రాష్ట్రాల మధ్య ప్రయాణాలపై ఆంక్షల్లేవ్‌ | No curbs on inter-State travel, says Centre in new guidelines | Sakshi
Sakshi News home page

రాష్ట్రాల మధ్య ప్రయాణాలపై ఆంక్షల్లేవ్‌

Published Thu, Aug 26 2021 6:52 AM | Last Updated on Thu, Aug 26 2021 6:52 AM

No curbs on inter-State travel, says Centre in new guidelines - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో అంతర్‌ రాష్ట్ర ప్రయాణాలపై కేంద్రం ఎలాంటి ఆంక్షలు సిఫారసు చేయలేదు. క్వారంటైన్, ఐసోలేషన్‌లకు సంబంధించి రాష్ట్రాలు సొంత ప్రొటోకాల్‌ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించింది. కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ప్రవేశాలకు ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు కావాలని కోరుతున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చింది. సెకండ్‌వేవ్‌లో దేశవ్యాప్తంగా కేసులు క్షీణిస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని అంతర్‌ రాష్ట్ర ప్రయాణాలు సులభతరం చేసే ఉద్దేశంతో తగిన జాగ్రత్తలు పాటిస్తూ దేశీయ ప్రయాణాలకు ఒకే తరహా ప్రోటోకాల్‌ ఉండేలా దేశీయ ప్రయాణ (రైలు, బస్సు , విమానం) మార్గదర్శకాలు సవరిస్తున్నట్లు తెలిపింది. ఈ మార్గదర్శకాలు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తాయని,  తద్వారా అంతర్‌ రాష్ట్ర ప్రయాణాలు సులభతరం చేస్తుందని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ పేర్కొంది.  

ప్రయాణాల్లో పాటించాల్సిన ఆరోగ్య ప్రొటోకాల్‌
► ప్రయాణాల సమయంలో ప్రయాణికులు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలి. కోవిడ్‌–19 లక్షణాలు లేనప్పుడే ప్రయాణం చేయాలి.   
► ప్రయాణికులు మాస్క్, ఫేస్‌ కవర్,  ఆరు అడుగుల భౌతికదూరం  పాటిం చాలి.  
► ప్రయాణ సమయాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు.
► మొబైల్‌లో ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ తప్పనిసరిగా చేసుకోవాలి.
► ప్రయాణ సమయంలో జలుబు, దగ్గు, జ్వరం వచ్చినట్‌లైతే విమాన/బస్సు/రైలు  సిబ్బందికి తెలియజేయాలి.  
► గమ్యస్థానం చేరిన తర్వాత లక్షణాలు కనిపిస్తే జిల్లా నిఘా అధికారి లేదా జాతీయ కాల్‌ సెంటర్‌ 1075కు తెలపాలి.  విమానాశ్రయాలు/రైల్వే స్టేషన్లు/బస్‌ స్టేషన్లకు సూచనలు
► కరోనాకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రకటన చేయాలి
► థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతే ప్రయాణికులను అనుమతించాలి. వెలుపలికి పంపాలి.  
► ప్రయాణ సమయంలో వినియోగించిన మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్‌లు పారవేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలి.  
► విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు తరచుగా శుభ్రపరచాలి.
► లక్షణాలు లేని వారు 14 రోజులపాటు స్వీయ పరిరక్షణ హామీతో బయటకు వెళ్లడానికి అనుమతించాలి.
► ఒకవేళ లక్షణాలు బయటపడితే వారిని ఆరోగ్య కేంద్రాలకు తరలించడానికి తగిన ఏర్పాట్లు చేయాలి.  
► ప్రయాణికులకు అందుబాటులో మాస్కులు, పీపీఈకిట్‌లు, గ్లౌజులు ఉంచాలి.  


రాష్ట్రాలకు సూచనలు
► రైలు, రహదారి, విమానయానం, నీటి మార్గాల ద్వారా అంతర్‌ రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు లేవు.
► ఒకవేళ రాష్ట్రంలో ప్రవేశించాలంటే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష తప్పనిసరి అని నిబంధన పెడితే ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలి.
► రెండు డోసుల టీకా తీసుకున్నవారు, రెండో డోసు తీసుకున్నా ధ్రువపత్రం ఇంకా అందని వారు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే వారిని ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నుంచి మినహాయించాలి.  
► ప్రయాణం తర్వాత లక్షణాలు కనిపిస్తే వారికి రాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్ష చేయడానికి ఆయా ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేయాలి.  
► స్థానిక ప్రయోజనాల నిమిత్తం రాష్ట్రాలు అవసరమైతే అదనంగా ఆంక్షలు విధించొచ్చు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement