చివరికి చెన్నై బలి!
♦ నగరంలో 40 శాతం చెంబరబాక్కం నీరే...
♦ ప్రజాపనులశాఖ బాధ్యతారాహిత్యమే కారణం!
చెన్నై, సాక్షి ప్రతినిధి : నీటిని అదిమిపడితే ముంచుకొచ్చే ముప్పు.. ఒక్కసారిగా విడిచిపెడితే తలెత్తే విపత్తు.. ఈ రెండింటిపై అవగాహన లేకే చెన్నై చెరువైందా? దీనికి నీటిపారుదలశాఖ ఇంజనీర్లు మాత్రం అవుననే అంటున్నారు. చెన్నై నగరం దాదాపు 40 శాతం మునకకు చెంబరబాక్కం చెరువే కారణమని, అధికారులు తీసుకున్న తెలివితక్కువ నిర్ణయాలవల్లే ఈ దుస్థితి దాపురించిందని చెబుతున్నారు. వాతావరణశాఖ జారీ చేసిన హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.., ఓవైపు పైనుంచి నీరు పోటెత్తుతున్నా పట్టించుకోకుండా చెంబరబాక్కం చెరువులో నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరేదాకా చూసి, ఆ తర్వాత అకస్మాత్తుగా నీటిని వదలడంతోనే ఈ విపత్తు తలెత్తిందని చెబుతున్నారు.
అకస్మాత్తు నిర్ణయం.. అపార నష్టం
చెన్నై ప్రజల దాహార్తిని తీర్చే చెంబరబాక్కం చెరువులో నీటి మట్టం ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ప్రమాదస్థాయికి చేరుకుంది. దీంతో నవంబర్ 16వ తేదీ నుండి ఉపరితల నీటిని వదులుతున్నారు. ఇలా విడుదల చేస్తున్న నీటి ప్రవాహాన్ని క్రమేణా 10 వేల ఘనపుటడుగులకు పెంచారు. ఆ తర్వాత ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టడంతో ఔట్‌ఫ్లోను సైతం తగ్గించారు. దీంతో పైనుంచి వచ్చే ప్రవాహంతో చెరువు నిండుకుండలా మారింది. అదే సమయంలో ఒక్కసారిగా మరోసారి వరుణుడు విరుచుకుపడ్డాడు. 24 గంటల వ్యవధిలో 49 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నీటిమట్టం ప్రమాదకర స్థితికి చేరడంతో మంగళ, బుధవారాల్లో నీటి విడుదలను అకస్మాత్తుగా పెంచేశారు. దీంతో చెంబరబాక్కం పరీవాహక ప్రాంతాలన్నీ నీటమునిగాయి.
అనుకోని ముప్పుతో అతలాకుతలం..
అకస్మాత్తుగా ఇళ్లలోకి వరద ప్రవాహం పోటెత్తడంతో ప్రజలు భీతావహులయ్యారు. ప్రాణాలు ఉగ్గపట్టుకుని రక్షించేవారి కోసం ఎదురుచూశారు. బోట్లు, పడవల సాయంతో బ్రతుకు జీవుడా అని బయటపడ్డారు. విలువైన సామగ్రినిసైతం వదిలి ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.
అధికారులే ముంచేశారు..
చెన్నైలో జనావాసాల మధ్య నుండి ప్రవహించే అడయారు చెరువులో నీటి మట్టం ఎంత ఉందో అంచనావేయకుండా చెంబరబాక్కం చెరువును కాపాడుకుంటే చాలని ప్రజాపనుల శాఖ తీసుకున్న తెలివితక్కువ నిర్ణయం నగరాన్ని నిలువునా ముంచేసిందని స్థానికులు దుయ్యబట్టారు. చెంబరబాక్కం నుండి ఉరకలు వేస్తూ ప్రవహించిన నీటికి.. వరదనీరు తోడవడంతో నగరంలోని సైదాపేట, తేనాంపేట, ఆలందూర్, కొట్టూరుపురం, అడయారు, కున్రత్తూరు తదితర ప్రాంతాలు అల్లకల్లోలమయ్యాయని ఆరోపించారు. చెంబరబాక్కం చెరువును కాపాడుకోవడం కోసం నగరంలోని లక్షలాది ప్రజలను నిరాశ్రయులను చేశారని, వేలాది ఇళ్లను ముంచేశారని వాపోయారు.
అధికారుల బాధ్యతారాహిత్యం: రిటైర్డు ఇంజనీరు
చెంబరబాక్కం చెరువు నుండి నీటి విడుదలలో అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ప్రజాపనుల శాఖ రిటైర్డు ఇంజనీరు ఒకరు వ్యాఖ్యానించారు. చెంబరబాక్కం చెరువు నుండి భారీస్థాయిలో నీటిని విడుదల చేయాలని అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయమే ఈ దారుణానికి కారణమన్నారు. చెంబరబాక్కం పరీవాహక ప్రాంతాలన్నీ నివాస గృహాలతో చాలా ఇరుకుగా ఉంటాయని, దీనిపై ప్రజాపనుల శాఖాధికారులు అవగాహనారాహిత్యంతో వ్యవహరించడం చె న్నైకి శాపంగా పరిణమించిందని అన్నారు.
సహాయ కార్యక్రమాల్లో కొత్త పంథా
న్యూఢిల్లీ: తమిళనాడు వరదబాధితులకు కనీస సహాయాన్ని అందించడం కోసం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఆర్‌ఎఫ్) సోషల్ మీడియాను అనుసంధానంగా ఉపయోగించుకుంటోంది. ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వరద బాధితులను, సహాయం అవసరమైన వారిని గుర్తించే కొత్త ప్రయత్నాన్ని చేస్తోంది. దీని కోసం ఢిల్లీలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది ఈ సంస్థ. అనునిత్యం ఫేస్‌బుక్‌లో, ట్విటర్‌లను గమనిస్తూ... సహాయాన్ని అర్థిస్తూ వచ్చిన పోస్టుల విషయంలో స్పందించడమే ఈ విభాగం పని. వరదల్లో చిక్కుకున్న ప్రజల్లో కొంతమంది తమ పరిస్థితిని సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా బాహ్యప్రపంచానికి తెలియజేయగలుగుతున్నారు. తమిళనాడు వరద బాధితుల నుంచి ఎలాంటి పోస్టులు కనిపించినా వాటికి స్పందనగా ఎన్‌డీఆర్‌ఎఫ్ నుంచి పోస్టులు వస్తున్నాయి. వారి సమాచారాన్ని తెలుసుకుని.. చెన్నైలో సహాయ కార్యక్రమాల విధుల్లో ఉన్న బృందాలకు ఆ సమాచారాన్ని అందిస్తోంది. ఈ మేరకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌హెచ్‌క్యూ, ఎన్‌డీఆర్‌ఎఫ్ పేరుతో సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్లలో హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్టులు ప్రచురితం అవుతున్నాయి.
సాయానికి సిద్ధం: అమెరికా
వాషింగ్టన్: చెన్నై వరదల సహాయకార్యక్రమాల్లో భారత్‌కు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రకటించింది. ఇప్పటి వరకూ ఈ విషయంలో ఇండియా నుంచి సహాయం కోసం ఎలాంటి విజ్ఞప్తి రానప్పటికీ.. మానవతా దృక్పథంతో ఎలాంటి సహాయ చర్యలకైనా తాము సిద్ధంగా ఉన్నామని ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిఘటిస్తున్నామని, ఇప్పటికీ వరదల్లో చిక్కుకున్న ప్రజల పట్ల సానుభూతితో ఉన్నామని ఆయన అన్నారు. భారత ప్రభుత్వంతో అమెరికన్ గవర్నమెంటు సంప్రదింపులు జరుపుతోందని గురువారం ఆయన ప్రకటించారు. ఇలాంటి విపత్తును ఎదుర్కొన శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని, నమ్మకమైన మిత్రదేశం కాబట్టి ఇండియా విషయంలో తాము స్పందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
కార్డులు, సర్టిఫికెట్లు.. సర్వం పోయాయి
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రతి ఒక్కదానికీగుర్తింపుకార్డు కోరే ఈ రోజుల్లో చెన్నై నగరంలోని ముంపు బాధితులు సర్వం కోల్పోయారు. ఖరీదైన జీవితానికి పేరైన సినీనటీనటులు, దర్శక నిర్మాతల ఇళ్లు సైతం ముంపునకు గురయ్యాయి. ఓటర్, ఆధార్, రేషన్, పాన్ కార్డులు నీట మునిగిపోయాయి. కొందరి ఇళ్లలో అవి మొత్తం కొట్టుకుపోయాయి. ఇప్పుడు నువ్వు ఎవరు? అంటే తాను తానేనని రుజువు చేసుకోవడానికి కావలసిన ‘గుర్తింపు’ కార్డేదీ లేని దయనీయ స్థితిలో చెన్నైవాసులు ఆందోళన చెందుతున్నారు.
రేపన్నాక పరిహారం అందాలన్నా, కొత్త ఇళ్లు మంజూరవ్వాలన్నా ఆ కార్డులే ఆధారమైన నేపథ్యంలో వాటిని మళ్లీ సంపాదించడానికి ఎన్ని కష్టాలు పడాలో అన్నది వారి ఆవేదన. ఇక విద్యార్థుల పరిస్థితి అయితే మరీ ఘోరం. ఇన్నాళ్లూ కష్టపడి చదివి సంపాదించుకున్న చాలా మంది విద్యార్థుల సర్టిఫికెట్లు వరదలో గల్లంతైపోయాయి. వాటిని మళ్లీ తెచ్చుకోవడానికి ఎన్ని తంటాలు పడాలో ఆ దేవుడికే ఎరుక! ఇది ఓ కోణమైతే.. మరోవైపు గత నెల 6వ తేదీ నుంచీ వర్షాల వల్ల పాఠశాలలకు, కాలేజీలకూ సెలవులివ్వడంతో సెమిస్టర్ పరీక్షలు వాయిదాపడ్డాయి. మళ్లీ వాటిని ఎప్పుడు నిర్వహిస్తారో, వాటికి ఎలా ప్రిపేర్ కావాలో అన్న ఆందోళన మరికొందరు విద్యార్థులది.