- అందుబాటులోలేని కేసీ కెనాల్ అధికారులు
- రైతుల సమస్యలు పట్టని వైనం
- కాల్వల వెంట పెరిగిన కంపచెట్లు
నందికొట్కూరు: కేసీ కెనాల్ అభివృద్ధి అధికారులకు పట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాలువ గట్లు, నీటి పారుదలపై నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రైతులకు అందుబాటులో ఉండాల్సిన అధికారులు ఇటు కార్యాలయంలోను..అటు ఫీల్డ్‌లోను కనిపించడం లేదు. వివిధ సమస్యలపై కార్యాలయానికి వెళ్లిన వారు.. ఏ అధికారీ అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మూడు నెలలుగా నందికొట్కూరులోని నీటి పారుదల శాఖ ఏఈ కార్యాలయం తలుపులు కూడా తెరుచుకోకపోవడంపై రైతులు మండి పడుతున్నారు. నందికొట్కూరు డివిజన్ పరిధిలోని పగిడ్యాల, జూపాడుబంగ్లా మండలాల పరిధిలోని కేసీ కాల్వకు సంబంధించి నందికొట్కూరు ఏఈ కార్యాలయం ఏర్పాటు చేశారు.
ఇక్కడ అధికారులు ఏరోజు కూడా అందుబాటులో లేరని రైతులు ఆరోపిస్తున్నారు. సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీ కాల్వ, పొలాలకు వెళ్లే కాల్వల వెంట కంపచెట్లు, పిచ్చి మొక్కలు పెరిగి నీటి సరఫరా సాగడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. ఇదిలా ఉండగా అధికారులు తప్పుడు నివేదికలు అందజేస్తూ టీఏ, డీఏ కింద వేల రూపాయలు వేలు డ్రా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే వీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు : పుల్లారావు, ఈఈ, కేసీ కెనాల్ విధుల పట్ల నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగనీయం. సిబ్బంది పనితీరుపై విచారణ చేపట్టి జిల్లా అధికారులకు నివేదిక అందజేస్తాం.
మూడు నెలలుగా మూతే!
Published Thu, Sep 11 2014 11:57 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement