
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిరాజ్యం
నెల్లూరు(క్రైమ్) : జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోంది. చేయి తడపందే ఫైళ్లు కదలడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు దరిచేరాలన్నా...ఫించన్ మంజూరు కావాలన్నా... భూమికి పట్టాదారు పాసుపుస్తకం తీసుకోవాలన్నా.. ఇలా ప్రభుత్వ శాఖల్లో ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి కలెక్టరేట్ వరకు ఇదే పరిస్థితి నెలకొంది. చేయి తడపకపోతే పనుల్లో జాప్యం తప్పదు. నిబంధనలకు అనుగుణంగా అన్నీ సవ్యంగా ఉన్నా దక్షిణ ఇచ్చుకుంటే తప్ప పనులు జరగడం లేదు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు వారి అవకాశాలను బట్టి జేబులు నింపుకుంటున్నారు. అవినీతిని అంతమొందించేందుకు ఏర్పాటు చేసిన అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) పనితీరు సైతం అంతంతమాత్రంగానే ఉంది. జిల్లాలో గడిచిన రెండేళ్లలో కేవలం 21 కేసులు నమోదయ్యాయి.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి జాఢ్యం
రేషన్‌కార్డు నుంచి ఇళ్లపట్టాల వరకు, జనన సర్టిఫికేట్ నుంచి మరణ ధ్రువీకరణ పత్రం వరకు ఆయా శాఖల సిబ్బందికి చేయి తడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. పదవీ విరమణ చేస్తున్న సమయంలో వారికి రావాల్సిన నిధులు ఇచ్చేందుకు లంచం ఇవ్వాల్సి వస్తోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో భూములకు రిజిస్ట్రేషన్ చేయాలంటే లంచం ఇవ్వందే పనికావడం లేదు. లెసైన్సు మొదలు బండి రిజిస్ట్రేషన్ వరకు ఆర్టీవో కార్యాలయ సిబ్బందికి చేయి తడపాల్సిందే. వాణిజ్య పన్నులశాఖలో వసూళ్ల రాజాలు ఇస్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్యారోగ్యశాఖ, నగరపాలకసంస్థ, అటవీశాఖ, నీటిపారుదళశాఖ, విద్యుత్, ఉమ్మడి తనిఖీ కేంద్రంలో అవినీతి పతాకస్థాయికి చేరింది.
పోలీసు కార్యాలయంలో చేయి తడపందే పనికావడం లేదన్న ఆరోపణలున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది బాధితులు నేరుగా జిల్లా ఎస్పీకే ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసుస్టేషన్లలో డబ్బులు కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులు అందాయి. కానిస్టేబుల్ నుంచి అధికారి వరకు పోలీసు కార్యాలయంలో పనిచేయించుకోవాలంటే అమ్యామ్యాలు సమర్పించుకోవాల్సిందేననన్న ఆరోపణలున్నాయి. రెవెన్యూ విభాగంలో ప్రతి పనికోరేటు విధించారన్నది బహిరంగ రహస్యమే. ఎక్సైజ్‌శాఖ మామూళ్లు మత్తులో జోగుతోంది. వైద్యారోగ్యశాఖతో పాటు పలు కార్యాలయాలకు సంబంధించిన కేసుల్లో ఏసీబీ అధికారులు విచారణ ఇంకా పూర్తిచేయలేదు. దీంతో వాటి దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన తయారైంది.
నామమాత్రంగా దాడులు...
జిల్లాలో కొంతకాలంగా ఏసీబీ తన ఉనిఖి కోసం నామమాత్రపు దాడులతో సరిపెడుతోందన్న విమర్శలున్నాయి. రెండేళ్లు గణాంకాలు పరిశీలిస్తే 2014లో కేవలం 8 ట్రాప్, ఒక ఆదాయానికి మించిన ఆస్తులు, రెండు సర్‌ప్రైస్ చెక్‌లకే పరిమితమైంది. 2015లో ఇప్పటి వరకు కేవలం 8 ట్రాప్‌లు, రెండు సర్‌ప్రైస్ చెక్‌లకే పరిమితమైంది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పతాకస్థాయికి చేరింది. సుమారు 10నెలలుగా నెల్లూరు ఏసీబీ కార్యాలయం ఇన్‌చార్జి డీఎస్పీ ఆర్‌వీఎస్‌ఎస్ మూర్తి ఆధ్వర్యంలో పనిచేస్తోంది. సిబ్బంది కొరత ఉంది. ఇటీవల ఏసీబీ సిబ్బందిపై పలు అవినీతి, ఆరోపణలు వినిపించాయి.
ఇక్కడ పనిచేస్తున్న కొందరు సిబ్బంది వివిధ ప్రభుత్వ కార్యాలయ అధికారులతో లోపాయకారి సంబంధాలు నెరుపుతూ నెలమామూళ్లు దండుకుంటున్నారన్న విమర్శలున్నాయి. అందుకు గాను దాడులకు సంబంధించి ముందస్తు సమాచారం అందిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీడీ ఉన్నతాధికారులు ఈ ఘటనలపై విచారణ జరపడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.