ఫైలిన్ తుపాన్ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలోని తీరం వెంబడి 9 మండలాల్లో జిల్లా స్థాయి అధికారులను నియమించినట్లు జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. మండల ప్రత్యేక అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నర్సాపురం డివిజన్పై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్దంగా ఉండాలని అలాగే తీర ప్రాంతాల్లో బలహీనంగా ఉన్న ఏటిగట్లు, చెరువు గట్లను ఇసుక బస్తాలతో పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
దొంగరావిపాలెం, సిద్ధాంతంఏటిగట్టు, రాజుల్లంక, నక్కలడ్రైన్, నందమూరు అక్విడెట్టు, కడెమ్మ సూయీజ్లను.. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కింది స్థాయి అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నేడు జిల్లాకు జాతీయ విపత్తు నివారణ బృందం వస్తుందని వెల్లడించారు. ఏలూరు కలెక్టరేట్లోని కంట్రోల్ రూంలో టోల్ ఫ్రీ నెంబర్ 08812 230617ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.