
చెరువులపై చిన్నచూపు
ఏలూరు : జిల్లాలో చిన్నతరహా సాగునీటి చెరువులు ప్రక్షాళనకు నోచుకోవడం లేదు. గతంలో జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద వీటిని అభివృద్ధి చేసినట్టు చెబుతున్నా.. ఎక్కడా అవి బాగుపడిన పరిస్థితి కనిపించడం లేదు. ఉపాధి హామీ పనులపై పర్యవేక్షణ కొరవడటంతో ఈ దుస్థితి తలెత్తింది. జిల్లాలో 1,406 చిన్నతరహా సాగునీటి చెరువులు ఉండగా, వీటికింద 1.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువులు కుచించుకుపోవడంతో రైతులు ఏటా సాగునీరు అందక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో చెరువుల అభివృద్ధిని నీటిపారుదల శాఖ గొడుగు కిందకు తీసుకొచ్చారు. మొత్తం చెరువులను మూడు రకాలుగా విభజించి, వాటి అభివృద్ధికి రూ.200 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ప్రతిపాదనలు పంపించారు.
మూడురకాల ప్రతిపాదనలు
కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఆర్‌ఆర్ (రిపేర్స్, రెనోవేషన్, రెస్టోరేషన్) పథకం కింద 40 హెక్టార్ల కన్నా తక్కువ ఆయకట్టు ఉన్న చెరువులను అభివృద్ధి చేస్తారు. దీనికింద రూ.32 కోట్లతో 92 పనులు చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రపంచ బ్యాంక్ స్కీమ్-2 కింద రూ.8.50 కోట్లతో 105 పనులను చేపట్టాలని ప్రతిపాదించారు. మూడో విధానంలో ఉపాధి హామీ పథకం కింద మిగిలిన చెరువులను అభివృద్ధి చేయడానికి రూ.160 కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. ఈ పథకంలో 40 హెక్టార్ల కన్నా తక్కువ ఆయకట్టుకు నీరందించే చెరువులను పునరుద్ధరించాల్సి ఉంటుంది.
చెక్‌డ్యామ్‌లు, ఇతర నిర్మాణాలు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో, కూలీలతో చేపట్టే పనులు డ్వామా ఆధ్వర్యంలో చేపట్టేలా ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ నిధులు దశలవారీగా మూడేళ్లలో విడుదల అవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్రిబుల్ ఆర్ పథకం విషయంలో చెరువుల అభివృద్ధి పారదర్శకంగా జరుగుతుందా, చెరువును తవ్వినా నీరు నిల్వ సామర్థ్యం ఉంటుందా అనే అనుమానాల నేపథ్యంలో నిధులు విడుదల చే సేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని తెలుస్తోంది. ఏదేమైనా పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే ఏడాది జనవరిలో పనులు ప్రారంభిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.