National Disaster Management Authority
-
నిబంధనలు గాలికి..
సాక్షి, అమరావతి: విపత్తుల సమయంలో అనుసరించాల్సిన ప్రాథమిక నిబంధనలను సీఎం చంద్రబాబు గాలికి వదిలేయడంతో విజయవాడ ప్రజలు అష్టకష్టాలు అనుభవించారు. దేశవ్యాప్తంగా పాటించే విపత్తు నిర్వహణ విధానాలను ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంతో ప్రజల నష్టం, కష్టం మరింత పెరిగిపోయిందని నిపుణులు సైతం పేర్కొంటున్నారు.ముందస్తుగా ప్రజలను హెచ్చరించి అప్రమత్తం చేయడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం, కష్ట సమయంలో ఆదుకుని తక్షణ ఆర్థిక సాయం అందించడం లాంటివి కీలకం. ఎన్డీఎంఎ (జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ) మాన్యువల్‌లో ఈ మూడు అంశాలు అత్యంత కీలకం. రాష్ట్రంలో ఏ విపత్తు తలెత్తినా ఇవే ప్రామాణికం. అందులోని అంశాల ప్రకారమే నివారణ చర్యలు, సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ముందే హెచ్చరించినా..విజయవాడను ముంచెత్తిన తాజా వరదల్లో విపత్తు మాన్యువల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. బుడమేరు వరద గురించి కనీస సమాచారం ప్రజలకు ఇవ్వలేదు. ఆగస్టు 31వ తేదీన విజయవాడ పరిసరాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని మూడు రోజులు ముందే వాతావరణ శాఖ హెచ్చరించినా పట్టించుకోలేదు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖలతో సీఎం కనీసం సమీక్ష నిర్వహించలేదు. జలాశయాలు నిండుకుండల్లా కనిపిస్తున్నా ‘ఫ్లడ్ కుషన్’ నిబంధన పాటించలేదు. తీరా బుడమేరుకు వరద పోటెత్తాక అర్థరాత్రి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తేశారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలను కనీసం అప్రమత్తం చేయకపోవడంతో సగం విజయవాడ మునిగిపోయింది. 2.50 లక్షలకు పైగా కుటుంబాలు వరద నుంచి బయటపడే అవకాశం లేక తీవ్రంగా నష్టపోయాయి. వరదల్లో 60 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్ని నిండు ప్రాణాలు బలవ్వగా లక్షలాది కుటుంబాలకు రూ.వేల కోట్ల నష్టం వాటిల్లింది. ప్రభుత్వ ఆస్తులకు అపార నష్టం జరిగింది. విపత్తుల సమయంలో అనుసరించాల్సిన ప్రాథమిక సూత్రాన్ని ప్రభుత్వం పాటించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు స్పష్టమవుతోంది. ఏ దశలోనూ కళ్లు తెరవని బాబు ఆ తర్వాత దశలోనూ రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవకపోగా విపత్తు నిర్వహణ విధానాలను గమనించకుండా ప్రజలను వరదకు వదిలేసింది. వరదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు అంటే వరద లేని ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి తరలించాలి.రెండున్నర లక్షల కుటుంబాలు మునిగిపోయినా కనీసం 50 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడాన్ని బట్టి ప్రభుత్వ అలసత్వం ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. దీంతో లక్షల మంది రోజుల తరబడి నీటిలో చిక్కుకుని విలవిల్లాడిపోయారు. వరద నుంచి బయటపడిన వారు చెట్టుకొకరు పుట్టకొకరుగా రైల్వే స్టేషన్, బస్టాండ్లు, కమ్యూనిటీ హాళ్లు, తెలిసిన వాళ్ల ఇళ్లలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మునిగిన లోతట్టు ప్రాంతాలకు నాలుగు రోజుల వరకు కనీసం ఆహారం, నీళ్లు కూడా ఇవ్వలేదు. విపత్తు నిర్వహణ మాన్యువల్‌లోని షెల్టర్ మేనేజ్మెంట్ను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఉల్లంఘించి లక్షలాది మందిని తీవ్ర అవస్థలకు గురి చేసింది. 60 మంది చనిపోతే ఎక్స్‌గ్రేషియా ఏదీ? విజయవాడ వరదల్లో లక్షలాది మంది చిక్కుకుంటే పునరావాసం కల్పించకపోగా తక్షణ సాయం అందించలేదు. తన దగ్గర డబ్బులు లేవని సీఎం చంద్రబాబు ముందే చేతులెత్తేశారు. 60 మంది చనిపోతే ఎక్స్‌గ్రేషియా గురించి పట్టించుకోలేదు. విపత్తుల సమయంలో ప్రాథమిక సూత్రాలను పాటించకుండా ప్రజలను వారి ఖర్మకు వదిలేసిన సీఎం చంద్రబాబు ప్రచారాన్ని మాత్రం ఆకాశమంత స్థాయిలో చేసుకున్నారు. అన్ని దశల్లోనూ విఫలమైనా తాను బాగా పని చేస్తున్నట్లు హడావుడి, హంగామా చేసి మభ్యపుచ్చేందుకు రకరకాల ఫీట్లు నిర్వహించారు. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు తప్పుడు ప్రచారాలకు తెర తీశారు. వరదల్లోనూ చంద్రబాబు తన మార్కు రాజకీయాన్ని వదలకపోవడంతో లక్షలాది మంది ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. తక్షణ సాయం ఊసే లేదు.. జగన్ హయాంలో పక్కాగావిపత్తు బారిన పడిన వారిని పునరావాస కేంద్రాలకు తరలించి తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు తక్షణ సాయం అందించాలి. అసలు కేంద్రాలే ఏర్పాటు చేయని కూటమి సర్కారు తక్షణ సాయం ఊసే లేకుండా చేసింది. వరదలు, తుపానులు వచ్చినప్పుడు వైఎస్ జగన్ హయాంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు బాధితులు ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు ఆర్థిక సాయంగా రూ.2 వేలు చొప్పున పంపిణీ చేశారు. 2020లో కృష్ణా, గోదావరి వరదలు, 2023లో మిచాంగ్ తుపానుతోపాటు ప్రతి విపత్తులోనే ఇదే విధానాన్ని అనుసరించి బాధితులకు తక్షణ సాయం అందించారు. 2014కి ముందు తక్షణ సాయంగా రూ.వెయ్యి అరకొరగా ఇచ్చేవారు. వైఎస్ జగన్ హయాంలో దాన్ని రూ.2 వేలకు పెంచి బాధితులందరికీ అందేలా చర్యలు తీసుకున్నారు. -
Uttarkashi tunnel collapse: శరవేగంగా డ్రిల్లింగ్
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు కొండపై భాగంలో మొదలెట్టిన డ్రిల్లింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 86 మీటర్ల లోతు తవ్వాల్సి ఉండగా 36 మీటర్ల మేర డ్రిల్లింగ్ పూర్తయిందని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) అధికారులు సోమవారం తెలిపారు. శిథిలాల గుండా భారీ ఆగర్ డ్రిల్లింగ్ మెషీన్ తవ్వుతున్నపుడు రాడ్లు అడ్డుతగిలి మెషీన్ ధ్వంసమవడం తెల్సిందే. దీంతో 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీల్ పైపు నుంచి డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను తొలగించి అదే మార్గంలో దూరి కార్మికులు మ్యాన్యువల్‌గా రంధ్రం చేయనున్నారు. ఏమిటీ ర్యాట్–హోల్ పద్ధతి? మేఘాలయలో ఈ పద్ధతి చాలా ఫేమస్. అక్రమ బొగ్గు గనుల్లో ఈ విధానంలోనే బొగ్గు తవ్వేస్తారు. ముందుగా గని ఉపరితలంపై మనిషి దూరేంత చిన్న రంధ్రం చేసి అందులోకి వెళ్లి సమాంతరంగా చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ బొగ్గుపొరలను తొలుస్తారు. ‘‘ మేం పదేళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నాం. కార్మికులను కాపాడేందుకు పనిచేయడం ఇదే తొలిసారి. ఇక్కడ 800 మిల్లీమీటర్ల పైపులోంచి వెళ్లి పనిచేయాలి. మేం 600 మిల్లీమీటర్ల పైపులో కూడా దూరి పనిచేశాం. చిన్న గడ్డపార, పార, చిన్న తట్ట వెంట తీసుకెళ్లి చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ శిథిలాలను తొలగిస్తాం. 12 మీటర్లలో కేవలం మట్టి ఉంటే పని 24 గంటల్లో పూర్తి అవుతుంది. ఒకవేళ గట్టి రాళ్లు ఉంటే 36 గంటలకుపైనే పడుతుంది. వంతుకు ఇద్దరు చొప్పున ఆరుగురం తవ్వేస్తాం’’ అని కార్మికులు వెల్లడించారు. ఈ మార్గంలో ఇంకా 8.15 మీటర్లమేర బ్లేడ్ల ముక్కలను తొలగించాల్సిఉంది. ఆ తర్వాతే మ్యాన్యువల్ డ్రిల్లింగ్ మొదలవుతుంది. మరోవైపు, కొండపైనుంచి నిట్టనిలువుగా డ్రిల్లింగ్ పూర్తయ్యాక రంధ్రంలోకి 1.2 మీటర్ల వ్యాసమున్న పైపులను అమర్చి దాని ద్వారా కార్మికులను పైకి లాగుతారు. రంగంలోకి ‘ర్యాట్–హోల్’ మైనింగ్ కార్మికులు ఈ పని పూర్తిచేసేందుకు ‘ర్యాట్–హోల్’ మైనింగ్‌లో సిద్ధహస్తులైన కార్మికులను రప్పించారు. వీరు 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న పైపు గుండా లోపలికి దూరి శిథిలాలకు రంధ్రం చేస్తూ ముందుకు కదలనున్నారు. ఇలా 12 మీటర్ల మేర డిల్లింగ్ చేయాలి. యూపీలోని ఝాన్సీకి చెందిన కార్మికులు ఇప్పటికే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఝాన్సీకి చెందిన పర్సాదీ లోధీ, విపిన్ రాజ్‌పుత్ తదితరులను ఈ పనికి పురమాయించారు. -
ఆండ్రాయిడ్ ఫోన్లలో భూకంప హెచ్చరికలు!
న్యూఢిల్లీ: తమ వినియోగదారులకు వారు ఉంటున్న ప్రాంతంలో సంభవించబోయే భూకంపానికి సంబంధించిన తక్షణ సమాచారాన్ని అలర్ట్‌ల రూపంలో గూగుల్ అందించనుంది. ఇందుకోసం ఆండ్రాయిడ్ ఫోన్లలో త్వరలో ‘ఎర్త్‌క్వేక్ అలర్ట్’ సందేశ సేవలను ప్రారంభించనుంది. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ), జాతీయ భూకంప కేంద్రాల సమన్వయంతో కొత్తగా ‘ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్స్ సిస్టమ్’ను భారత్‌లో మొదలుపెట్టనుంది. ‘యూజర్లు ఉంటున్న ప్రాంతంలో ఒకచోట భూకంపం వస్తే దానికి పసిగట్టి వెంటనే ఆ ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతాల ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు అందరికీ అలర్ట్‌లు మెరుపువేగంతో వెళతాయి’ అని గూగుల్ బుధవారం ఒక బ్లాగ్‌లో పేర్కొంది. ఆండ్రాయిడ్ 5, ఆపై అప్డేటెడ్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఇన్స్టాల్ అయిన ఫోన్లలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. -
Assam Floods: కొనసాగుతోన్న వరదల బీభత్సం.. 9 మంది మృతి
దిస్పూర్: ఎడతెరిపి లేని వర్షాలు అస్సాంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. శనివారం మొదలైన భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. కొండ చరియలు విరిగిపడి వరద నీరు పోటెత్తడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 27 జిల్లాల్లో సుమారు 1,089 గ్రామలు నీటమునిగాయి. సుమారు 6 లక్షల మంది వరదల ప్రభావానికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. #India Moment the bamboo bridge was washed away in #Assam due to heavy rains and flooding. 20 districts of Assam were affected by #floods on Monday. 2 people died.#indiafloods 💬 @GaiaNewsIntl 🌎 pic.twitter.com/kzaDPpQrUS — ★ GNI ★ GAIA NEWS INTERNATIONAL (@GaiaNewsIntl) May 17, 2022 ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, పోలీసులు రంగంలోకి దిగి ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు వరద చేరిన ఇళ్లల్లో చిక్కుకున్న 3,427 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.142 పునరావాస శిబిరాలు, 115 సహాయ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తం 48,000 మంది బాధితులకు ఆశ్రయం కల్పించారు. వాన బీభత్సంతో పాటు కొండచరియలు విరిగిపడుతుండటంతో రైల్వే ట్రాక్‌లు, వంతెనలు, రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో పలుచోట్ల రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. దిమా హసావో జిల్లాలో రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వరదల ప్రభావంతో ఇప్పటి వరకు 9 మంది మృత్యువాతపడ్డారు. కాచర్‌లో ఇద్దరు, ఉదల్గురిలో ఒకరు మరణించగా.. కొండ చరియలు విరిగిపడి దిమా హసావోలో నలుగురు, లఖింపూర్‌లో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. మరో అయిదుగురు కనిపించకుండా పోయారు. #WATCH | Assam: Efforts to airdrop relief material were initiated in Haflong amidst the #AssamFloods on May 18; will continue today, May 19. pic.twitter.com/jEnaQFGBlj — ANI (@ANI) May 18, 2022 వరద బాధిత జిల్లాలకు అస్సాం ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేసిందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. వరద సహాయక చర్యల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్రం రూ. 1,000 కోట్లు మంజూరు చేసిందన్నారు.వరద బాధిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల సరఫరాను కొనసాగించేందుకు, కమ్యూనికేషన్ మార్గాలను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. రైల్వే లింక్ పునరుద్ధరించడానికి దాదాపు 45 రోజులు పడుతుందని, రెండు-మూడు రోజుల్లో రోడ్డు కనెక్టివిటీని పునరుద్దరిస్తామని సీఎం తెలిపారు. ప్రస్తుతం కంపూర్, ధర్మతుల్ వద్ద కోపిలి నది, నంగ్లమురఘాట్ వద్ద దిసాంగ్ నది, ఏపీ ఘాట్ వద్ద బరాక్ నది, కరీంనగర్ వద్ద కుషియారా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. అయితే రానున్నఈ ప్రాంతంలో విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గౌహతి ఆధారిత ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని, రానున్న రెండు రోజుల పాటు వర్షాలు మరింత కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా శుక్రవారం నుంచి ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు కొద్దిగా మెరుగుపడవచ్చని తెలిపింది. తిరగబడ్డ రైలు బోగీలు వరదనీరు పోటేత్తడంతో దిమా హసావ్ ప్రాంతంలోని హాఫ్లాంగ్ రైల్వే స్టేషన్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. స్టేషన్‌లోని రెండు రైళ్లు పూర్తిగా నీళ్లలో మునిగిపోయాయి. గౌహతి-సిల్చార్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన కొన్ని బోగీలు తిరగబడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ముందే ప్రమాద తీవ్రతను అంచనా వేసిన అధికారులు ప్రయాణికులను సురక్షితంగా తరలించడంతో ప్రాణ నష్టం తప్పింది. రైల్వే అధికారులు 29 రైళ్లను నిలిపివేశారు. ప్యాసింజర్ రైళ్లలోని ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
