ముంబై: సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్‌ఐలు) పరిధిలోని రుణాల పోర్ట్‌ఫోలియో గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2021–22) 10 శాతానికి పైగా వృద్ధి చెంది రూ.2.9 లక్షల కోట్లకు చేరినట్టు క్రెడిట్ సమాచార సంస్థ ‘క్రిఫ్ హై మార్క్’ తెలిపింది. 2021 మార్చి నాటికి రుణాల పోర్ట్‌పోలియో రూ.2.6 లక్షల కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. సీక్వెన్షియల్‌గా చూస్తే మార్చి చివరికి స్థూల రుణాలు 8.6 శాతం పెరిగినట్టు తన తాజా నివేదికలో వివరించింది. దీని ప్రకారం.. సూక్ష్మ రుణాల్లో బ్యాంకులు 37.7 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. ఆ తర్వాత ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఎఫ్‌ఐలు 33.3 శాతం వాటాను శాసిస్తున్నాయి. చిన్న ఫైనాన్స్ బ్యాంకుల వాటా 17.1 శాతంగా ఉంది.
2021–22 చివరి మూడు నెలల్లో రూ.191 లక్షల రుణాలు మంజూరయ్యాయి. అంతకుముందు త్రైమాసికం గణాంకాలతో పోలిస్తే రుణ వితరణలో 15.5 శాతం వృద్ధి కనిపించింది. కానీ, 2020–21 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంతో పోలిస్తే రుణాల మంజూరు 17.2 శాతం తగ్గింది. కస్టమర్ల బేస్ వార్షికంగా 1.7 శాతం, త్రైమాసికంగా 3.4 శాతం చొప్పున పెరిగింది. 2020 మార్చి నాటికి పట్టణ ప్రాంతాల్లో 5.7 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 13.5 శాతం చొప్పన వృద్ధి నమోదైంది. దేశవ్యాప్తంగా మొత్తం సూక్ష్మ రుణాల్లో 83.4 శాతం పది రాష్ట్రాల్లోనే ఉన్నాయి.
ఆస్తుల నాణ్యత
30 రోజులకు పైగా బకాయి ఉన్న సూక్ష్మ రుణాలు 2021 డిసెంబర్ నాటికి 9.2 శాతంగా ఉంటే, 2022 మార్చి నాటికి 6 శాతానికి తగ్గాయి. 90 రోజులకు పైగా బకాయి ఉన్న రుణ ఆస్తులు 3.7 శాతం నుంచి 2.7 శాతానికి దిగొచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment