవు. వీరితో పాటు పెన్షన్‌దారులకు జీపీఎఫ్ వర్తించదు. జీపీఎఫ్ ఖాతాలున్న ఉద్యోగులకు రూ.1,500 కోట్లు అవసరమవుతాయని, వీటిని జీపీఎఫ్‌లో జమ చేయాలని భావిస్తోంది. పెన్షన్‌దారులకు నగదు చెల్లించక తప్పదని నిర్ణయించింది. జీపీఎఫ్ ఖాతాల్లేని ఉద్యోగులకు, ఖాతాలు ఉన్న ఉద్యోగులకు తేడా లేకుండా చెల్లింపులు చేయాలని సిఫారసు చేసింది. అందుకే జీపీఎఫ్ ఉన్న వారికి ఖాతాలో జమ చేసి.. లేని వారికి రెండేళ్ల తర్వాత నగదు వర్తించే బాండ్లు అందజేయాలని ప్రత్యామ్నాయం సూచించింది. ముఖ్యమంత్రి ఆమోదం తర్వాత బకాయిల చెల్లింపు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.