‘సాగునీటి’ అప్పులపై వడ్డీని తగ్గించేలా చూడండి | Minister Uttam Kumar Reddy Attended The International Water Week Conference | Sakshi
Sakshi News home page

‘సాగునీటి’ అప్పులపై వడ్డీని తగ్గించేలా చూడండి

Published Wed, Sep 18 2024 4:27 AM | Last Updated on Wed, Sep 18 2024 4:27 AM

Minister Uttam Kumar Reddy Attended The International Water Week Conference

సమ్మక్క–సారలమ్మ ప్రాజెక్టుకు క్లియరెన్సులు ఇవ్వండి  

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ఉత్తమ్‌ విజ్ఞప్తి

8వ ఇంటర్నేషనల్‌ వాటర్‌ వీక్‌ సదస్సుకు హాజరు  

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం గత ప్రభుత్వం చేసిన అప్పులు ఆర్థికంగా భారంగా మారాయని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయా అప్పులపై వడ్డీని పూర్తిగా లేదా పాక్షికంగా తగ్గించేలా కేంద్ర ప్రభుత్వరంగ ద్రవ్య సంస్థలను ఒప్పించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న 8వ అంతర్జాతీయ నీటి వారం సదస్సు– 2024కు ఉత్తమ్‌ హాజరయ్యారు.

రాష్ట్ర పతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించిన ఈ సదస్సు 4 రోజులపాటు కొనసాగనుంది. తొలిరోజు కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి ఉత్తమ్‌.. తెలంగాణలో ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రా ధాన్యతను వివరించారు. ప్రతి ఏటా సుమారు ఆరు లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టును సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో రూ.29 వేల కోట్లను ఈ రంగానికి కేటాయించిందని చెప్పా రు. రాష్ట్ర ప్రభుత్వ కృషికి తోడుగా కేంద్రం నుంచి తగిన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

నిధుల రూపంలో సాయం అందించడంతో పాటు వివిధ రకాల క్లియరెన్సులను కూడా త్వరితగతిన ఇచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సమ్మక్క–సారలమ్మ ప్రాజెక్టుకు అన్ని రకాల క్లియరెన్సులు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలావుండగా మంత్రి.. పలు సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన రుణాలపై ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో 40 దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు మన దేశంలోని 20 రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్‌ మంత్రులు, ఎన్జీవో సంస్థల ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement