Patanjali Food Products
-
పతంజలికి భారీ షాక్, లాభాలు ఢమాల్!
న్యూఢిల్లీ: పతంజలి ఫుడ్స్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 64 శాతం క్షీణించి రూ.88 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.241 కోట్లుగా ఉంది. ముఖ్యంగా వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టడంతో, ఈ విభాగంలో కంపెనీ నికర నష్టాలు ఎదుర్కొన్నది. ఫుడ్ వ్యాపారం మెరుగైన పనితీరుతో ఆదుకుంది. మొత్తం ఆదాయం రూ.7,370 కోట్ల నుంచి రూ.7,810 కోట్లకు పెరిగింది. (IT refund scam: తెలుసుకోండి: లేదంటే కొంప కొల్లేరే!) వంట నూనెల విభాగం ఆదాయం రూ.5,891 కోట్లుగా ఉంది. వంట నూనెల ఆదాయం తగ్గినప్పటికీ, అమ్మకాల పరిమాణం 1.4 టన్నుల మేర పెరిగినట్టు, ఇది వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 36 శాతం అధికమని పతంజలి ఫుడ్స్ తెలిపింది. ‘‘వంట నూనెల పరిశ్రమపై ధరలు క్షీణత ప్రభావం బలంగా పడింది. క్రితం త్రైమాసికం నుంచి చూస్తే ధరలు తగ్గిపోవడంతో, అధిక ధరల వద్ద కొనుగోలు చేసిన వంట నూనెల నిల్వ కారణంగా, రవాణాలో ఉన్న స్టాక్ కారణంగా నష్టపోవాల్సి వచ్చింది. (గోల్డ్ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!) అధిక ధరల వద్ద కొనుగోలు చేసిన వంట నూనెల నిల్వలు ఉన్నప్పటికీ, ధరలు తగ్గించాలంటూ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపించింది. జూన్ త్రైమాసికంలో నమోదైనదంతా కూడా సైక్లికలే’’అని వివరించింది. తమ ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ వ్యాపారం అనుకున్న విధంగా పనితీరు చూపించిందని.. నూతన ఉత్పత్తుల విడుదలతో ఇది మరింత వృద్ధిని చూస్తుందని పతంజలి ఫుడ్స్ సీఈవో సంజీవ్ ఆస్థానా పేర్కొన్నారు. ఆదాయం, లాభాలకు ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ పెద్ద మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. -
పతంజలి ఫుడ్స్‌లో జీక్యూజీ పెట్టుబడి
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం పతంజలి ఫుడ్స్‌లో యూఎస్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం జీక్యూజీ పార్ట్నర్స్ 5.96 శాతం వాటాను కొనుగోలు చేసింది. కంపెనీ చేపట్టిన ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)లో భాగంగా 2,15,64,517 షేర్లను సొంతం చేసుకుంది. ఇది కంపెనీ ఈక్విటీలో 5.96 శాతం వాటాకాగా.. బుధవారం షేరు ధర దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 1,332.75 వద్ద ముగిసింది. ఈ ధరలో చూస్తే జీక్యూజీ పెట్టుబడి విలువ రూ. 2,900 కోట్లకు చేరింది. కాగా.. గత వారం ఓఎఫ్ఎస్ను చేపట్టిన పతంజలి ఫుడ్స్ షేరుకి రూ. 1,000 ఫ్లోర్ ధరలో 2.53 కోట్ల షేర్ల(7 శాతం వాటా)ను ఆఫర్ చేసింది. తద్వారా కంపెనీలో పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధన అమలుకు మాతృ సంస్థ పతంజలి ఆయుర్వేద తెరతీసింది. దీంతో పతంజలి ఫుడ్స్‌లో పతంజలి ఆయుర్వేద వాటా 80.82 శాతం నుంచి 73.82 శాతానికి దిగివచ్చింది. ఇంతక్రితం జూన్‌లో జీక్యూజీ పార్ట్‌నర్స్‌తోపాటు ఇతర విదేశీ సంస్థలు.. అదానీ గ్రూప్ కంపెనీలలోనూ బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
