న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం పతంజలి గ్రూప్ భారీ లక్ష్యాలపై దృష్టి పెట్టింది. రానున్న ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల ఆదాయం సాధించాలని చూస్తోంది. విభిన్న ఉత్పత్తులతో అన్ని రకాల వినియోగదారులకూ చేరువకావడం ద్వారా రూ. లక్ష కోట్ల టర్నోవర్ మైలురాయిని చేరుకోవాలని భావిస్తున్నట్లు పతంజలి గ్రూప్ చీఫ్ రామ్‌దేవ్ తాజాగా పేర్కొన్నారు. ఈ బాటలో లిస్టెడ్ కంపెనీ పతంజలి ఫుడ్స్(రుచీ సోయా ఇండస్ట్రీస్) రూ. 45,000– 50,000 కోట్ల టర్నోవర్‌ను అందుకునేందుకు ప్రణాళికలు వేసినట్లు వెల్లడించారు. వెరసి గ్రూప్ లక్ష్య సాధనలో పతంజలి ఫుడ్స్ కీలకపాత్ర పోషించనున్నట్లు తెలియజేశారు. పోర్ట్‌ఫోలియోలో ప్రీమియం ఉత్పత్తులను జతచేసే వ్యూహంలో భాగంగా పౌష్టికాహారం(న్యూట్రాస్యూటికల్స్), హెల్త్ బిస్కట్స్, చిరు ధాన్య ఆధార ఉత్పత్తులు, డ్రై ఫ్రూట్స్ తదితరాలను ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు.
దేశీయంగా దృష్టి
దేశీ మార్కెట్‌పైనే విశ్వాసముంచిన కంపెనీ ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీ (విదేశీ దిగ్గజాలు)తో పోటీ పడనున్నట్లు రామ్‌దేవ్ తెలియజేశారు. ప్రస్తుతం యూనిలీవర్ మినహా.. మిగిలిన అన్ని ఎంఎన్‌సీలనూ అధిగమించినట్లు పేర్కొన్నారు. రెండు దశాబ్దాల క్రితం పతంజలి గ్రూప్ రూ. 10,000 కోట్ల టర్నోవర్‌ను అందుకుంటుందని చెప్పినప్పుడు తాము అతిగా అంచనా వేస్తున్నట్లు పలువురు భావించారని ప్రస్తావించారు. ప్రస్తుతం పతంజలి గ్రూప్ టర్నోవర్ రూ. 45,000 కోట్లను తాకినందుకు గర్వంగా ఉన్నట్లు చెప్పారు.
అందుబాటు ధరల్లో...
పతంజలి ఆయుర్వేద్ ద్వారా అందుబాటు ధరల్లో విభిన్న ప్రొడక్టులను అందిస్తూ వచ్చినట్లు రామ్‌దేవ్ పేర్కొన్నారు. ఇకపై ఎగువ మధ్యతరగతిని లక్ష్యంగా పెట్టుకుని పతంజలి ఫుడ్స్ ద్వారా ప్రీమియం ఉత్పత్తులకు తెరతీస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచస్థాయిలోనూ పతంజలి గ్రూప్ ఎఫ్‌ఎంసీజీ విభాగంలో విస్తరిస్తున్నట్లు చెప్పారు. 200 దేశాలలో 200 కోట్లమందికి చేరువైనట్లు తెలియజేశారు. దేశీయంగా 70 కోట్లమందిని చేరుకున్న కంపెనీ 100 కోట్లపై దృష్టిపెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం కంపెనీ టర్నోవర్ రూ. 31,000 కోట్లకు చేరినట్లు ఈ సందర్భంగా పతంజలి ఫుడ్స్ సీఈవో సంజీవ్ ఆస్తానా వెల్లడించారు. ఐదేళ్లలో రూ. 50,000 కోట్ల ఆదాయాన్ని అందుకోగలమని అంచనా వేశారు. ప్రీమియం ప్రొడక్టుల నుంచి 10% టర్నోవర్‌ను సాధించనున్నట్లు తెలియజేశారు.
ఎన్‌ఎస్‌ఈలో పతంజలి ఫుడ్స్ షేరు దాదాపు 2 శాతం బలపడి రూ. 1,140 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment