న్యూఢిల్లీ: కోవిడ్–19 చికిత్సలో భాగంగా పెద్దలకు ఇస్తున్న కొన్నిరకాల ఔషధాలను పిల్లలకు కూడా ఉపయోగిస్తున్నారని, ఇలా చేయడం సరైంది కాదని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా మూడో వేవ్‌లో పాజిటివ్ కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో చిన్నారుల కోవిడ్–కేర్ సేవల విషయంలో బుధవారం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఐవర్‌మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్, ఫావిపిరావిర్ వంటి డ్రగ్స్, డాక్సీసైక్లిన్, అజిత్రోమైసిన్ వంటి యాంటీబయాటిక్స్‌ను పిల్లలకు ఇవ్వొద్దని ప్రతిపాదించింది. వీటిని కరోనా బారినపడిన పెద్దల కోసమే ఉపయోగించాలని గతంలోనే సూచించినట్లు గుర్తుచేసింది. వైరస్ సోకిన పిల్లలకు చికిత్స అందించడంలో అలసత్వం పనికిరాదని, తగిన మౌలిక సదుపాయాలను ఇప్పటినుంచే ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఇప్పుడున్న సదుపాయాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని తెలిపింది. ఎలాంటి అనూహ్య పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.
ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాలు
► ఇప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు కరోనా సులభంగా సోకే ప్రమాదం ఉంది. అందుకే పిల్లలకు సైతం కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక అలాంటివారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి.
► కరోనా చికిత్సలో పెద్దలకు ఉద్దేశించిన ఔషధాలను పిల్లలపై ప్రయోగించకూడదు. వాటిని పిల్లల కోసం సిఫార్సు చేయలేదు.
► భవిష్యత్తులో కరోనా పాజిటివ్ కేసులు పెరిగితే.. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసికట్టుగా పనిచేయాలి.
► లాక్‌డౌన్‌లు పూర్తిగా ఎత్తివేశాక, పాఠశాలలు, కళాశాలలు మళ్లీ తెరిచాక ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఉమ్మడిగా ఎదుర్కోవాలి.
► జిల్లాల్లో కరోనా సెకండ్ వేవ్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు నమోదైన రోజువారీ కేసుల ఆధారంగా థర్డ్‌వేవ్‌లో ఎంతమంది పిల్లలకు కరోనా సోకనుందో, వారిలో ఎంతమంది ఆసుపత్రుల్లో చేరుతారో అంచనాకు రావొచ్చు. దీనిప్రకారం కరోనా బాధిత పిల్లల సంరక్షణ కోసం ఆసుపత్రుల్లో అదనపు పడకలు ఏర్పాటు చేయాలి.
► సుశిక్షితులైన వైద్యులు, నర్సులను నియమించుకోవాలి. వైద్య సిబ్బంది విషయంలో కొరత రాకుండా జాగ్రత్తపడాలి.
► పిల్లల ఆసుపత్రుల్లో కరోనా బాధిత చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లుండాలి. పిల్లలకు కరోనా చికిత్స అందిస్తున్నప్పుడు వారి తల్లిదండ్రులను కూడా అనుమతించవచ్చు.
► పిల్లలకు కరోనా సోకినప్పటికీ చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. కొందరిలో స్వల్ప లక్షణాలే బయటపడుతున్నాయి. ఇలాంటివారు ఇంట్లోనే తల్లిదండ్రుల సంరక్షణలోనే కోలుకుంటున్నారు. లక్షణాలున్న పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు భావిస్తే ఆసుపత్రికి తరలించాలి.
► ఇంట్లో చికిత్స పొందుతున్న కరోనా బాధిత చిన్నారులకు ఆశా వర్కర్ల సేవలు అవసరం.
Comments
Please login to add a commentAdd a comment