న్యూఢిల్లీ: వచ్చే 5–7 ఏళ్లలో సంస్థ ఆదాయం రెండున్నర రెట్లు ఎగసి రూ.1 లక్ష కోట్లకు చేరుతుందని పతంజలి గ్రూప్ వెల్లడించింది. ప్రస్తుతం ఆదాయం రూ.40,000 కోట్లు ఉందని గ్రూప్ ఫౌండర్, యోగా గురు బాబా రామ్‌దేవ్ తెలిపారు. అయిదేళ్లలో తమ సంస్థ ప్రత్యక్షంగా అయిదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. ‘గ్రూప్ అనుబంధ కంపెనీ అయిన పతంజలి ఫుడ్స్ (గతంలో రుచి సోయా) ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది.
ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.50,000 కోట్లను తాకింది. మరో నాలుగు కంపెనీలను 2027 నాటికి లిస్ట్ చేయనున్నాం. ఐపీవోకు రానున్న కంపెనీల్లో పతంజలి ఆయుర్వేద్, పతంజలి మెడిసిన్, పతంజలి లైఫ్‌స్టైల్, పతంజలి వెల్‌నెస్ ఉన్నాయి. ఈ నాలుగింటిలో పతంజలి ఆయుర్వేద్ తొలుత ఐపీవోకు రానుంది. ఈ కంపెనీకి మార్కెట్లో సుస్థిర స్థానం ఉంది’ అని వివరించారు.
నెయ్యిలో కల్తీ అబద్ధం
పతంజలి నెయ్యిలో కల్తీ జరుగుతోందడం సరికాదన్నారు. ల్యాబ్‌లో కనుగొన్న విషయాలు సరైనవి కావని, ఇందులో కొంతమంది అధికారుల ప్రమేయం ఉందని ఆరోపించారు.
ప్రభుత్వాల ల్యాబొరేటరీ ప్రమాణాలు పెరగాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ల్యాబొరేటరీలలో పరీక్షా సౌకర్యాలను మెరుగుపరచాలని, బాధ్యతా రహిత అధికారులను శిక్షించాలని సూచించారు. ‘అన్ని ఉత్పత్తులు బయటకు వచ్చే
ముందు అనేకసార్లు పరీక్షిస్తాం. పరిశోధన, అభివృద్ధికి రూ.1,000 కోట్ల దాకా ఖర్చు చేశాం’ అని వెల్లడించారు.
ఇమేజ్ కాపాడుకుంటాం..
‘కుట్ర పన్నిన వ్యక్తులను ఈసారి వదిలిపెట్టబోము. బ్రాండ్ ప్రతిష్టను కాపాడేందుకు చట్ట ప్రకారం కఠిన చర్యలను గ్రూప్ తీసుకుంటుంది. 100 మందికిపైగా లీగల్ నోటీసులు పంపించాం. ఎఫ్‌ఐఆర్లు నమోదయ్యాయి’ అని స్పష్టం చేశారు. యోగా పరువు తీయడంలో మతపరమైన తీవ్రవాదం, ఆయుర్వేదం విషయంలో మెడికల్ టెర్రరిజం హస్తం ఉందని గ్రూప్ ప్రకటన ఒకటి తెలిపింది.
లంపీకి పరిష్కారం దిశగా..
పశువులకు సోకుతున్న లంపీ చర్మ వ్యాధికి పరిష్కారం కనుగునే దిశగా పతంజలి గ్రూప్ కసరత్తు చేస్తోందని రామ్‌దేవ్ వెల్లడించారు. ఈ వ్యాధి బారినపడి ఇప్పటికే దేశంలో ఒక లక్ష ఆవులు మృత్యువాత పడ్డాయని పేర్కొన్నారు. హరిద్వార్‌లోని తన ఇంట్లో చాలా ఆవులకు కూడా ఈ వ్యాధి సోకిందని, అయితే ఒక్కటి కూడా చనిపోలేదని చెప్పారు.
త్వరలో నాలుగు ఐపీవోలు
ఐపీవో కోణం నుండి చూస్తే పతంజలి ఆయుర్వేద్ ఉత్తమమైనదని రామ్‌దేవ్ తెలిపారు. ‘ఉత్పత్తి శ్రేణి, విస్తృతి, కస్టమర్ల సంఖ్య, లాభదాయకత, భవిష్యత్తు అంచనా పరంగా ఇది అత్యంత అనుకూలమైనది. దివ్య ఫార్మసీని ప్రమోట్ చేస్తున్న పతంజలి మెడిసిన్ రెండవ ఐపీవోగా అడుగుపెట్టనుంది. ఆ తర్వాత ఔట్ పేషెంట్స్ డిపార్ట్‌మెంట్స్, హాస్పిటల్స్‌ను నిర్వహిస్తున్న పతంజలి వెల్‌నెస్ ఐపీవోకు రానుంది. పతంజలి వెల్‌నెస్ కింద 25,000 పడకల సామర్థ్యానికి చేరుకోవాలన్నది లక్ష్యం. ప్రస్తుతం 50 కేంద్రాలున్నాయి. వీటిని రెండింతలు చేస్తాం. ఫ్రాంచైజీ విధానంలోనూ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. దుస్తులు, రవాణా, పశువుల దాణా, ఇతర అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో పతంజలి లైఫ్‌స్టైల్ కార్యకలాపాలు సాగిస్తోంది’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment