రూ. లక్ష కోట్లు..!
భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కొత్త వ్యయ అంచనా
* అధికారిక లెక్కల ప్రకారమే అవసరమయ్యే వ్యయం రూ.89,426 కోట్లు
* రీ ఇంజనీరింగ్ చేసినా ఈ అంచనా దాటకుండా కార్యాచరణ
* బడ్జెట్ పరిమితులను పరిగణనలోకి తీసుకోవాలని వ్యాప్కోస్‌కు సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులతో పాటు, కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణానికి మున్ముం దు భారీ వ్యయ అవసరాలు ఉండనున్నాయి. అన్ని భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి రూ.లక్ష కోట్ల మేర అవసరమని ప్రభుత్వం ఇటీవలే నిర్ధారించుకుంది.
ప్రాజెక్టుల పరిధిలో జరుగుతున్న రీ ఇంజనీరింగ్ పూర్తి చేసినా బడ్జెట్ రూ.లక్ష కోట్లకు దాటకుండా చూసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే రీ ఇంజనీరింగ్ బాధ్యతలు మోస్తున్న వ్యాప్కోస్ సర్వే సంస్థ, నీటి పారుదల శాఖకు సైతం బడ్జెట్ పరిమితులపై స్పష్టమైన సూచనలు చేసింది.
లక్ష్యం చేరాలంటే ‘లక్ష’ కావాల్సిందే..
నిర్మాణ పనులు కొనసాగుతున్న వాటితోపాటు, కొత్తగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలకు కలిపి 21 భారీ, మరో 12 మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలో రూ.1,31,987.81 కోట్ల పనులకు ఇప్పటివరకు పరిపాలనా అనుమతులు లభించాయి. ఇందులో ఈ ఏడాది మార్చి బడ్జెట్ ముగిసే నాటికి రూ.41,699.54 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో మరో రూ.5,220.65 కోట్ల మేర కేటాయింపులు జరుపగా ఇందులోనూ రూ. 862.20 కోట్ల వరకు పనులు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి.
ఈ నెల 20 నాటికి జరిగిన మొత్తం ఖర్చు రూ.42,561 కోట్ల మేర ఉండగా మరో రూ.89,426 కోట్ల పనులు మిగిలినట్లుగా ఇటీవల సీఎం వద్ద సమీక్ష సందర్భంగా అధికారులు నిర్ధారించారు. అయితే ప్రస్తుతం రీ ఇంజనీరింగ్‌లో భాగంగా ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్చుకుంటుండగా, కంతనపల్లి మరింత ముందుకు జరుగుతోంది.
డిండి నిర్మాణానికి ఇటీవలే తుది రూపమిచ్చారు. వీటన్నింటికీ కొత్తగా అంచనా వ్యయాలను కలుపుకుంటే అది మరో రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. వీటితో పాటే ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎస్కలేషన్‌కు మరో రూ.3వేల కోట్ల మేర అవసరమవుతాయి. వీటన్నింటినీ కలుపుకుంటే తుది అంచనా వ్యయం రూ.లక్ష కోట్లకు ఉంటుందని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి.
వ్యాప్కోస్‌కు పరిమితి పాఠాలు..
కాగా, ఈ అంచనా వ్యయాన్ని మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ కావొద్దని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే రీ ఇంజనీరింగ్‌లో భాగంగా జరుగుతున్న మార్పులు చేర్పుల్లో ప్రభుత్వం కీలక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎక్కువగా ముంపు లేకుండా చూసుకోవడం, ఎత్తిపోతల విధానాన్ని పక్కనపెట్టి గ్రావిటీ ద్వారా నీరిచ్చే అంశాలకు ప్రాధాన్యమివ్వడం, టన్నెల్‌ల అవసరాన్ని తగ్గించడం వంటివి చేస్తోంది.
ఎత్తిపోతలుగా ఉన్న డిండి ప్రాజెక్టును ఇటీవలే పూర్తి గ్రావిటీ ప్రాజెక్టుగా మార్చగా, పాలమూరు-రంగారెడ్డిలో టన్నెల్ విధానాన్ని తగ్గించి ఓపెన్ ఛానల్ విధానానికి కార్యరూపం ఇచ్చారు. ప్రాణహిత, కంతనపల్లి, ఎల్లంపలి సహా ఇతర బ్యారేజీల నిర్మాణం విషయంలోనూ ఇదే తరహా సూత్రాన్ని అమలు చేసి ప్రాజెక్టుల డిజైన్ చేయాలని వ్యాప్కోస్ సర్వే సంస్థకు ప్రభుత్వం సూచనలు చేసింది.