విపత్తు నిర్వహణను పట్టించుకోని చంద్రబాబు సర్కార్
మూడు కీలక అంశాల్లో సీఎం చంద్రబాబు దారుణ వైఫల్యం
ఫ్లడ్ కుషన్ పాటించలేదు
వరదలపై ప్రజలను కనీసం అప్రమత్తం చేయలేదు
ముంచేశాక పునరావాస కేంద్రాలకూ తరలించలేదు
తీవ్ర నష్టం జరిగినా తక్షణ సాయంగా చిల్లిగవ్వ చెల్లించలేదు
60 మంది మరణిస్తే బాధిత కుటుంబాలకు రూపాయి ఇవ్వలేదు
వైఎస్ జగన్ హయాంలో పక్కా ప్రణాళికతో విపత్తుల నిర్వహణ
పునరావాస కేంద్రాల నుంచి వెళ్లేటప్పుడే బాధితులకు రూ.2 వేల సాయం
సాక్షి, అమరావతి: విపత్తుల సమయంలో అనుసరించాల్సిన ప్రాథమిక నిబంధనలను సీఎం చంద్రబాబు గాలికి వదిలేయడంతో విజయవాడ ప్రజలు అష్టకష్టాలు అనుభవించారు. దేశవ్యాప్తంగా పాటించే విపత్తు నిర్వహణ విధానాలను ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంతో ప్రజల నష్టం, కష్టం మరింత పెరిగిపోయిందని నిపుణులు సైతం పేర్కొంటున్నారు.
ముందస్తుగా ప్రజలను హెచ్చరించి అప్రమత్తం చేయడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం, కష్ట సమయంలో ఆదుకుని తక్షణ ఆర్థిక సాయం అందించడం లాంటివి కీలకం. ఎన్‌డీఎంఎ (జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ) మాన్యువల్‌లో ఈ మూడు అంశాలు అత్యంత కీలకం. రాష్ట్రంలో ఏ విపత్తు తలెత్తినా ఇవే ప్రామాణికం. అందులోని అంశాల ప్రకారమే నివారణ చర్యలు, సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
ముందే హెచ్చరించినా..
విజయవాడను ముంచెత్తిన తాజా వరదల్లో విపత్తు మాన్యువల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. బుడమేరు వరద గురించి కనీస సమాచారం ప్రజలకు ఇవ్వలేదు. ఆగస్టు 31వ తేదీన విజయవాడ పరిసరాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని మూడు రోజులు ముందే వాతావరణ శాఖ హెచ్చరించినా పట్టించుకోలేదు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖలతో సీఎం కనీసం సమీక్ష నిర్వహించలేదు.
జలాశయాలు నిండుకుండల్లా కనిపిస్తున్నా ‘ఫ్లడ్ కుషన్’ నిబంధన పాటించలేదు. తీరా బుడమేరుకు వరద పోటెత్తాక అర్థరాత్రి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తేశారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలను కనీసం అప్రమత్తం చేయకపోవడంతో సగం విజయవాడ మునిగిపోయింది. 2.50 లక్షలకు పైగా కుటుంబాలు వరద నుంచి బయటపడే అవకాశం లేక తీవ్రంగా నష్టపోయాయి.
వరదల్లో 60 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్ని నిండు ప్రాణాలు బలవ్వగా లక్షలాది కుటుంబాలకు రూ.వేల కోట్ల నష్టం వాటిల్లింది. ప్రభుత్వ ఆస్తులకు అపార నష్టం జరిగింది. విపత్తుల సమయంలో అనుసరించాల్సిన ప్రాథమిక సూత్రాన్ని ప్రభుత్వం పాటించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు స్పష్టమవుతోంది.
ఏ దశలోనూ కళ్లు తెరవని బాబు
ఆ తర్వాత దశలోనూ రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవకపోగా విపత్తు నిర్వహణ విధానాలను గమనించకుండా ప్రజలను వరదకు వదిలేసింది. వరదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు అంటే వరద లేని ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి తరలించాలి.
రెండున్నర లక్షల కుటుంబాలు మునిగిపోయినా కనీసం 50 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడాన్ని బట్టి ప్రభుత్వ అలసత్వం ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. దీంతో లక్షల మంది రోజుల తరబడి నీటిలో చిక్కుకుని విలవిల్లాడిపోయారు. వరద నుంచి బయటపడిన వారు చెట్టుకొకరు పుట్టకొకరుగా రైల్వే స్టేషన్, బస్టాండ్లు, కమ్యూనిటీ హాళ్లు, తెలిసిన వాళ్ల ఇళ్లలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మునిగిన లోతట్టు ప్రాంతాలకు నాలుగు రోజుల వరకు కనీసం ఆహారం, నీళ్లు కూడా ఇవ్వలేదు. విపత్తు నిర్వహణ మాన్యువల్‌లోని షెల్టర్ మేనేజ్‌మెంట్‌ను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఉల్లంఘించి లక్షలాది మందిని తీవ్ర అవస్థలకు గురి చేసింది.
60 మంది చనిపోతే ఎక్స్‌గ్రేషియా ఏదీ?
విజయవాడ వరదల్లో లక్షలాది మంది చిక్కుకుంటే పునరావాసం కల్పించకపోగా తక్షణ సాయం అందించలేదు. తన దగ్గర డబ్బులు లేవని సీఎం చంద్రబాబు ముందే చేతులెత్తేశారు. 60 మంది చనిపోతే ఎక్స్‌గ్రేషియా గురించి పట్టించుకోలేదు. విపత్తుల సమయంలో ప్రాథమిక సూత్రాలను పాటించకుండా ప్రజలను వారి ఖర్మకు వదిలేసిన సీఎం చంద్రబాబు ప్రచారాన్ని మాత్రం ఆకాశమంత స్థాయిలో చేసుకున్నారు.
అన్ని దశల్లోనూ విఫలమైనా తాను బాగా పని చేస్తున్నట్లు హడావుడి, హంగామా చేసి మభ్యపుచ్చేందుకు రకరకాల ఫీట్లు నిర్వహించారు. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు తప్పుడు ప్రచారాలకు తెర తీశారు. వరదల్లోనూ చంద్రబాబు తన మార్కు రాజకీయాన్ని వదలకపోవడంతో లక్షలాది మంది ప్రజలు పడరాని పాట్లు పడ్డారు.
తక్షణ సాయం ఊసే లేదు.. జగన్ హయాంలో పక్కాగా
విపత్తు బారిన పడిన వారిని పునరావాస కేంద్రాలకు తరలించి తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు తక్షణ సాయం అందించాలి. అసలు కేంద్రాలే ఏర్పాటు చేయని కూటమి సర్కారు తక్షణ సాయం ఊసే లేకుండా చేసింది. వరదలు, తుపానులు వచ్చినప్పుడు వైఎస్ జగన్ హయాంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు బాధితులు ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు ఆర్థిక సాయంగా రూ.2 వేలు చొప్పున పంపిణీ చేశారు.
2020లో కృష్ణా, గోదావరి వరదలు, 2023లో మిచాంగ్ తుపానుతోపాటు ప్రతి విపత్తులోనే ఇదే విధానాన్ని అనుసరించి బాధితులకు తక్షణ సాయం అందించారు. 2014కి ముందు తక్షణ సాయంగా రూ.వెయ్యి అరకొరగా ఇచ్చేవారు. వైఎస్ జగన్ హయాంలో దాన్ని రూ.2 వేలకు పెంచి బాధితులందరికీ అందేలా చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment