new targets
-
భారీ లక్ష్యాల దిశగా పతంజలి గ్రూప్ - ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల ఆదాయం
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం పతంజలి గ్రూప్ భారీ లక్ష్యాలపై దృష్టి పెట్టింది. రానున్న ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల ఆదాయం సాధించాలని చూస్తోంది. విభిన్న ఉత్పత్తులతో అన్ని రకాల వినియోగదారులకూ చేరువకావడం ద్వారా రూ. లక్ష కోట్ల టర్నోవర్ మైలురాయిని చేరుకోవాలని భావిస్తున్నట్లు పతంజలి గ్రూప్ చీఫ్ రామ్‌దేవ్ తాజాగా పేర్కొన్నారు. ఈ బాటలో లిస్టెడ్ కంపెనీ పతంజలి ఫుడ్స్(రుచీ సోయా ఇండస్ట్రీస్) రూ. 45,000– 50,000 కోట్ల టర్నోవర్‌ను అందుకునేందుకు ప్రణాళికలు వేసినట్లు వెల్లడించారు. వెరసి గ్రూప్ లక్ష్య సాధనలో పతంజలి ఫుడ్స్ కీలకపాత్ర పోషించనున్నట్లు తెలియజేశారు. పోర్ట్‌ఫోలియోలో ప్రీమియం ఉత్పత్తులను జతచేసే వ్యూహంలో భాగంగా పౌష్టికాహారం(న్యూట్రాస్యూటికల్స్), హెల్త్ బిస్కట్స్, చిరు ధాన్య ఆధార ఉత్పత్తులు, డ్రై ఫ్రూట్స్ తదితరాలను ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా దృష్టి దేశీ మార్కెట్‌పైనే విశ్వాసముంచిన కంపెనీ ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీ (విదేశీ దిగ్గజాలు)తో పోటీ పడనున్నట్లు రామ్‌దేవ్ తెలియజేశారు. ప్రస్తుతం యూనిలీవర్ మినహా.. మిగిలిన అన్ని ఎంఎన్‌సీలనూ అధిగమించినట్లు పేర్కొన్నారు. రెండు దశాబ్దాల క్రితం పతంజలి గ్రూప్ రూ. 10,000 కోట్ల టర్నోవర్‌ను అందుకుంటుందని చెప్పినప్పుడు తాము అతిగా అంచనా వేస్తున్నట్లు పలువురు భావించారని ప్రస్తావించారు. ప్రస్తుతం పతంజలి గ్రూప్ టర్నోవర్ రూ. 45,000 కోట్లను తాకినందుకు గర్వంగా ఉన్నట్లు చెప్పారు. అందుబాటు ధరల్లో... పతంజలి ఆయుర్వేద్ ద్వారా అందుబాటు ధరల్లో విభిన్న ప్రొడక్టులను అందిస్తూ వచ్చినట్లు రామ్‌దేవ్ పేర్కొన్నారు. ఇకపై ఎగువ మధ్యతరగతిని లక్ష్యంగా పెట్టుకుని పతంజలి ఫుడ్స్ ద్వారా ప్రీమియం ఉత్పత్తులకు తెరతీస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచస్థాయిలోనూ పతంజలి గ్రూప్ ఎఫ్ఎంసీజీ విభాగంలో విస్తరిస్తున్నట్లు చెప్పారు. 200 దేశాలలో 200 కోట్లమందికి చేరువైనట్లు తెలియజేశారు. దేశీయంగా 70 కోట్లమందిని చేరుకున్న కంపెనీ 100 కోట్లపై దృష్టిపెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం కంపెనీ టర్నోవర్ రూ. 31,000 కోట్లకు చేరినట్లు ఈ సందర్భంగా పతంజలి ఫుడ్స్ సీఈవో సంజీవ్ ఆస్తానా వెల్లడించారు. ఐదేళ్లలో రూ. 50,000 కోట్ల ఆదాయాన్ని అందుకోగలమని అంచనా వేశారు. ప్రీమియం ప్రొడక్టుల నుంచి 10% టర్నోవర్‌ను సాధించనున్నట్లు తెలియజేశారు. ఎన్ఎస్ఈలో పతంజలి ఫుడ్స్ షేరు దాదాపు 2 శాతం బలపడి రూ. 1,140 వద్ద ముగిసింది. -
బిజినెస్ కరోనా..
సాక్షి, హైదరాబాద్: దేశమంతా లాక్‌డౌన్‌తో షట్‌డౌన్ అయింది. ఎక్కడివారక్కడే ఇళ్లకు పరిమితమయ్యారు. కొందరు ఉద్యోగులు ఇళ్లనుంచే పనిచేస్తున్నారు. ఇంకొందరు విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు.. ఇలా అత్యవసర సేవల కేటగిరీల్లోని వారు విధిగా విధులకు హాజరవుతున్నారు. బ్యాంకులూ అందులో భాగమే. అందుకే బ్యాంకులు తెరిచే ఉంటున్నాయి. కరోనా విస్తరిస్తున్న వేళ భయంగానే ఆఫీసులకు వెళ్లి ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. కానీ.. ‘కరోనా’పట్టింపు లేకుండా, అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలను పట్టించు కోకుండా కొన్ని ప్రైవేటు బ్యాంకులు ఉద్యోగులకు ‘టార్గెట్’విధిస్తూ బిజినెస్ పెంచాలని ఒత్తిడి తెస్తు న్నాయి. సాధారణంగా బ్యాంకులకు ఆర్థిక సంవ త్సరం ప్రారంభంతోనే పని ఒత్తిడి మొదలవు తుంది. క్రితం ఏడాది ఎంత బిజినెస్ జరిగిందో అంతకు ఒకటిన్నర రెట్లు కొత్త సంవత్సరంలో జరగా లని లక్ష్యం నిర్ధారించి యాజమాన్యాలు పరుగు పెట్టిస్తాయి. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలై మూడు రోజులైంది. దీంతో నాలుగైదు రోజులుగా నిత్యం కాన్ఫరెన్స్, వీడియోకాల్స్ ద్వారా సమావేశాలు ఏర్పాటుచేస్తూ కొత్త లక్ష్యాలను నిర్దేశిస్తున్నాయి. వాటిని సాధించాలని ఒత్తిడి తెస్తున్నాయి. కరోనా వైరస్ విస్తరిస్తూ ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ టార్గెట్లపై ఉద్యోగులు విస్తుపోతున్నారు. రోజూ రూ.3 కోట్ల వ్యాపారం ప్రస్తుతం కొన్ని ప్రధాన ప్రైవేటు బ్యాంకుల మధ్య తీవ్ర పోటీ ఉంది. వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో శాఖలు తెరుస్తున్నాయి. ఓ ప్రాంతంలో ఓ ప్రైవేటు బ్యాంకు శాఖను ప్రారంభించగానే, అదే ప్రాంతంలో మరో పోటీ బ్యాంకు బ్రాంచీ ప్రారంభిస్తోంది. ఇలా ప్రధానంగా మూడు ప్రైవేటు బ్యాంకులు పోటీపడుతున్నాయి. తాజాగా ఇవి నాలుగు రోజులుగా కాన్ఫరెన్స్, వీడియో కాల్స్ రూపంలో సమావేశాలు ఏర్పాటుచేస్తూ ఉద్యోగులకు బిజినెస్ అప్పగిస్తున్నారు. కొత్తగా ప్రారంభమైన బ్రాంచీల్లో నెలకు కనీసం రూ.3 కోట్ల వ్యాపారం చేయాలని టార్గెట్ విధిస్తున్నారు. అప్పటికే ప్రారంభమై కనీసం ఏడాదైన బ్రాంచీలకు గతేడాది చేసిన బిజినెస్ మొత్తంలో అదనంగా 50 శాతం, పెద్ద బ్రాంచీలైతే ఒకటిన్నర రెట్లు వ్యాపారం చేయాలని లక్ష్యం విధించేశారు. కాస్త అటూఇటూగా ఈ పోటీ బ్యాంకులు కొత్త టార్గెట్లతో ఉద్యోగులను పరుగులు పెట్టిస్తున్నాయి. కొత్త ఖాతాలు, బీమా పాలసీలు, ఫారెక్స్ కార్డులు.. బ్యాంకు ఉద్యోగులకు తొలి టార్గెట్ కొత్త ఖాతాలే. సేవింగ్స్, కరెంటు ఖాతాలతోపాటు, ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్లు పెంచటం తదుపరి టార్గెట్. ప్రస్తుతం అన్ని వాణిజ్య బ్యాంకులు బీమా కంపెనీలతో టైఅప్ కుదుర్చుకున్నాయి. కొన్నింటికి సొంత బీమా సంస్థలున్నాయి. ఖాతాలు తెరిచే వారితో ఏదోఒక బీమా పాలసీ కూడా తీసుకునేలా చేస్తున్నాయి. జీవిత, వాహన, ఆరోగ్య బీమాలు తీసుకోవాలని ఖాతాదారులను ఒత్తిడి చేస్తుంటారు. వీటికి తోడు గృహ, వ్యాపార, విద్యారుణాలు.. ఇలా ఏదోఒక లోన్ తీసుకునేలా ఒప్పిస్తుంటారు. ఈ టార్గెట్లను సులభంగా సాధించేందుకు బ్యాంకులు తెలివిగా రుణాలతో బీమా పాలసీలను అనుసంధానిస్తున్నాయి. వీటన్నింటికి సంబంధించి విడివిడిగా టార్గెట్లను ఫిక్స్ చేసి బ్రాంచీల ముందుంచారు. కరోనా భయం, లాక్డౌన్ నిబంధనలతో అసలు బ్యాంకులకు ఖాతాదారులు రావటమే తగ్గింది. ఈ తరుణంలో టార్గెట్లను ఎలా సాధించాలని ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. పదోన్నతులతో ముడిపెడుతూ.. బ్యాంకుల్లో పదోన్నతి రావాలన్నా, జీతం పెరగాలన్నా వ్యక్తిగత టార్గెట్లను సాధించడంపైనే ఆధారపడి ఉంటుంది. టార్గెట్లపై ఏమరుపాటుగా ఉంటే దాని ఫలితం ప్రమోషన్లు, జీతాల పెరుగుదలపై ఉంటుందని పరోక్ష హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దీంతో రెండ్రోజులుగా బ్యాంకు ఉద్యోగులు ఖాతాదారులకు సంబంధించిన బ్యాంకు అంతర్గత పనులు చూస్తూనే బిజినెస్ పెంచుకునే కసరత్తు ప్రారంభించారు. ఎక్కువ మంది ఫోన్లలో ఖాతాదారులతో మాట్లాడుతూ ఏదో ఓ పాలసీ తీసుకునేలా, ఖాతాలో డిపాజిట్లను పెంచేలా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లాక్డౌన్ వల్ల వేతనాల్లో కోతపడే పరిస్థితి ఉందని, ఇప్పుడు ఇటువంటివి తలకెత్తుకోలేమని ఖాతాదారులు చెబుతుండటంతో బ్యాంకు ఉద్యోగులకు దిక్కుతోచడం లేదు. ‘పీఎం కేర్స్’భారం కవరింగ్ కోసం.. చాలా బ్యాంకులు ప్రస్తుతం పీఎం కేర్స్ ఫండ్ కు భారీగా విరాళాలిస్తున్నాయి. ఇది అభినందించాల్సిన విషయమే. మరోపక్క వాటికిది అదనపు ఖర్చు కూడా. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం బిజినెస్‌ను మరింత పెంచుకోవటం ద్వారా ఈ భారాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఫలితంగా ఈ భారం కూడా వినియోగదారులపై పడనుంది. టార్గెట్లు.. ఆప్షన్లు ►బ్యాంకు సిబ్బందిలో ప్రతి ఒక్కరు రోజూ కనీసం ఆరుకు తగ్గకుండా లావాదేవీలు చేయాలని ఓ ప్రధాన వాణిజ్యబ్యాంకు టార్గెట్ పెట్టింది. కొత్త ఖాతాలు, కొత్త డిపాజిట్లు, డిపాజిట్ల మొత్తం పెంపు, బీమా పాలసీలు.. వీటిలో ఏవైనా ఆరు చేయాలి. ►రుణాలకు సంబంధించి ప్రత్యేకంగా పాయింట్స్ విధానం ఉంటుంది. పంట, గృహ, విద్య, విదేశీ రుణాలు... ఇలా ఆయా రుణాలకు సంబంధించి నెలకు 600 పాయింట్లకు తగ్గకుండా సాధించాలని మరో బ్యాంకులో లక్ష్యం విధించారు. ►ఎన్ఆర్ఐలు పంపే డబ్బులను ఒడిసిపట్టుకునే (ఫారిన్ రెమిటెన్స్) విషయంలోనూ టార్గెట్లున్నాయి. వీరు ఇండియాలో ఉండే తమవారికి పంపే డబ్బును తమ బ్యాంకులో ఖాతా తెరిచి జమ చేసేలా చేయటం అన్నమాట. -
మిషన్ 2018 - 8 లక్ష్యాలు
సాక్షి, హైదరాబాద్ : పూర్తి భద్రమైన రాష్ట్రం కోసం పోలీసు శాఖ ‘నూతన’ఒరవడి వైపు అడుగులు వేస్తోంది. నూతన సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా విప్లవాత్మకమైన మార్పులు, టెక్నాలజీ వినియోగాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డి ‘మిషన్–2018’పేరిట ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సంవత్సరాంత మీడియా కాన్ఫరెన్స్‌లో దీనిని విడుదల చేశారు. ఎనిమిది లక్ష్యాలతో ఈ కార్యాచరణను అమలు చేయనున్నట్లు డీజీపీ తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు, శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపడతామన్నారు. హైదరాబాద్ కాప్ యాప్‌ను మరింత విస్తృతపరిచి రాష్ట్ర పోలీసులందరికీ అందుబాటులో ఉండేలా ‘టీఎస్ కాప్’యాప్‌ను తీసుకువస్తున్నామని చెప్పారు. పోలీసు సిబ్బందికి నేర నియంత్రణ, దర్యాప్తులో మెళకువల కోసం ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్, మహిళల భద్రత, ఎమర్జెన్సీ రెస్పాన్స్, సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సర్వీస్ తదితర వ్యవస్థలన్నింటినీ త్వరలోనే జిల్లా పోలీసు విభాగాల్లో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. సమాజ భద్రత కోసం హైదరాబాద్‌లో అమలుచేస్తున్న ‘నేను సైతం’ కార్యక్రమాన్ని జిల్లాల్లోనూ అమలుచేస్తామని తెలిపారు. డీజీపీ వెల్లడించిన 8 లక్ష్యాలివీ సేవల్లో పురోగతి ప్రజలు సంతృప్తి చెందేలా పోలీసు సేవలను అందించాలని నిర్ణయించారు. ఏదైనా ఘటన జరిగిన ప్రాంతానికి అతి త్వరగా చేరుకునేందుకు కార్యాచరణ అమలు చేస్తారు. పోలీసులు ప్రతి ఒక్కరికీ దగ్గరయ్యేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతున్నామని డీజీపీ వెల్లడించారు. ఆన్లైన్ సర్వీస్, ఫీడ్ బ్యాక్, కొత్త యాప్స్, పబ్లిక్ అలర్ట్ వంటివి దీని కిందకు వస్తాయని తెలిపారు. సమర్థవంతంగా నేరాల నియంత్రణ సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న నేరాలు, ముఠాలు, గ్యాంగులను నియంత్రించడంతోపాటు కొత్తగా పుట్టుకువచ్చే నేరాలను మొగ్గలోనే తుంచేందుకు ‘కంబాట్ ఎగ్జిస్టింగ్ అండ్ ఎమర్జింగ్ క్రైమ్’పేరుతో కార్యాచరణ అమలు చేస్తారు. నేరాల దర్యాప్తులో అధికారులు, సిబ్బందికి మెళకువలు, ప్రొఫెషనలిజం పెంపొందించడం, జాతీయ, అంతర్గత భద్రత వ్యవహారాలు, బెదిరింపులకు తగ్గట్టుగా చర్యలు చేపట్టడం దీనిలో కీలకంగా ఉంటాయని డీజీపీ తెలిపారు. పునర్నిర్మాణం–పటిష్టత ప్రస్తుతం పోలీసు శాఖలో ఉన్న వివిధ విభాగాలను పునర్నిర్మించి మరింత పటిష్టంగా పనిచేసేలా కార్యాచరణ (ఆర్గనైజేషన్ బిల్డింగ్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్) చేపడతారు. ప్రత్యేక విభాగాల పటిష్టానికి కృషి, క్రాక్‌జాక్ సెంటర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ, స్టేషన్ హౌజ్ మేనేజ్మెంట్, జెండర్ రీసోర్స్ సెంటర్, ఆన్లైన్ ట్రైనింగ్ మోడల్స్, సిబ్బంది, అధికారుల వైఖరిలో మార్పు తదితర అంశాలు ఈ ప్రణాళిక కిందకు వస్తాయి. వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ పోలీసు సిబ్బందిలో కెరీర్ మేనేజ్మెంట్, శిక్షణకు సంబంధించి ప్రత్యేక అంశాలు దీని కిందకు వస్తాయి. ఉద్యోగి చేసే పనులు, వాటి ఫలితాలు, తగిన ప్రోత్సాహకాలు, సంక్షేమం, ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్, ఎఫ్ఎస్ఎల్, ఫింగర్ ప్రింట్స్ బ్యూరో తదితరాలన్నింటిలో ఈ కార్యచరణ కీలకంగా మారనుంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం టెక్నాలజీని వినియోగించుకుని నిఘా (స్మార్ట్ సర్వైలెన్స్), కమాండ్ కంట్రోల్ సిస్టమ్, సైబర్ టెక్నో కమాండ్ సెంటర్, స్మార్ట్ పోలీసింగ్ అంశాలను అందుబాటులోకి తెస్తారు. తద్వారా సైబర్ నేరాల నియంత్రణ, 360 డిగ్రీ ప్రొఫైల్, జియోట్యాగ్ మ్యాపింగ్, ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహణ, ఇంట్రిగేటెడ్ డేటాబేస్ తదితరాలన్నీ ఎప్పటికప్పుడు, ఎలా పనిచేయాలన్నదాని కోసం ఈ ప్రణాళిక రూపొందించినట్టు డీజీపీ తెలిపారు. కమ్యూనిటీ భాగస్వామ్యం, నిపుణుల పర్యవేక్షణ ప్రజల భాగస్వామ్యం, నిపుణులు సలహాలు, సహాయంతో నేరాల నియంత్రణకు కృషిచేయడం ఈ కార్యచరణలోకి వస్తాయి. ఇందులో సిటిజన్ ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ, నవ సమాజ స్థాపనకు కావాల్సిన అంశాల స్వీకరణ, స్టూడెంట్ పోలీస్ కేడర్ కార్యక్రమాలు, అకడమిక్ ఇన్పుట్స్ ఫార్ములా తదితరాలు ఉంటాయి. రోడ్డు భద్రత, ట్రాఫిక్ మేనేజ్మెంట్ రోడ్డు ప్రమాదాల నియంత్రణ, సమీకృత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ, క్యాష్‌లెస్ చలాన్లు, రోడ్ సేఫ్టీ పోలీస్స్టేషన్లు, గోల్డెన్ అవర్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్, ప్రత్యేక రోడ్‌సేఫ్టీ విభాగం ఏర్పాటు ఈ కార్యాచరణలోకి వస్తాయి. ఇందులో ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటు, అభివృద్ధి, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక యాప్స్ రూపకల్పన, ఇంటిగ్రేటెడ్ డేటా మెయింటెనెన్స్, ఆటోమేటెడ్ ఎన్ఫోర్స్మెంట్, లైసెన్సుల సస్పెన్షన్ తదితర అంశాలు ఉంటాయి. భద్రమైన ప్రాంతాలుగా మార్చడం (సేఫర్ అవర్ సిటీస్ సేఫర్) సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ, అర్బన్ ప్రాంతాల భద్రతకు పటిష్ట చర్యలు, డిజిటల్ సెక్యూరిటీ సర్వీస్ సెంటర్ ఏర్పాటు, నేర నియంత్రణ కోసం వ్యూహాల రచన, ఉగ్రవాద నియంత్రణకు స్పెషల్ స్క్వాడ్స్, భారీ వాణిజ్య ప్రాంతాలు, భవనాల భద్రతకు స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్ తదితరాలను ఈ ప్రణాళికలో భాగంగా అమలు చేస్తామని డీజీపీ వెల్లడించారు. అంతా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే.. అన్ని జిల్లాల్లోని హెడ్క్వార్టర్లు, ప్రధాన పట్టణాలు, ఇతర ముఖ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్న సీసీ కెమెరాలను అక్కడి కమాండ్ సెంటర్లకు అనుసంధానం చేస్తారని డీజీపీ వెల్లడించారు. ఆ కమాండ్ సెంటర్లను హైదరాబాద్‌లోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానిస్తామని చెప్పారు. జీపీఎస్ ఆధారిత గస్తీ వాహనాలు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. మరిన్ని వాహనాలు కొనుగోలు చేసి.. జిల్లా పోలీసు యంత్రాంగాలకు అందిస్తామని తెలిపారు. ప్రతి జిల్లాలో సోషల్ మీడియా ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని.. తద్వారా పుకార్ల నియంత్రణ, వాటి ద్వారా జరిగే నష్టాలను నిరోధించవచ్చని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు క్లూస్‌టీంలు, ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్లను త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. -
నయా లక్ష్యం..
కొత్త సంవత్సరం వస్తోందంటే చాలు.. చాలామందిలో సరికొత్త లక్ష్యాలు మదిలో మెదులుతాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సరికొత్త తీర్మానాలు చేసుకోవడం అందరికీ అనుభవమే. చెడు అలవాట్లు, వ్యసనాలు వదిలేస్తామని.. ఇంటికి, ఒంటికి మేలు చేసే వాటిని అలవర్చుకుంటామని ప్రతినబూనడం పరిపాటే. కాలచక్రంలో సంవత్సరాలు దొర్లిపోతున్నా.. వదిలించుకోవాలన్న అలవాట్లు కొనసాగుతూనే ఉంటాయి. కొత్త లక్ష్యాలను ఏర్పర్చుకుని జనవరి ముగియకముందే వదిలేయడం మామూలుగానే జరిగిపోతుంది. కొత్త ఏడాదిలో మద్యం మానేస్తాను.. సిగరేట్ తాగను.. పేక ఆడను.. మద్యం ముట్టుకోను.. పరీక్షల్లో రాణిస్తాను.. ఉద్యోగం సాధిస్తాను.. ఇలా ఎన్నో తీర్మానాలు, లక్ష్యాలు. చెడు వ్యసనాలను అధిగమించలేమా..? లక్ష్యాన్ని సాధించలేమా..? సరైన ప్రణాళిక రూపొందించుకుని ముందడుగు వేస్తే బలహీనతలను అధిగమించవచ్చు. చెడు వ్యసనాలకు చెక్ పెట్టొచ్చు. లక్ష్యాన్ని ఛేదించవచ్చు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు... అన్నాడో సినీ కవి. ఇంకెందుకు ఆలస్యం ‘కొత్త’లోకం వైపు అడుగులు వేయండి.. - న్యూస్‌లైన్, మంచిర్యాల అర్బన్ మద్యం మానడం సులువే.. మద్యం మానేయాలనుకుంటే సులువైన మార్గం ఉంది. కొత్త సంవత్సరంలో మద్యం మానేస్తాను అంటూ పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే పార్టీలో ప్రతిజ్ఞ చేస్తారు. మరుసటి రోజు చీకటి పడగానే మనసు మద్యం వైపు లాగేస్తుంది. మద్యం సేవిస్తారు. జనవరి దాటకముందే మళ్లీ మద్యం తాగడం మొదలవుతుంది. ఈ వ్యసనం నుంచి బయటపడాలనుకునే వారు దృఢ విశ్వాసంతో ప్రయత్నిస్తే అసాధ్యమేమి కాదు. రోజంతా మద్యంమత్తులో మునిగి తేలిన వారు ఇప్పుడు మందు అంటే అసహ్యించుకుంటున్నారు. అందుకు వారిలో ఉన్న పట్టుదలే ప్రధాన కారణం. మద్యం సేవించే మిత్రులతో కొంతకాలం దూరంగా ఉండండి. పార్టీలకు స్వస్తి పలకండి. పుస్తకాలు చదవండి. టీవీలో వచ్చే హాస్య సన్నివేశాలు చూసి నవ్వుకోండి. ఒంటరిగా ఉండకుండా పిల్లలతో ఆడుకోండి. ఆలోచనలు మద్యం వైపు మళ్లకుండా బీజీగా ఉండేలా ప్రణాళిక రూపొందించుకోండి. దీంతో మద్యం తాగాలనే కోరిక నశిస్తుంది. ఇక హాయిగా.. ఆరోగ్యంగా ఉండడమే కాకుండా డబ్బులూ ఆదా అవుతాయి. పేకాటకు మంగళం పాడాల్సిందే.. పేకాట పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపుతోంది. ఛిన్నాభిన్నం చేస్తోంది. పేకాటతో ఉన్నదంతా కోల్పోయి వీధిలో పడ్డవారు ఎందరో ఉన్నారు. పేకాడేవారు కొత్త సంవత్సరంలో పేక ఆడనంటూ తీర్మానం చేసుకుంటారు. రెండ్రోజులు కాగానే చేతులు పేకముక్కల వైపు లాగుతాయి. పేకాట వల్ల కలిగే దుష్పరిణామాలు తెలిసినా ఆడడం బలహీనత. దాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి. చేసే ఉద్యోగం, వ్యాపారంపై మనసు పెట్టాలి. పేకాట మిత్రులకు ఎంత దూరంగా అంటే అంత మంచిది. కాలక్షేపానికి టీవీ చూడ్డం, సినిమాలకు వెళ్లడం చేయాలి. లేదంటే దూరంగా ఉండే మిత్రులు, బంధువుల ఇళ్లకు వెళ్లాలి. కుటుంబ సంక్షేమంపై దృష్టి సారించాలి. ఇలా చేస్తే క్రమంగా పేకాటకు దురమవుతారు. సిగరేట్ అలవాటు నిలిపేయండిలా.. మనసుంటే దేనికైనా మార్గం ఉంటుంది. సిగరేట్ మానేయాలనుకోవడం పెద్ద సమస్య కాదు. సిగరేట్ తాగడం వల్ల మనకు అనారోగ్యంతోపాటు ఇతరులకూ ఇబ్బందిగా ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో సిగరేట్ తాగడం చట్టరీత్యా నేరం. అంతేకాకుండా క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. సిగరేట్కు దూరంగా ఉంటే రెండు మూడు రోజులు ఇబ్బందిగానే ఉంటుంది. సిగరేట్ తాగాలనిపిస్తే వెంటనే చూయింగ్ గమ్ నమలాలి. నమలడం వల్ల సిగరేట్‌పై ధ్యాస తగ్గుతుంది. వాకింగ్ చేయడం, శ్వాస బాగా పీల్చుకోవడం ద్వారా మనసు అదుపులో ఉంటుంది. ఆ తర్వాత పూర్తిగా సిగరేట్‌పై ఆసక్తి తగ్గుతుంది. ధ్యానంతో పని ఒత్తిడికి చెక్ కొత్త సంవత్సరంలో ఆరోగ్యకరమైన సంవత్సరంగా మలుచుకోవడం మన చేతిలోనే ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడిని అధిగమించడానికి అనేక మార్గాలున్నాయి. వాటిని ఆచరణలో పెడితే సమస్య పరిష్కారమవుతుంది. ముందుగా కోపాన్ని తగ్గించుకోవాలి. మనసును అదుపులో పెట్టుకోవాలి. ఎంత పెద్ద సమస్యనైనా అధిగమిస్తాననే విశ్వాసంతో ఉండాలి. చిరునవ్వుతో పనులు చక్కబెట్టుకోవాలి. శత్రువులుంటే వారి మాటలను పట్టించుకోవద్దు. ప్రతి రోజు వాకింగ్, వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలి. పని ఒత్తిడి ఉంటే కొంత సేపే కుర్చీలో కూర్చుని విశ్రాంతి తీసుకోవడం మంచిది. బీపీ, షుగర్ ఉంటే వైద్యుల సలహా మేరకు ప్రతి రోజు మందులు వాడాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఏడాదంతా ప్రశాంతతే ఉంటుంది. టీవీ వీక్షణంతో ఆటంకం టీవీ వీక్షణం వల్ల పిల్లల చదువు, నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. చాలామంది తల్లిదండ్రులు వార్తలు, సీరియళ్లు అంటూ టీవీలకు అతుక్కుపోతే పిల్లలు ఎలా చదువుతారు. పిల్లలు చదువుకునే సమయంలో టీవీ పెట్టడం వల్ల చదువుకు నష్టం కలుగుతుంది. టీవీ పెట్టకుండా ఉంటే ఈ కొత్త సంవత్సరంలో తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే మంచి బహుమానం అదే అవుతుంది. సెలవుల్లో, పాఠశాల నుంచి ఇంటికి రాగానే పిల్లలు ఆటలంటూ బయటకు వెళ్తారు. అలా వెళ్లకుండా చూడాలి. పొదుపు.. జీవితానికి మలుపు మధ్య తరగతి కుటుంబాలు సంపాదనలో కొంత భాగం పొదుపు చేయాలని అనుకుంటాయి. కానీ సాధ్యం కాదు. పొదుపు మంత్రదండం మనచేతుల్లోనే ఉందనేది గుర్తించాలి. ఆదాయానికి అనుగుణంగా ఖర్చు చేయాలి. దుబారా వ్యయాన్ని నియంత్రించాలి. ఇరుగు పొగురు వారిని చూసి పోటీగా అనవసర ఖర్చులు చేయొద్దు. సినిమాలు, షికారులకు దుబారా ఖర్చు మానుకోవాలి. వచ్చే ఆదాయాన్ని ఎలా ఖర్చు చేయాలనే దానిపై ప్రణాళిక రూపొందించుకోవాలి. అప్పుడే ఎంత డబ్బు పొదుపు చేయగలమో తెలుస్తుంది. బ్యాంకులు, చిట్టీలు, పోస్టాఫీసుల్లో పొదుపు చేస్తే పిల్లల ఉన్నత చదువుకు ఉపయోగపడుతాయి. ప్రతి మాసం 30 శాతం డబ్బు పొదుపు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. సాధనతో ప్రభుత్వ ఉద్యోగం సుదీర్ఘ కాలం తర్వాత ప్రభుత్వం వీఆర్వో, వీఆర్ఏ, పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. నోటిఫికేషన్లు వెలువడ్డాయి. నిరుద్యోగులకు మంచి రోజులని చెప్పువచ్చు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అందరూ ఆరాట పడుతారు. ఎలా సాధించాలి, ఎలాంటి సాధన చేయాలనేదే ముఖ్యం. రేపు మాపు అంటూ వాయిదా వేయకుండా ఇప్పటినుంచే సాధన ప్రారంభించాలి. పట్టుదలతో చదవాలి. పరీక్షలకు సిద్ధం కావడానికి శిక్షణ పొందాలి. నమూనా ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి. పరీక్షా కాలం.. కొత్త సంవత్సరం విద్యార్థులకు పరీక్షా కాలం. ఆరు మాసాలు.. వార్షిక పరీక్షలు కొత్త సంవత్సరం నుంచే ఆరంభమవుతాయి. విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదవాలి. ఆరు మాసాల పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే వార్షిక పరీక్షల దృష్ట్యా మెదడుకు మరింత పదును పెట్టాలి. పోటీగా చదవాలి. పాఠశాల, కళాశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మంచి మార్కులు సాధిస్తాననే పట్టుదలతో చదవాలి. ఆంగ్లం రాని వారు కూడా బాధపడుతుంటారు. ఈ మధ్య కాలంలో స్పోకెన్ ఇంగ్లిషు కేంద్రాలు వెలిసాయి. అక్కడ శిక్షణ పొందితే ఆంగ్లంలోనూ అనర్గళంగా మాట్లాడడం వస్తుంది. మీలోని ఆత్మన్యూనతా భావం మటుమాయం అవుతుంది. డైరీ మంచి నేస్తం డైరీ రాయాలని చాలామంది కొత్త సంవత్సరంలో కొనుగోలు చేస్తారు. నెల రోజులు బాగానే రాస్తారు. రెండో నెల నుంచి ఏడాది ముగింపు వరకు డైరీలోని పేజీలు ఖాళీగానే ఉంటాయి. డైరీ రాయడం మంచి అలవాటు. రోజు జరిగిన అనుభవాలను డైరీలో అక్షర రూపంలో నిక్షిప్తం చేయాలి. తీపి, చేదు జ్ఞాపకాలను డైరీతో పంచుకోవాలి. పేజీలు తిరగేసిన కొద్దీ పాత జ్ఞాపకాలు కళ్ల ముందు కదలాడుతాయి. మనం చేసిన తప్పులను గుర్తించి సవరించుకునే అవకాశం ఏర్పడుతుంది. అందుకే డైరీ మంచి నేస్తం అన్నారు పెద్దలు. వ్యాయామం ఆరోగ్యానికి రక్ష ప్రతి వ్యక్తి ఆరోగ్యం కాపాడుకోవడానికి తప్పని సరిగా వ్యాయామం చేయాలి. ఇటీవల కాలంలో మనం తినే ఆహారం, పని ఒత్తిడి వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. బీపీ, షుగరు, గుండెజబ్బులు, ఊబకాయం వస్తున్నాయి. వీటిని అధిగమించాలంటే వ్యాయామం ఉత్తమం. ప్రతి రోజు వాకింగ్ చేయాలి. ధ్యానం, యోగా, వామప్స్ చేయడం వల్ల అనారోగ్యం దరిచేరదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేదా సాయంత్రం వాకింగ్, షటిల్ ఆడడం మంచిది. కొత్తదనం కోరుకుంటున్న.. సారంగాపూర్ : గతంలో ప్రతి రోజు చెడు వ్యసనాలు, సహవాసాలకు అలవాటు పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న. అందుకే ఈ ఏడాది పాత జ్ఞాపకాలను వదిలి 2014లో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్న. జీవితంలో కొత్తదనాన్ని కోరుకుంటున్న. -రవికుమార్, జామ్ కుటుంబానికి సమయం కేటాయిస్తా.. సారంగాపూర్ : పని ఒత్తిడి కారణంగా కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేశాను. దీని వల్ల నేను బాధపడడమే కాకుండా నా కుటుంబ సభ్యులను బాధపెట్టానని గుర్తించాను. అందుకే ఇక నుంచి కొంత సమయం కుటుంబానికి కేటాయించాలని నిర్ణయించుకున్న. - ఆనంద్, జామ్ వ్యసనాలను వదులుకుంటా.. సారంగాపూర్ : గతేడాది తెలిసీ తెలియకుండా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. నాలో ఉన్న చెడు వ్యసనాలకు స్వస్తి చెప్పాలని నిశ్చయించుకున్న. నలుగురికి సహాయపడే విధంగా జీవిస్తాను. దీనికి కట్టుబడి ఉంటా. - సందీప్, యాకర్పెల్లి ఉన్నతోద్యోగం సాధిస్తా.. సారంగాపూర్ : పెళ్లాయ్యాక నా భర్త నన్ను డిగ్రీ చదివించారు. ఆయన ఆశయాలను నెరవేర్చడానికి ఉన్నతోద్యోగం సాధించాలని లక్ష్యంగా ఏర్పర్చుకున్న. 2014లో పట్టుదలతో చదివి కచ్చితంగా ఉద్యోగం సాధిస్తా. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న. - నేహ రాంపూర్, జామ్