వేడి తీవ్రతపై ప్రధాని సమీక్ష
న్యూఢిల్లీ: దేశంలో పెరిగిపోతున్న ఎండవేడిపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. వేడి గాలులతో ప్రజలకు ప్రాణాపాయం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన సమీక్షించారు. దేశంలో అధిక ఉష్ణోగ్రతల గురించి సమావేశంలో వాతావరణ శాఖ, జాతీయ విపత్తు నిర్వహణా అథార్టీలు వివరించాయి. అధిక ఎండలతో అగ్ని ప్రమాదాలు, వడగాలులు సంభవిస్తాయని, వీటివల్ల ప్రాణాపాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని కోరారు. దేశంలో అడవుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, అడవుల్లో కార్చిచ్చు రేగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన సమీక్షించారు. రాబోయే రుతుపవనాలను దృష్టిలో ఉంచుకొని తాగునీటి సంరక్షణా చర్యలు తీసుకోవాలని, నీటివనరులు కలుషితం కాకుండా జాగ్రత్తపడాలని ఆదేశించారు. -
ప్లాంట్లను ప్రారంభించే ముందు జాగ్రత్త
న్యూఢిల్లీ: విశాఖపట్టణంలో ఇటీవల చోటు చేసుకున్న విషవాయు లీకేజీ తరహా ప్రమాదాలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ–ఎన్డీఎంఏ) పలు మార్గదర్శకాలను జారీ చేసింది. లాక్డౌన్ అనంతరం పరిశ్రమలను ప్రారంభించే సమయంలో ఉద్యోగులు, కార్మికుల రక్షణకు, ప్లాంట్ భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ఈ మార్గదర్శకాలను రూపొందించింది. లాక్డౌన్ కారణంగా కొన్ని వారాలుగా పరిశ్రమలు మూతపడిన కారణంగా, వాల్వ్‌లు, పైప్‌ల్లో మిగిలిపోయి ఉన్న రసాయనాలతో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశముందని ఎన్డీఎంఏ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను హెచ్చరించింది. మూసివేత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కొన్ని ప్లాంట్లు తీసుకుని ఉండకపోవచ్చని పేర్కొంది. ప్రమాదకర రసాయనాలు, మండే స్వభావమున్న రసాయనాల స్టోరేజ్ ట్యాంక్‌ల నిర్వహణ విషయంలోనూ జాగ్రత్త అవసరమని సూచించింది. పైప్‌లు, వాల్వ్‌లు, వైర్లలో ఎలాంటి లీకేజీల్లేకుండా చూసుకోవాలంది. పరిశ్రమను ప్రారంభించిన తరువాత అన్ని జాగ్రత్తలు తీసుకుని తొలివారం ట్రయల్ రన్ మాత్రమే చేయాలని పేర్కొంది. ట్రయల్ రన్ సమయంలో అసాధారణ శబ్దాలు రావడం కానీ, పొగ వెలువడడం కానీ జరుగుతుందేమో పరిశీలించాలంది. వెంటనే ఉత్పత్తిని పెంచాలని ప్రయత్నించవద్దని, ప్లాంట్ అంతా శానిటైజ్ చేయాలని సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉద్యోగులు, కార్మికుల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలంది. అందరికీ శానిటైజర్లు, మాస్క్‌లు సరఫరా చేయాలంది. సమస్య తీవ్రంగా ఉంటే ప్లాంట్‌ను మూసివేసి, మెయింటెనెన్స్ చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రమాద స్థాయి ఎక్కువగా ఉండే పరిశ్రమల్లో భద్రత చర్యలపై ఆయా రాష్ట్రాల్లోని విపత్తు నిర్వహణ సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. మేనేజీరియల్, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది షిఫ్ట్‌కు 33% ఉండేలా చూసుకోవాలని, ఈ విషయంలో హోం శాఖ మార్గదర్శకాలను పాటించాలని పేర్కొంది. -
చివరికి చెన్నై బలి!
