
వచ్చే 3-5 సంవత్సరాలలో రూ. 1 లక్ష కోట్ల నికర లాభం మైలురాయిని దాటిన మొదటి భారతీయ ఆర్థిక సంస్థగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.
2024 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ 21.59 శాతం వృద్ధితో రూ.61,077 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. వచ్చే 3-5 సంవత్సరాలలో రూ. 1 లక్ష కోట్లు దాటడం సాధ్యమేనా అని అడిగినప్పుడు “మాకు అవకాశం ఉంది. ఖచ్చితంగా, ఆ మైలురాయిని చేరుకున్న దేశంలో మొదటి కంపెనీగా మేము ఉండాలనుకుంటున్నాం” అని సీఎస్ శెట్టి చెప్పారు.
లాభాలు, మార్కెట్ క్యాపిటలైజేషన్ మొదలైనవి తమకు చాలా ముఖ్యమైన అంశాలని, అదే సమయంలో కస్టమర్-సెంట్రిసిటీకి సమానమైన ప్రాధాన్యతనిస్తామని ఆయన పేర్కొన్నారు. అదే తమ కార్యకలాపాలలో ప్రాథమిక అంశంగా ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
ఇక కార్పొరేట్ రుణ డిమాండ్‌కు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుండి బ్యాంక్ ఇప్పటికే రూ. 4 లక్షల కోట్ల బలమైన క్రెడిట్ పైప్‌లైన్‌ను పొందిందని వివరించారు. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ప్రైవేట్ రంగం మూలధన వ్యయం పెరుగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment