
న్యూఢిల్లీ: విశాఖపట్టణంలో ఇటీవల చోటు చేసుకున్న విషవాయు లీకేజీ తరహా ప్రమాదాలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ–ఎన్‌డీఎంఏ) పలు మార్గదర్శకాలను జారీ చేసింది. లాక్‌డౌన్ అనంతరం పరిశ్రమలను ప్రారంభించే సమయంలో ఉద్యోగులు, కార్మికుల రక్షణకు, ప్లాంట్ భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ఈ మార్గదర్శకాలను రూపొందించింది.
లాక్‌డౌన్ కారణంగా కొన్ని వారాలుగా పరిశ్రమలు మూతపడిన కారణంగా, వాల్వ్‌లు, పైప్‌ల్లో మిగిలిపోయి ఉన్న రసాయనాలతో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశముందని ఎన్‌డీఎంఏ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను హెచ్చరించింది. మూసివేత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కొన్ని ప్లాంట్లు తీసుకుని ఉండకపోవచ్చని పేర్కొంది. ప్రమాదకర రసాయనాలు, మండే స్వభావమున్న రసాయనాల స్టోరేజ్ ట్యాంక్‌ల నిర్వహణ విషయంలోనూ జాగ్రత్త అవసరమని సూచించింది.
పైప్‌లు, వాల్వ్‌లు, వైర్లలో ఎలాంటి లీకేజీల్లేకుండా చూసుకోవాలంది. పరిశ్రమను ప్రారంభించిన తరువాత అన్ని జాగ్రత్తలు తీసుకుని తొలివారం ట్రయల్ రన్ మాత్రమే చేయాలని పేర్కొంది. ట్రయల్ రన్ సమయంలో అసాధారణ శబ్దాలు రావడం కానీ, పొగ వెలువడడం కానీ జరుగుతుందేమో పరిశీలించాలంది. వెంటనే ఉత్పత్తిని పెంచాలని ప్రయత్నించవద్దని, ప్లాంట్ అంతా శానిటైజ్ చేయాలని సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉద్యోగులు, కార్మికుల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలంది.
అందరికీ శానిటైజర్లు, మాస్క్‌లు సరఫరా చేయాలంది. సమస్య తీవ్రంగా ఉంటే ప్లాంట్‌ను మూసివేసి, మెయింటెనెన్స్ చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రమాద స్థాయి ఎక్కువగా ఉండే పరిశ్రమల్లో భద్రత చర్యలపై ఆయా రాష్ట్రాల్లోని విపత్తు నిర్వహణ సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. మేనేజీరియల్, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది షిఫ్ట్‌కు 33% ఉండేలా చూసుకోవాలని, ఈ విషయంలో హోం శాఖ మార్గదర్శకాలను పాటించాలని పేర్కొంది.