♦ నగరంలో 40 శాతం చెంబరబాక్కం నీరే... ♦ ప్రజాపనులశాఖ బాధ్యతారాహిత్యమే కారణం! చెన్నై, సాక్షి ప్రతినిధి : నీటిని అదిమిపడితే ముంచుకొచ్చే ముప్పు.. ఒక్కసారిగా విడిచిపెడితే తలెత్తే విపత్తు.. ఈ రెండింటిపై అవగాహన లేకే చెన్నై చెరువైందా? దీనికి నీటిపారుదలశాఖ ఇంజనీర్లు మాత్రం అవుననే అంటున్నారు. చెన్నై నగరం దాదాపు 40 శాతం మునకకు చెంబరబాక్కం చెరువే కారణమని, అధికారులు తీసుకున్న తెలివితక్కువ నిర్ణయాలవల్లే ఈ దుస్థితి దాపురించిందని చెబుతున్నారు. వాతావరణశాఖ జారీ చేసిన హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.., ఓవైపు పైనుంచి నీరు పోటెత్తుతున్నా పట్టించుకోకుండా చెంబరబాక్కం చెరువులో నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరేదాకా చూసి, ఆ తర్వాత అకస్మాత్తుగా నీటిని వదలడంతోనే ఈ విపత్తు తలెత్తిందని చెబుతున్నారు. అకస్మాత్తు నిర్ణయం.. అపార నష్టం చెన్నై ప్రజల దాహార్తిని తీర్చే చెంబరబాక్కం చెరువులో నీటి మట్టం ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ప్రమాదస్థాయికి చేరుకుంది. దీంతో నవంబర్ 16వ తేదీ నుండి ఉపరితల నీటిని వదులుతున్నారు. ఇలా విడుదల చేస్తున్న నీటి ప్రవాహాన్ని క్రమేణా 10 వేల ఘనపుటడుగులకు పెంచారు. ఆ తర్వాత ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టడంతో ఔట్‌ఫ్లోను సైతం తగ్గించారు. దీంతో పైనుంచి వచ్చే ప్రవాహంతో చెరువు నిండుకుండలా మారింది. అదే సమయంలో ఒక్కసారిగా మరోసారి వరుణుడు విరుచుకుపడ్డాడు. 24 గంటల వ్యవధిలో 49 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నీటిమట్టం ప్రమాదకర స్థితికి చేరడంతో మంగళ, బుధవారాల్లో నీటి విడుదలను అకస్మాత్తుగా పెంచేశారు. దీంతో చెంబరబాక్కం పరీవాహక ప్రాంతాలన్నీ నీటమునిగాయి. అనుకోని ముప్పుతో అతలాకుతలం.. అకస్మాత్తుగా ఇళ్లలోకి వరద ప్రవాహం పోటెత్తడంతో ప్రజలు భీతావహులయ్యారు. ప్రాణాలు ఉగ్గపట్టుకుని రక్షించేవారి కోసం ఎదురుచూశారు. బోట్లు, పడవల సాయంతో బ్రతుకు జీవుడా అని బయటపడ్డారు. విలువైన సామగ్రినిసైతం వదిలి ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. అధికారులే ముంచేశారు.. చెన్నైలో జనావాసాల మధ్య నుండి ప్రవహించే అడయారు చెరువులో నీటి మట్టం ఎంత ఉందో అంచనావేయకుండా చెంబరబాక్కం చెరువును కాపాడుకుంటే చాలని ప్రజాపనుల శాఖ తీసుకున్న తెలివితక్కువ నిర్ణయం నగరాన్ని నిలువునా ముంచేసిందని స్థానికులు దుయ్యబట్టారు. చెంబరబాక్కం నుండి ఉరకలు వేస్తూ ప్రవహించిన నీటికి.. వరదనీరు తోడవడంతో నగరంలోని సైదాపేట, తేనాంపేట, ఆలందూర్, కొట్టూరుపురం, అడయారు, కున్రత్తూరు తదితర ప్రాంతాలు అల్లకల్లోలమయ్యాయని ఆరోపించారు. చెంబరబాక్కం చెరువును కాపాడుకోవడం కోసం నగరంలోని లక్షలాది ప్రజలను నిరాశ్రయులను చేశారని, వేలాది ఇళ్లను ముంచేశారని వాపోయారు. అధికారుల బాధ్యతారాహిత్యం: రిటైర్డు ఇంజనీరు చెంబరబాక్కం చెరువు నుండి నీటి విడుదలలో అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ప్రజాపనుల శాఖ రిటైర్డు ఇంజనీరు ఒకరు వ్యాఖ్యానించారు. చెంబరబాక్కం చెరువు నుండి భారీస్థాయిలో నీటిని విడుదల చేయాలని అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయమే ఈ దారుణానికి కారణమన్నారు. చెంబరబాక్కం పరీవాహక ప్రాంతాలన్నీ నివాస గృహాలతో చాలా ఇరుకుగా ఉంటాయని, దీనిపై ప్రజాపనుల శాఖాధికారులు అవగాహనారాహిత్యంతో వ్యవహరించడం చె న్నైకి శాపంగా పరిణమించిందని అన్నారు. సహాయ కార్యక్రమాల్లో కొత్త పంథా న్యూఢిల్లీ: తమిళనాడు వరదబాధితులకు కనీస సహాయాన్ని అందించడం కోసం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఆర్ఎఫ్) సోషల్ మీడియాను అనుసంధానంగా ఉపయోగించుకుంటోంది. ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వరద బాధితులను, సహాయం అవసరమైన వారిని గుర్తించే కొత్త ప్రయత్నాన్ని చేస్తోంది. దీని కోసం ఢిల్లీలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది ఈ సంస్థ. అనునిత్యం ఫేస్బుక్లో, ట్విటర్లను గమనిస్తూ... సహాయాన్ని అర్థిస్తూ వచ్చిన పోస్టుల విషయంలో స్పందించడమే ఈ విభాగం పని. వరదల్లో చిక్కుకున్న ప్రజల్లో కొంతమంది తమ పరిస్థితిని సోషల్నెట్వర్కింగ్ సైట్ల ద్వారా బాహ్యప్రపంచానికి తెలియజేయగలుగుతున్నారు. తమిళనాడు వరద బాధితుల నుంచి ఎలాంటి పోస్టులు కనిపించినా వాటికి స్పందనగా ఎన్డీఆర్ఎఫ్ నుంచి పోస్టులు వస్తున్నాయి. వారి సమాచారాన్ని తెలుసుకుని.. చెన్నైలో సహాయ కార్యక్రమాల విధుల్లో ఉన్న బృందాలకు ఆ సమాచారాన్ని అందిస్తోంది. ఈ మేరకు ఎన్డీఆర్ఎఫ్హెచ్క్యూ, ఎన్డీఆర్ఎఫ్ పేరుతో సోషల్నెట్వర్కింగ్ సైట్లలో హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్టులు ప్రచురితం అవుతున్నాయి. సాయానికి సిద్ధం: అమెరికా వాషింగ్టన్: చెన్నై వరదల సహాయకార్యక్రమాల్లో భారత్‌కు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రకటించింది. ఇప్పటి వరకూ ఈ విషయంలో ఇండియా నుంచి సహాయం కోసం ఎలాంటి విజ్ఞప్తి రానప్పటికీ.. మానవతా దృక్పథంతో ఎలాంటి సహాయ చర్యలకైనా తాము సిద్ధంగా ఉన్నామని ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిఘటిస్తున్నామని, ఇప్పటికీ వరదల్లో చిక్కుకున్న ప్రజల పట్ల సానుభూతితో ఉన్నామని ఆయన అన్నారు. భారత ప్రభుత్వంతో అమెరికన్ గవర్నమెంటు సంప్రదింపులు జరుపుతోందని గురువారం ఆయన ప్రకటించారు. ఇలాంటి విపత్తును ఎదుర్కొన శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని, నమ్మకమైన మిత్రదేశం కాబట్టి ఇండియా విషయంలో తాము స్పందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కార్డులు, సర్టిఫికెట్లు.. సర్వం పోయాయి చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రతి ఒక్కదానికీగుర్తింపుకార్డు కోరే ఈ రోజుల్లో చెన్నై నగరంలోని ముంపు బాధితులు సర్వం కోల్పోయారు. ఖరీదైన జీవితానికి పేరైన సినీనటీనటులు, దర్శక నిర్మాతల ఇళ్లు సైతం ముంపునకు గురయ్యాయి. ఓటర్, ఆధార్, రేషన్, పాన్ కార్డులు నీట మునిగిపోయాయి. కొందరి ఇళ్లలో అవి మొత్తం కొట్టుకుపోయాయి. ఇప్పుడు నువ్వు ఎవరు? అంటే తాను తానేనని రుజువు చేసుకోవడానికి కావలసిన ‘గుర్తింపు’ కార్డేదీ లేని దయనీయ స్థితిలో చెన్నైవాసులు ఆందోళన చెందుతున్నారు. రేపన్నాక పరిహారం అందాలన్నా, కొత్త ఇళ్లు మంజూరవ్వాలన్నా ఆ కార్డులే ఆధారమైన నేపథ్యంలో వాటిని మళ్లీ సంపాదించడానికి ఎన్ని కష్టాలు పడాలో అన్నది వారి ఆవేదన. ఇక విద్యార్థుల పరిస్థితి అయితే మరీ ఘోరం. ఇన్నాళ్లూ కష్టపడి చదివి సంపాదించుకున్న చాలా మంది విద్యార్థుల సర్టిఫికెట్లు వరదలో గల్లంతైపోయాయి. వాటిని మళ్లీ తెచ్చుకోవడానికి ఎన్ని తంటాలు పడాలో ఆ దేవుడికే ఎరుక! ఇది ఓ కోణమైతే.. మరోవైపు గత నెల 6వ తేదీ నుంచీ వర్షాల వల్ల పాఠశాలలకు, కాలేజీలకూ సెలవులివ్వడంతో సెమిస్టర్ పరీక్షలు వాయిదాపడ్డాయి. మళ్లీ వాటిని ఎప్పుడు నిర్వహిస్తారో, వాటికి ఎలా ప్రిపేర్ కావాలో అన్న ఆందోళన మరికొందరు విద్యార్థులది. -
నేడు పశ్చిమకు జాతీయ విపత్తు నివారణ బృందం
ఫైలిన్ తుపాన్ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలోని తీరం వెంబడి 9 మండలాల్లో జిల్లా స్థాయి అధికారులను నియమించినట్లు జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. మండల ప్రత్యేక అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నర్సాపురం డివిజన్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్దంగా ఉండాలని అలాగే తీర ప్రాంతాల్లో బలహీనంగా ఉన్న ఏటిగట్లు, చెరువు గట్లను ఇసుక బస్తాలతో పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. దొంగరావిపాలెం, సిద్ధాంతంఏటిగట్టు, రాజుల్లంక, నక్కలడ్రైన్, నందమూరు అక్విడెట్టు, కడెమ్మ సూయీజ్లను.. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కింది స్థాయి అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నేడు జిల్లాకు జాతీయ విపత్తు నివారణ బృందం వస్తుందని వెల్లడించారు. ఏలూరు కలెక్టరేట్లోని కంట్రోల్ రూంలో టోల్ ఫ్రీ నెంబర్ 08812 230617ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
'హిమాలయాల్లో భూకంపం వస్తే...'
ఒకవేళ హిమాలయ పర్వత శిఖరాల్లో సంభవించే భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పై 8 పాయింట్లు నమోదైతే కనుక సుమారు ఎనిమిది లక్షల మంది ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది అని నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి హెచ్చరించారు. హిమాలయ పర్వశ్రేణులకు ఆనుకుని ఉండే రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో గత 53 సంవత్సరాల్లో భూకంప తీవ్రత చాలా ఉధృతంగా ఉన్నట్టు సూచనలు అందుతున్నాయని శశిధర్ రెడ్డి తెలిపారు. భూకంప తీవ్రత 8 పాయింట్లకు మించితే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్నారు. 1950 నుంచి అలాంటి ప్రమాదాన్ని ఇప్పటి వరకు ఎదుర్కోలేదన్నారు. అయితే హియాలయ పర్వత ప్రాంతాల్లో అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నట్టు అధ్యయనాలు వెల్లడించాయన్నారు. భూకంప తీవ్రత 8 పాయింట్లకు మించి ఉన్నట్టయితే భారీగా ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. హిమాచల్ ప్రదేశ్ మండిలో భూకంపం సంభవిస్తే చండిఘర్ లో 20 వేల మంది ప్రాణలకు ముప్పు ఏర్పడుతుందని శశిధర్ రెడ్డి హెచ్చరించారు.