Lakh crore
-
ఆ మైలురాయి సాధించడమే ఎస్బీఐ లక్ష్యం
వచ్చే 3-5 సంవత్సరాలలో రూ. 1 లక్ష కోట్ల నికర లాభం మైలురాయిని దాటిన మొదటి భారతీయ ఆర్థిక సంస్థగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.2024 ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ 21.59 శాతం వృద్ధితో రూ.61,077 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. వచ్చే 3-5 సంవత్సరాలలో రూ. 1 లక్ష కోట్లు దాటడం సాధ్యమేనా అని అడిగినప్పుడు “మాకు అవకాశం ఉంది. ఖచ్చితంగా, ఆ మైలురాయిని చేరుకున్న దేశంలో మొదటి కంపెనీగా మేము ఉండాలనుకుంటున్నాం” అని సీఎస్ శెట్టి చెప్పారు.లాభాలు, మార్కెట్ క్యాపిటలైజేషన్ మొదలైనవి తమకు చాలా ముఖ్యమైన అంశాలని, అదే సమయంలో కస్టమర్-సెంట్రిసిటీకి సమానమైన ప్రాధాన్యతనిస్తామని ఆయన పేర్కొన్నారు. అదే తమ కార్యకలాపాలలో ప్రాథమిక అంశంగా ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు.ఇక కార్పొరేట్ రుణ డిమాండ్‌కు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుండి బ్యాంక్ ఇప్పటికే రూ. 4 లక్షల కోట్ల బలమైన క్రెడిట్ పైప్‌లైన్‌ను పొందిందని వివరించారు. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ప్రైవేట్ రంగం మూలధన వ్యయం పెరుగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఓఎన్జీసీ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: తక్కువ కర్బన ఇంధన సంస్థగా అవతరించే లక్ష్యంతో ప్రభుత్వరంగ ఓఎన్జీసీ ఈ దశాబ్దం చివరికి రూ.లక్ష కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. పునరుత్పాదక ఇంధనాలు, గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ ప్రణాళికల్లో భాగంగా ఉన్నాయి. తక్కువ కర్బన ఇంధనాల పోర్ట్‌ఫోలియోను పెంచుకునే స్పష్టమైన కార్యాచరణతో ఉన్నట్టు ఓఎన్జీసీ తాజాగా ప్రకటించింది. ‘‘దేశ ప్రతిష్టాత్మక లక్ష్యాలకు అనుగుణంగా ఓఎన్జీసీ సైతం అడుగులు వేస్తుంది. బిలియన్ టన్నుల మేర కర్బన ఉద్గారాల విడుదలను కట్టడి చేయడం, 2030 నాటికి కర్బన తీవ్రతను 45 శాతానికి తగ్గించడం కోసం కృషి చేస్తాం’’అని ఓఎన్జీసీ తెలిపింది. సుస్థిర విధానాలను అనుసరించడం వల్ల గడిచిన ఐదేళ్లలో స్కోప్–1, స్కోప్–2 ఉద్గారాల విడుదలను 17 శాతం తగ్గించినట్టు పేర్కొంది. 2022–23లోనే ఉద్గారాల విడుదలను 2.66 శాతం తగ్గించుకున్నట్టు వివరించింది. 2038 నాటికి స్కోప్–1, స్కోప్–2 ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకురానున్నట్టు ప్రకటించింది. తక్కువ కర్బన ఇంధనాల కోసం ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నట్టు తెలిపింది. రెండు గ్రీన్‌ఫీల్డ్ ఆయిల్2కెమికల్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. 2030 నాటికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టడంతోపాటు, పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 10 గిగావాట్లకు చేర్చనున్నట్టు తెలిపింది. -
భారీ లక్ష్యాల దిశగా పతంజలి గ్రూప్ - ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల ఆదాయం
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం పతంజలి గ్రూప్ భారీ లక్ష్యాలపై దృష్టి పెట్టింది. రానున్న ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల ఆదాయం సాధించాలని చూస్తోంది. విభిన్న ఉత్పత్తులతో అన్ని రకాల వినియోగదారులకూ చేరువకావడం ద్వారా రూ. లక్ష కోట్ల టర్నోవర్ మైలురాయిని చేరుకోవాలని భావిస్తున్నట్లు పతంజలి గ్రూప్ చీఫ్ రామ్‌దేవ్ తాజాగా పేర్కొన్నారు. ఈ బాటలో లిస్టెడ్ కంపెనీ పతంజలి ఫుడ్స్(రుచీ సోయా ఇండస్ట్రీస్) రూ. 45,000– 50,000 కోట్ల టర్నోవర్‌ను అందుకునేందుకు ప్రణాళికలు వేసినట్లు వెల్లడించారు. వెరసి గ్రూప్ లక్ష్య సాధనలో పతంజలి ఫుడ్స్ కీలకపాత్ర పోషించనున్నట్లు తెలియజేశారు. పోర్ట్‌ఫోలియోలో ప్రీమియం ఉత్పత్తులను జతచేసే వ్యూహంలో భాగంగా పౌష్టికాహారం(న్యూట్రాస్యూటికల్స్), హెల్త్ బిస్కట్స్, చిరు ధాన్య ఆధార ఉత్పత్తులు, డ్రై ఫ్రూట్స్ తదితరాలను ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా దృష్టి దేశీ మార్కెట్‌పైనే విశ్వాసముంచిన కంపెనీ ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీ (విదేశీ దిగ్గజాలు)తో పోటీ పడనున్నట్లు రామ్‌దేవ్ తెలియజేశారు. ప్రస్తుతం యూనిలీవర్ మినహా.. మిగిలిన అన్ని ఎంఎన్‌సీలనూ అధిగమించినట్లు పేర్కొన్నారు. రెండు దశాబ్దాల క్రితం పతంజలి గ్రూప్ రూ. 10,000 కోట్ల టర్నోవర్‌ను అందుకుంటుందని చెప్పినప్పుడు తాము అతిగా అంచనా వేస్తున్నట్లు పలువురు భావించారని ప్రస్తావించారు. ప్రస్తుతం పతంజలి గ్రూప్ టర్నోవర్ రూ. 45,000 కోట్లను తాకినందుకు గర్వంగా ఉన్నట్లు చెప్పారు. అందుబాటు ధరల్లో... పతంజలి ఆయుర్వేద్ ద్వారా అందుబాటు ధరల్లో విభిన్న ప్రొడక్టులను అందిస్తూ వచ్చినట్లు రామ్‌దేవ్ పేర్కొన్నారు. ఇకపై ఎగువ మధ్యతరగతిని లక్ష్యంగా పెట్టుకుని పతంజలి ఫుడ్స్ ద్వారా ప్రీమియం ఉత్పత్తులకు తెరతీస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచస్థాయిలోనూ పతంజలి గ్రూప్ ఎఫ్ఎంసీజీ విభాగంలో విస్తరిస్తున్నట్లు చెప్పారు. 200 దేశాలలో 200 కోట్లమందికి చేరువైనట్లు తెలియజేశారు. దేశీయంగా 70 కోట్లమందిని చేరుకున్న కంపెనీ 100 కోట్లపై దృష్టిపెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం కంపెనీ టర్నోవర్ రూ. 31,000 కోట్లకు చేరినట్లు ఈ సందర్భంగా పతంజలి ఫుడ్స్ సీఈవో సంజీవ్ ఆస్తానా వెల్లడించారు. ఐదేళ్లలో రూ. 50,000 కోట్ల ఆదాయాన్ని అందుకోగలమని అంచనా వేశారు. ప్రీమియం ప్రొడక్టుల నుంచి 10% టర్నోవర్‌ను సాధించనున్నట్లు తెలియజేశారు. ఎన్ఎస్ఈలో పతంజలి ఫుడ్స్ షేరు దాదాపు 2 శాతం బలపడి రూ. 1,140 వద్ద ముగిసింది. -
ఓఎన్జీసీ రూ. లక్ష కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి దిగ్గజం ఓఎన్జీసీ 2030 నాటికి ఇంధన పరివర్తన ప్రాజెక్టులపై రూ. 1 లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. 2038 నాటికి నెట్ జీరో ఎమిషన్స్ (కర్బన ఉద్గారాల విడుదల, తగ్గింపు మధ్య సమతౌల్యం పాటించడం) లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తద్వారా నెట్ జీరో ఎమిషన్స్‌కు మార్గదర్శ ప్రణాళికలను వేసుకుంటున్న తోటి సంస్థలు ఇండియన్ ఆయిల్, హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్), గెయిల్, భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) మొదలైన వాటి సరసన చేరనుంది. కంపెనీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ ఈ విషయాలు వెల్లడించారు. తాము అంతర్గతంగా నెట్–జీరోపై కసరత్తు చేసి 2038 లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆయన తెలిపారు. 2030 నాటికి పునరుత్పాదక వనరుల ద్వారా విద్యుదుత్పత్తిని 189 మెగావాట్ల నుంచి 1 గిగావాట్లకు పెంచుకోవాలని ఓఎన్జీసీ నిర్దేశించుకుంది. ఇప్పటికే రాజస్థాన్‌లో 5 గిగావాట్ల ప్రాజెక్టును ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉండగా.. అదే స్థాయిలో మరో ప్రాజెక్టును నెలకొల్పే అంశం పరిశీలనలో ఉన్నట్లు సింగ్ వివరించారు. మంగళూరులో వార్షికంగా 1 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ప్లాంటును ఏర్పాటు చేయడంపైనా దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. వీటన్నింటికీ మొత్తం మీద రూ. 1 లక్ష కోట్ల వరకు పెట్టుబడులు ఉంటాయని సింగ్ వివరించారు. ఆయిల్ ఉత్పత్తి అప్.. 2022–23లో ఓఎన్జీసీ 19.584 మిలియన్ టన్నుల (ఎంటీ) చమురు ఉత్పత్తి చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 21.263 ఎంటీకి, తదుపరి 21.525 ఎంటీ, ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో 22.389 ఎంటీకి చేరనుంది. 2021–22లో చమురు ఉత్పత్తి 19.545 ఎంటీగా నమోదైంది. మరోవైపు సహజ వాయువు ఉత్పత్తి 2022–23లో 20.636 బీసీఎం (బిలియన్ ఘనపు మీటర్లు)గా ఉండగా, 2023–24లో 23.621 బీసీఎం, తర్వాత ఏడాది 26.08 బీసీఎం, 2025–26లో 27.16 బీసీఎంకు చేరనుంది. తూర్పు, పశ్చిమ తీరాల్లోని ప్రాజెక్టుల్లో ఉత్పాదకతను పెంచుకోవడంతో పాటు కొత్త నిక్షేపాలను కూడా అభివృద్ధి చేస్తుండటంతో ఉత్పత్తి పెరగడానికి దోహదపడుతోంది. ఇదీ చదవండి: ఆర్‌క్యాప్ నష్టాలు తగ్గాయ్ -
రూ.2.9 లక్షల కోట్లకు ఎంఎఫ్ఐ రుణ ఆస్తులు!
ముంబై: సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐలు) పరిధిలోని రుణాల పోర్ట్‌ఫోలియో గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2021–22) 10 శాతానికి పైగా వృద్ధి చెంది రూ.2.9 లక్షల కోట్లకు చేరినట్టు క్రెడిట్ సమాచార సంస్థ ‘క్రిఫ్ హై మార్క్’ తెలిపింది. 2021 మార్చి నాటికి రుణాల పోర్ట్‌పోలియో రూ.2.6 లక్షల కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. సీక్వెన్షియల్‌గా చూస్తే మార్చి చివరికి స్థూల రుణాలు 8.6 శాతం పెరిగినట్టు తన తాజా నివేదికలో వివరించింది. దీని ప్రకారం.. సూక్ష్మ రుణాల్లో బ్యాంకులు 37.7 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. ఆ తర్వాత ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు 33.3 శాతం వాటాను శాసిస్తున్నాయి. చిన్న ఫైనాన్స్ బ్యాంకుల వాటా 17.1 శాతంగా ఉంది. 2021–22 చివరి మూడు నెలల్లో రూ.191 లక్షల రుణాలు మంజూరయ్యాయి. అంతకుముందు త్రైమాసికం గణాంకాలతో పోలిస్తే రుణ వితరణలో 15.5 శాతం వృద్ధి కనిపించింది. కానీ, 2020–21 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంతో పోలిస్తే రుణాల మంజూరు 17.2 శాతం తగ్గింది. కస్టమర్ల బేస్ వార్షికంగా 1.7 శాతం, త్రైమాసికంగా 3.4 శాతం చొప్పున పెరిగింది. 2020 మార్చి నాటికి పట్టణ ప్రాంతాల్లో 5.7 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 13.5 శాతం చొప్పన వృద్ధి నమోదైంది. దేశవ్యాప్తంగా మొత్తం సూక్ష్మ రుణాల్లో 83.4 శాతం పది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఆస్తుల నాణ్యత 30 రోజులకు పైగా బకాయి ఉన్న సూక్ష్మ రుణాలు 2021 డిసెంబర్ నాటికి 9.2 శాతంగా ఉంటే, 2022 మార్చి నాటికి 6 శాతానికి తగ్గాయి. 90 రోజులకు పైగా బకాయి ఉన్న రుణ ఆస్తులు 3.7 శాతం నుంచి 2.7 శాతానికి దిగొచ్చాయి. -
వరుసగా మూడోసారి రూ. లక్ష కోట్లు దాటేశాయి
సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ వసూళ్లు వరుసగా మూడవ నెలలో కూడా లక్ష కోట్ల మార్క్‌ను దాటాయి. మే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి మందగించినప్పటికీ జీఎస్టీ వసూళ్లు బాగా పుంజుకున్నాయి. దీంతో మే నెలలో రూ. 100289 కోట్లు వసూలయ్యాయి. వార్షిక ప్రాతిపదికన వసూళ్లు, 6.67 శాతం పుంజుకోగా, ఆదాయం 2.21శాతం పెరిగి 94,016 కోట్ల రూపాయలుగా ఉంది. జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్ మొత్తం రు. 1,13,865 కోట్లగా ఉండగా, మార్చిలో రూ. 1,06,577 కోట్లుగా నమోదయ్యాయి. శనివారం ఆర్థికమంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. సెంట్రల్ జీఎస్టీ ఆదాయం రూ .17,811 కోట్లు, ఎస్జీఎస్టీ రూ 24,462 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ ఆదాయం. రూ 49,891 కోట్లు. చెస్ వసూళ్లు రూ .8,125 కోట్లు. 2019 మే నెలలో 3,108 రిటర్న్స్ దాఖలు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
రూ. లక్ష కోట్లు..!
భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కొత్త వ్యయ అంచనా * అధికారిక లెక్కల ప్రకారమే అవసరమయ్యే వ్యయం రూ.89,426 కోట్లు * రీ ఇంజనీరింగ్ చేసినా ఈ అంచనా దాటకుండా కార్యాచరణ * బడ్జెట్ పరిమితులను పరిగణనలోకి తీసుకోవాలని వ్యాప్కోస్‌కు సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులతో పాటు, కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణానికి మున్ముం దు భారీ వ్యయ అవసరాలు ఉండనున్నాయి. అన్ని భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి రూ.లక్ష కోట్ల మేర అవసరమని ప్రభుత్వం ఇటీవలే నిర్ధారించుకుంది. ప్రాజెక్టుల పరిధిలో జరుగుతున్న రీ ఇంజనీరింగ్ పూర్తి చేసినా బడ్జెట్ రూ.లక్ష కోట్లకు దాటకుండా చూసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే రీ ఇంజనీరింగ్ బాధ్యతలు మోస్తున్న వ్యాప్కోస్ సర్వే సంస్థ, నీటి పారుదల శాఖకు సైతం బడ్జెట్ పరిమితులపై స్పష్టమైన సూచనలు చేసింది. లక్ష్యం చేరాలంటే ‘లక్ష’ కావాల్సిందే.. నిర్మాణ పనులు కొనసాగుతున్న వాటితోపాటు, కొత్తగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలకు కలిపి 21 భారీ, మరో 12 మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలో రూ.1,31,987.81 కోట్ల పనులకు ఇప్పటివరకు పరిపాలనా అనుమతులు లభించాయి. ఇందులో ఈ ఏడాది మార్చి బడ్జెట్ ముగిసే నాటికి రూ.41,699.54 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది బడ్జెట్లో మరో రూ.5,220.65 కోట్ల మేర కేటాయింపులు జరుపగా ఇందులోనూ రూ. 862.20 కోట్ల వరకు పనులు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ నెల 20 నాటికి జరిగిన మొత్తం ఖర్చు రూ.42,561 కోట్ల మేర ఉండగా మరో రూ.89,426 కోట్ల పనులు మిగిలినట్లుగా ఇటీవల సీఎం వద్ద సమీక్ష సందర్భంగా అధికారులు నిర్ధారించారు. అయితే ప్రస్తుతం రీ ఇంజనీరింగ్‌లో భాగంగా ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్చుకుంటుండగా, కంతనపల్లి మరింత ముందుకు జరుగుతోంది. డిండి నిర్మాణానికి ఇటీవలే తుది రూపమిచ్చారు. వీటన్నింటికీ కొత్తగా అంచనా వ్యయాలను కలుపుకుంటే అది మరో రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. వీటితో పాటే ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎస్కలేషన్‌కు మరో రూ.3వేల కోట్ల మేర అవసరమవుతాయి. వీటన్నింటినీ కలుపుకుంటే తుది అంచనా వ్యయం రూ.లక్ష కోట్లకు ఉంటుందని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. వ్యాప్కోస్‌కు పరిమితి పాఠాలు.. కాగా, ఈ అంచనా వ్యయాన్ని మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ కావొద్దని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే రీ ఇంజనీరింగ్‌లో భాగంగా జరుగుతున్న మార్పులు చేర్పుల్లో ప్రభుత్వం కీలక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎక్కువగా ముంపు లేకుండా చూసుకోవడం, ఎత్తిపోతల విధానాన్ని పక్కనపెట్టి గ్రావిటీ ద్వారా నీరిచ్చే అంశాలకు ప్రాధాన్యమివ్వడం, టన్నెల్ల అవసరాన్ని తగ్గించడం వంటివి చేస్తోంది. ఎత్తిపోతలుగా ఉన్న డిండి ప్రాజెక్టును ఇటీవలే పూర్తి గ్రావిటీ ప్రాజెక్టుగా మార్చగా, పాలమూరు-రంగారెడ్డిలో టన్నెల్ విధానాన్ని తగ్గించి ఓపెన్ ఛానల్ విధానానికి కార్యరూపం ఇచ్చారు. ప్రాణహిత, కంతనపల్లి, ఎల్లంపలి సహా ఇతర బ్యారేజీల నిర్మాణం విషయంలోనూ ఇదే తరహా సూత్రాన్ని అమలు చేసి ప్రాజెక్టుల డిజైన్ చేయాలని వ్యాప్కోస్ సర్వే సంస్థకు ప్రభుత్వం సూచనలు చేసింది.