సాక్షి, న్యూఢిల్లీ : దేశీ ఉత్పత్తులతో పతంజలి మార్కెట్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తమ ఫాస్ట్-మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్(ఎఫ్‌ఎంసీజీ) కంపెనీ పతంజలి 2018-19 నాటికి యునీలివర్‌ను, మిగతా వాటిని అధిగమిస్తుందని యోగా గురు బాబా రాందేవ్ అన్నారు. 2020-21 నాటికి ప్రపంచంలో అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ బ్రాండుగా అవతరిస్తుందని తెలిపారు. వచ్చే రెండేళ్లలో పతంజలి రూ.1 లక్షల కోట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రస్తుతం హరిద్వార్‌లో రూ.15వేల కోట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని, తేజ్‌పూర్‌లో రూ.25వేల కోట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పతంజలి కలిగి ఉందన్నారు. నోయిడా, నాగ్‌పూర్, ఇండోర్, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా పతంజలి ఉత్పత్తి సెంటర్లు రాబోతున్నాయని తెలిపారు.
ఆయిల్, ఉప్పు వంటి వాటిని తయారుచేయడానికి 50 చిన్న యూనిట్లను పతంజలి కలిగి ఉందని బాబా రాందేవ్ ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకవేళ తాము రూ.1 లక్షల కోట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకుంటే, మొత్తం మార్కెట్ సైజు రూ.10 లక్షల కోట్లలో 10 శాతమని తెలిపారు. 2018-19 కల్లా యునిలీవర్, ఇతర టాప్ మోస్ట్ బ్రాండులను పతంజలి అధిగమిస్తుందని, 2020-21 నాటికి ప్రపంచంలో అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ బ్రాండుగా అవతరించాలని చూస్తున్నట్టు బాబా రాందేవ్ చెప్పారు. బాబా రాందేవ్, ఆయన అసోసియేట్ ఆచార్య బాలక్రిష్ణ కలిసి తక్కువ సమయంలోనే అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ గ్రూప్ పతంజలిని ఓ స్థాయిలో నిల్చోబెట్టారు. త్వరలోనే తమ గ్రూప్ జీన్స్, ట్రౌజర్స్, కుర్తాలు, షర్ట్‌లు, స్పోర్ట్స్‌వేర్, యోగా వేర్‌లను విక్రయించబోతున్నట్టు తెలిపారు.