పతంజలి ఫుడ్స్ ఓఎఫ్ఎస్ సక్సెస్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం పతంజలి ఫుడ్స్ చేపట్టిన ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విజయవంతమైంది. శుక్రవారం ముగిసిన ఇష్యూకి రెండు రెట్లు సబ్స్క్రిప్షన్ లభించింది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 3 రెట్లు, సంస్థాగత వర్గాల నుంచి 2 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ప్రమోటర్ సంస్థ పతంజలి ఆయుర్వేద్ ఓఎఫ్ఎస్ ద్వారా పతంజలి ఫుడ్స్‌లో 7 శాతం వాటాను విక్రయానికి ఉంచింది. తద్వారా కంపెనీలో పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధన అమలుకు తెరతీసింది. ఓఎఫ్ఎస్లో 25,33,964 షేర్లను ఆఫర్ చేయగా.. 76,34,567 షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. రిటైలేతర ఇన్వెస్టర్లకు గురువారమే 2.28 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 4.56 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. వెరసి 2,53,39,640 షేర్లను విక్రయానికి ఉంచింది. ఇందుకు షేరుకి రూ. 1,000 ఫ్లోర్ ధరను పతంజలి ఆయుర్వేద్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజా ఇష్యూతో ప్రస్తుతం కంపెనీలో 19.18 శాతంగా ఉన్న పబ్లిక్ వాటా 25 శాతానికిపైగా చేరనుంది. ఓఎఫ్ఎస్ నేపథ్యంలో పతంజలి ఫుడ్స్ షేరు బీఎస్ఈలో 5% జంప్‌చేసి రూ. 1,225 వద్ద ముగిసింది. -
పతంజలి ఫుడ్స్‌లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: లిస్టింగ్ నిబంధనలకు అనుగుణంగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం పతంజలి ఫుడ్స్‌లో ప్రమోటర్ సంస్థ పతంజలి ఆయుర్వేద్ 7 శాతం వాటాను విక్రయించనుంది. కంపెనీలో పబ్లిక్ వాటాను 25 శాతానికి పెంచే బాటలో స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)ను చేపట్టనున్నట్లు పతంజలి ఫుడ్స్ పేర్కొంది. తద్వారా పతంజలి ఆయుర్వేద్ 2.53 కోట్ల షేర్లను( 7 శాతం వాటా) విక్రయించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు షేరుకి రూ. 1,000 ఫ్లోర్ ధరను నిర్ణయించింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు నేడు(13న) ప్రారంభంకానున్న ఓఎఫ్ఎస్ శుక్రవారం(14న) రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి రానుంది. వాటా విక్రయం ద్వారా పతంజలి ఆయుర్వేద్ కనీసం రూ. 2,530 కోట్లు అందుకోనుంది. ప్రస్తుతం పతంజలి ఫుడ్స్‌లో పబ్లిక్కు 19.18 శాతం వాటా ఉంది. కాగా.. డిమాండు ఆధారంగా పతంజలి ఆయుర్వేద్ అదనంగా 2 శాతం వాటా(72.4 లక్షల షేర్లు)ను విక్రయించనుంది. వెరసి 9 శాతం వరకూ వాటాను తగ్గించుకునే యోచనలో ఉంది. ఓఎఫ్ఎస్ వార్తల నేపథ్యంలో పతంజలి ఫుడ్స్ షేరు బీఎస్ఈలో 1.3 శాతం లాభంతో రూ. 1,228 వద్ద ముగిసింది. -
పతంజలి పెట్టుబడుల బాట
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం పతంజలి ఫుడ్స్ పెట్టుబడుల బాట పట్టింది. రానున్న ఐదేళ్లలో రూ. 1,500 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ సీఈవో సంజీవ్ ఆస్తానా తెలియజేశారు. ప్రధానంగా ఆయిల్ పామ్ బిజినెస్‌ను పెంచుకునేందుకు నిధులను వెచి్చంచనున్నట్లు పేర్కొన్నారు. గతంలో రుచీ సోయాగా కార్యకలాపాలు కొనసాగించిన కంపెనీ రానున్న ఐదేళ్లలో రూ. 50,000 కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు విభిన్న ప్రొడక్టుల విడుదల, పంపిణీని విస్తరించడం తదితర ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇప్పటికే కంపెనీ తగినన్ని పెట్టుబడి వ్యయాలతో సామర్థ్య విస్తరణ చేపట్టినట్లు సంజీవ్ ప్రస్తావించారు. దీంతో తొలినాళ్లలో కంటే చివరి రెండేళ్లలో అధికంగా పెట్టుబడులు వెచి్చంచనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం కంపెనీ 64,000 హెక్టార్లలో చేస్తున్న సాగు ద్వారా తగిన ప్రతిఫలాన్ని అందుకున్నట్లు వెల్లడించారు. వెరసి ఆయిల్ పామ్ ప్లాంటేషన్ భారీ బిజినెస్‌గా ఆవిర్భవించినట్లు వెల్లడించారు. వంటనూనెల జాతీయ మిషన్‌లో భాగంగా భవిష్యత్‌లో ఐదు లక్షల హెక్టార్ల ప్లాంటేషన్‌కు కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. ఈశాన్య ప్రాంతంలోని అస్సామ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, త్రిపుర, నాగాలాండ్‌లలో వీటిని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. దక్షిణాదిలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో భారీ సాగును నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో తెలంగాణ, కర్ణాటకలోనూ పామాయిల్ ప్లాంటేషన్‌కు తెరతీయగా.. ఒడిషా, చత్తీస్‌గఢ్, గుజరాత్ తదితర రాష్ట్రాలలోనూ విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు వివరించారు. -
భారీ లక్ష్యాల దిశగా పతంజలి గ్రూప్ - ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల ఆదాయం
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం పతంజలి గ్రూప్ భారీ లక్ష్యాలపై దృష్టి పెట్టింది. రానున్న ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల ఆదాయం సాధించాలని చూస్తోంది. విభిన్న ఉత్పత్తులతో అన్ని రకాల వినియోగదారులకూ చేరువకావడం ద్వారా రూ. లక్ష కోట్ల టర్నోవర్ మైలురాయిని చేరుకోవాలని భావిస్తున్నట్లు పతంజలి గ్రూప్ చీఫ్ రామ్‌దేవ్ తాజాగా పేర్కొన్నారు. ఈ బాటలో లిస్టెడ్ కంపెనీ పతంజలి ఫుడ్స్(రుచీ సోయా ఇండస్ట్రీస్) రూ. 45,000– 50,000 కోట్ల టర్నోవర్‌ను అందుకునేందుకు ప్రణాళికలు వేసినట్లు వెల్లడించారు. వెరసి గ్రూప్ లక్ష్య సాధనలో పతంజలి ఫుడ్స్ కీలకపాత్ర పోషించనున్నట్లు తెలియజేశారు. పోర్ట్‌ఫోలియోలో ప్రీమియం ఉత్పత్తులను జతచేసే వ్యూహంలో భాగంగా పౌష్టికాహారం(న్యూట్రాస్యూటికల్స్), హెల్త్ బిస్కట్స్, చిరు ధాన్య ఆధార ఉత్పత్తులు, డ్రై ఫ్రూట్స్ తదితరాలను ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా దృష్టి దేశీ మార్కెట్‌పైనే విశ్వాసముంచిన కంపెనీ ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీ (విదేశీ దిగ్గజాలు)తో పోటీ పడనున్నట్లు రామ్‌దేవ్ తెలియజేశారు. ప్రస్తుతం యూనిలీవర్ మినహా.. మిగిలిన అన్ని ఎంఎన్‌సీలనూ అధిగమించినట్లు పేర్కొన్నారు. రెండు దశాబ్దాల క్రితం పతంజలి గ్రూప్ రూ. 10,000 కోట్ల టర్నోవర్‌ను అందుకుంటుందని చెప్పినప్పుడు తాము అతిగా అంచనా వేస్తున్నట్లు పలువురు భావించారని ప్రస్తావించారు. ప్రస్తుతం పతంజలి గ్రూప్ టర్నోవర్ రూ. 45,000 కోట్లను తాకినందుకు గర్వంగా ఉన్నట్లు చెప్పారు. అందుబాటు ధరల్లో... పతంజలి ఆయుర్వేద్ ద్వారా అందుబాటు ధరల్లో విభిన్న ప్రొడక్టులను అందిస్తూ వచ్చినట్లు రామ్‌దేవ్ పేర్కొన్నారు. ఇకపై ఎగువ మధ్యతరగతిని లక్ష్యంగా పెట్టుకుని పతంజలి ఫుడ్స్ ద్వారా ప్రీమియం ఉత్పత్తులకు తెరతీస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచస్థాయిలోనూ పతంజలి గ్రూప్ ఎఫ్ఎంసీజీ విభాగంలో విస్తరిస్తున్నట్లు చెప్పారు. 200 దేశాలలో 200 కోట్లమందికి చేరువైనట్లు తెలియజేశారు. దేశీయంగా 70 కోట్లమందిని చేరుకున్న కంపెనీ 100 కోట్లపై దృష్టిపెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం కంపెనీ టర్నోవర్ రూ. 31,000 కోట్లకు చేరినట్లు ఈ సందర్భంగా పతంజలి ఫుడ్స్ సీఈవో సంజీవ్ ఆస్తానా వెల్లడించారు. ఐదేళ్లలో రూ. 50,000 కోట్ల ఆదాయాన్ని అందుకోగలమని అంచనా వేశారు. ప్రీమియం ప్రొడక్టుల నుంచి 10% టర్నోవర్‌ను సాధించనున్నట్లు తెలియజేశారు. ఎన్ఎస్ఈలో పతంజలి ఫుడ్స్ షేరు దాదాపు 2 శాతం బలపడి రూ. 1,140 వద్ద ముగిసింది. -
భారీ లక్ష్యాల దిశగా పతంజలి ఫుడ్స్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం పతంజలి ఫుడ్స్ భారీ లక్ష్యాలపై దృష్టి పెట్టింది. రానున్న ఐదేళ్లలో రూ. 5,000 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించాలని చూస్తోంది. ఈ బాటలో రూ. 50,000 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ఎఫ్ఎంసీజీ బిజినెస్, ఆయిల్ పామ్ ప్లాంటేషన్స్ ద్వారా లక్ష్యాలను సాధించాలని ఆశిస్తోంది. గతంలో రుచీ సోయా ఇండస్ట్రీస్‌గా కార్యకలాపాలు నిర్వహించిన కంపెనీ ఫుడ్, ఎఫ్ఎంసీజీ విభాగాలను భారీ వృద్ధి బాట పట్టించాలని ప్రణాళికలు వేస్తున్నట్లు కంపెనీ చీఫ్ రామ్‌దేవ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రుచీ సోయాను 2019 సెప్టెంబర్‌లో దివాలా పరిష్కారంలో భాగంగా పతంజలి గ్రూప్ టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే. ఆయిల్ పామ్ ప్లాంటేషన్స్‌ను సైతం భారీ స్థాయిలో పెంచేందుకు వీలుగా ఐదేళ్ల విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేసినట్లు రామ్‌దేవ్ వెల్లడించారు. తద్వారా రానున్న ఐదేళ్లలో ఎఫ్ఎంసీజీ, ఫుడ్ బిజినెస్‌లో భారీ కంపెనీగా ఆవిర్భవించాలని లక్షిస్తున్నట్లు తెలియజేశారు. గతేడాది ఓకే మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో కంపెనీ రూ. 886 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2021–22)లో రూ. 806 కోట్ల నికర లాభం నమోదైంది. ఇబిటా రూ. 1,577 కోట్లుకాగా.. మొత్తం ఆదాయం రూ. 24,284 కోట్ల నుంచి రూ. 31,821 కోట్లకు జంప్ చేసింది. దీనిలో వంట నూనెల విభాగం నుంచి రూ. 25,253 కోట్లు లభించింది. వీటి ద్వారా 2021–22లో రూ. 22,469 కోట్ల ఆదాయం మాత్రమే అందుకుంది. (ఇదీ చదవండి: అదిరిపోయే డిస్కౌంట్స్ ప్రకటించిన టాటా మోటార్స్.. ఏ కారుపై ఎంతంటే?) ఇక ఫుడ్, ఎఫ్ఎంసీజీ బిజినెస్ టర్నోవర్ దాదాపు నాలుగు రెట్లు ఎగసి రూ. 6,218 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది కేవలం ఈ విభాగపు ఆదాయం రూ. 1,683 కోట్లకే పరిమితమైంది. కాగా.. తాజా లక్ష్యాలను చేరుకునేందుకు పలు కొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టనున్నట్లు రామ్‌దేవ్ తెలియజేశారు. గేదె నెయ్యి, ప్రీమియం విభాగంలో బిస్కట్లు, కుకీస్, డ్రై ఫ్య్రూట్స్, మసాలా దినుసులతోపాటు పౌష్టికాహార ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు వివరించారు. కంపెనీ ఇప్పటికే పలు రాష్ట్రాలలో 39,000 మందికిపైగా రైతుల ద్వారా 63,816 హెక్టార్లకుపైగా ఆయిల్ పామ్ తోటలను సాగు చేస్తున్నట్లు తెలియజేశారు. కంపెనీ రుచీ గోల్డ్, మహాకోష్, సన్‌రిచ్, న్యూట్రెలా, రుచీ సన్‌లైట్ తదితర బ్రాండ్లను కలిగి ఉన్న విషయం విదితమే. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు 81 శాతం వాటా ఉంది. ఎన్ఎస్ఈలో పతంజలి ఫుడ్స్ షేరు 1 శాతం క్షీణించి రూ. 1,014 వద్ద ముగిసింది. -
లక్ష కోట్ల దిశగా పతంజలి గ్రూప్..
న్యూఢిల్లీ: వచ్చే 5–7 ఏళ్లలో సంస్థ ఆదాయం రెండున్నర రెట్లు ఎగసి రూ.1 లక్ష కోట్లకు చేరుతుందని పతంజలి గ్రూప్ వెల్లడించింది. ప్రస్తుతం ఆదాయం రూ.40,000 కోట్లు ఉందని గ్రూప్ ఫౌండర్, యోగా గురు బాబా రామ్‌దేవ్ తెలిపారు. అయిదేళ్లలో తమ సంస్థ ప్రత్యక్షంగా అయిదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. ‘గ్రూప్ అనుబంధ కంపెనీ అయిన పతంజలి ఫుడ్స్ (గతంలో రుచి సోయా) ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.50,000 కోట్లను తాకింది. మరో నాలుగు కంపెనీలను 2027 నాటికి లిస్ట్ చేయనున్నాం. ఐపీవోకు రానున్న కంపెనీల్లో పతంజలి ఆయుర్వేద్, పతంజలి మెడిసిన్, పతంజలి లైఫ్‌స్టైల్, పతంజలి వెల్నెస్ ఉన్నాయి. ఈ నాలుగింటిలో పతంజలి ఆయుర్వేద్ తొలుత ఐపీవోకు రానుంది. ఈ కంపెనీకి మార్కెట్లో సుస్థిర స్థానం ఉంది’ అని వివరించారు. నెయ్యిలో కల్తీ అబద్ధం పతంజలి నెయ్యిలో కల్తీ జరుగుతోందడం సరికాదన్నారు. ల్యాబ్‌లో కనుగొన్న విషయాలు సరైనవి కావని, ఇందులో కొంతమంది అధికారుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ప్రభుత్వాల ల్యాబొరేటరీ ప్రమాణాలు పెరగాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ల్యాబొరేటరీలలో పరీక్షా సౌకర్యాలను మెరుగుపరచాలని, బాధ్యతా రహిత అధికారులను శిక్షించాలని సూచించారు. ‘అన్ని ఉత్పత్తులు బయటకు వచ్చే ముందు అనేకసార్లు పరీక్షిస్తాం. పరిశోధన, అభివృద్ధికి రూ.1,000 కోట్ల దాకా ఖర్చు చేశాం’ అని వెల్లడించారు. ఇమేజ్ కాపాడుకుంటాం.. ‘కుట్ర పన్నిన వ్యక్తులను ఈసారి వదిలిపెట్టబోము. బ్రాండ్ ప్రతిష్టను కాపాడేందుకు చట్ట ప్రకారం కఠిన చర్యలను గ్రూప్ తీసుకుంటుంది. 100 మందికిపైగా లీగల్ నోటీసులు పంపించాం. ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి’ అని స్పష్టం చేశారు. యోగా పరువు తీయడంలో మతపరమైన తీవ్రవాదం, ఆయుర్వేదం విషయంలో మెడికల్ టెర్రరిజం హస్తం ఉందని గ్రూప్ ప్రకటన ఒకటి తెలిపింది. లంపీకి పరిష్కారం దిశగా.. పశువులకు సోకుతున్న లంపీ చర్మ వ్యాధికి పరిష్కారం కనుగునే దిశగా పతంజలి గ్రూప్ కసరత్తు చేస్తోందని రామ్‌దేవ్ వెల్లడించారు. ఈ వ్యాధి బారినపడి ఇప్పటికే దేశంలో ఒక లక్ష ఆవులు మృత్యువాత పడ్డాయని పేర్కొన్నారు. హరిద్వార్‌లోని తన ఇంట్లో చాలా ఆవులకు కూడా ఈ వ్యాధి సోకిందని, అయితే ఒక్కటి కూడా చనిపోలేదని చెప్పారు. త్వరలో నాలుగు ఐపీవోలు ఐపీవో కోణం నుండి చూస్తే పతంజలి ఆయుర్వేద్ ఉత్తమమైనదని రామ్‌దేవ్ తెలిపారు. ‘ఉత్పత్తి శ్రేణి, విస్తృతి, కస్టమర్ల సంఖ్య, లాభదాయకత, భవిష్యత్తు అంచనా పరంగా ఇది అత్యంత అనుకూలమైనది. దివ్య ఫార్మసీని ప్రమోట్ చేస్తున్న పతంజలి మెడిసిన్ రెండవ ఐపీవోగా అడుగుపెట్టనుంది. ఆ తర్వాత ఔట్ పేషెంట్స్ డిపార్ట్మెంట్స్, హాస్పిటల్స్‌ను నిర్వహిస్తున్న పతంజలి వెల్నెస్ ఐపీవోకు రానుంది. పతంజలి వెల్నెస్ కింద 25,000 పడకల సామర్థ్యానికి చేరుకోవాలన్నది లక్ష్యం. ప్రస్తుతం 50 కేంద్రాలున్నాయి. వీటిని రెండింతలు చేస్తాం. ఫ్రాంచైజీ విధానంలోనూ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. దుస్తులు, రవాణా, పశువుల దాణా, ఇతర అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో పతంజలి లైఫ్‌స్టైల్ కార్యకలాపాలు సాగిస్తోంది’ అని చెప్పారు. -
జాబ్ మానేశాడు.. కోటీశ్వరుడయ్యాడు!
జైసల్మేర్: ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటే కావాలంటూ లక్షల మంది పరుగులు పెడతారు. కానీ, ఓ ప్రభుత్వ ఉద్యోగి మాత్రం జాబ్ వదిలేసి వ్యవసాయం చేస్తున్నాడు. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. ఉద్యోగంలో తనకు సంతృప్తి లేదని భావించిన రాజస్థాన్ కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్రస్తుతం ఏడాదికి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు. ఆ వివరాలిలా ఉన్నాయి... హరీష్ ధండేవ్ రాజస్థాన్ లో ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన తండ్రి వ్యవసాయదారుడు. రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు కావడంతో ఉద్యోగంతో సంతృప్తి చెందక జాబ్ మానేశాడు. ఓసారి ఢిల్లీకి వెళ్లిన అతడు అక్కడ ఎన్నో విషయాలు చూశానని, అదే తన జీవితంలో టర్నింగ్ పాయింట్ అంటున్నాడు. ప్రస్తుతం అతడు తన 120 ఎకరాల పొలంలో అలోవెరా పండిస్తున్నాడు. అలాగని కాస్తా కూస్తో సంపాదిస్తున్నాడనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. ఎందుకుంటే హరీష్ వార్షిక ఆదాయం రూ.1.5 కోట్ల నుంచి 2 కోట్లు. నాటురెలో అగ్రో అనే కంపెనీని స్థాపించాడు. అలోవేరా పండించి పతంజలి ఫుడ్ ప్రొడక్ట్ లిమిటెడ్ సంస్థకు సరఫరా చేస్తున్నాడు. ఆ కంపెనీ వారు అలోవేరా జ్యూస్ తయారీ కోసం హరీష్ నుంచి సరుకు కొనుగోలు చేస్తుంది. తన పంటకుగానూ కోట్ల రూపాయలు ఆర్జించడంతో పాటు మరెందరికో ఉపాధి కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. థార్ ఎడారి ప్రాంతంలో వీటి ఉత్పత్తి అధికంగా ఉంటుంది. తన స్వస్థలం, వ్యవసాయక్షేత్రం ఆ సమీప ప్రాంతాల్లోనే ఉండటం కూడా హరీష్ కు కలిసొచ్చింది. అలోవెరాకు దేశంలోనే కాదు అంతర్జాతీయ మార్కెట్లోనూ భారీగా డిమాండ్ ఉంటుంది.