నయా లక్ష్యం.. | new year new targets | Sakshi
Sakshi News home page

నయా లక్ష్యం..

Published Wed, Jan 1 2014 4:56 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

new year new targets

కొత్త సంవత్సరం వస్తోందంటే చాలు.. చాలామందిలో సరికొత్త లక్ష్యాలు మదిలో మెదులుతాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సరికొత్త తీర్మానాలు చేసుకోవడం అందరికీ అనుభవమే. చెడు అలవాట్లు, వ్యసనాలు వదిలేస్తామని.. ఇంటికి, ఒంటికి మేలు చేసే వాటిని అలవర్చుకుంటామని ప్రతినబూనడం పరిపాటే. కాలచక్రంలో సంవత్సరాలు దొర్లిపోతున్నా.. వదిలించుకోవాలన్న అలవాట్లు కొనసాగుతూనే ఉంటాయి. కొత్త లక్ష్యాలను ఏర్పర్చుకుని జనవరి ముగియకముందే వదిలేయడం మామూలుగానే జరిగిపోతుంది. కొత్త ఏడాదిలో మద్యం మానేస్తాను.. సిగరేట్ తాగను.. పేక ఆడను.. మద్యం ముట్టుకోను.. పరీక్షల్లో రాణిస్తాను.. ఉద్యోగం సాధిస్తాను.. ఇలా ఎన్నో తీర్మానాలు, లక్ష్యాలు. చెడు వ్యసనాలను అధిగమించలేమా..? లక్ష్యాన్ని సాధించలేమా..? సరైన ప్రణాళిక రూపొందించుకుని ముందడుగు వేస్తే బలహీనతలను అధిగమించవచ్చు. చెడు వ్యసనాలకు చెక్ పెట్టొచ్చు. లక్ష్యాన్ని ఛేదించవచ్చు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు... అన్నాడో సినీ కవి. ఇంకెందుకు ఆలస్యం ‘కొత్త’లోకం వైపు అడుగులు వేయండి..
 - న్యూస్‌లైన్, మంచిర్యాల అర్బన్
 
 
 మద్యం మానడం సులువే..
 మద్యం మానేయాలనుకుంటే సులువైన మార్గం ఉంది. కొత్త సంవత్సరంలో మద్యం మానేస్తాను అంటూ పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే పార్టీలో ప్రతిజ్ఞ చేస్తారు. మరుసటి రోజు చీకటి పడగానే మనసు మద్యం వైపు లాగేస్తుంది. మద్యం సేవిస్తారు. జనవరి దాటకముందే మళ్లీ మద్యం తాగడం మొదలవుతుంది. ఈ వ్యసనం నుంచి బయటపడాలనుకునే వారు దృఢ విశ్వాసంతో ప్రయత్నిస్తే అసాధ్యమేమి కాదు. రోజంతా మద్యంమత్తులో మునిగి తేలిన వారు ఇప్పుడు మందు అంటే అసహ్యించుకుంటున్నారు. అందుకు వారిలో ఉన్న పట్టుదలే ప్రధాన కారణం. మద్యం సేవించే మిత్రులతో కొంతకాలం దూరంగా ఉండండి. పార్టీలకు స్వస్తి పలకండి. పుస్తకాలు చదవండి. టీవీలో వచ్చే హాస్య సన్నివేశాలు చూసి నవ్వుకోండి. ఒంటరిగా ఉండకుండా పిల్లలతో ఆడుకోండి. ఆలోచనలు మద్యం వైపు మళ్లకుండా బీజీగా ఉండేలా ప్రణాళిక రూపొందించుకోండి. దీంతో మద్యం తాగాలనే కోరిక నశిస్తుంది. ఇక హాయిగా.. ఆరోగ్యంగా ఉండడమే కాకుండా డబ్బులూ ఆదా అవుతాయి.
 
 పేకాటకు మంగళం పాడాల్సిందే..
 పేకాట పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపుతోంది. ఛిన్నాభిన్నం చేస్తోంది. పేకాటతో ఉన్నదంతా కోల్పోయి వీధిలో పడ్డవారు ఎందరో ఉన్నారు. పేకాడేవారు కొత్త సంవత్సరంలో పేక ఆడనంటూ తీర్మానం చేసుకుంటారు. రెండ్రోజులు కాగానే చేతులు పేకముక్కల వైపు లాగుతాయి. పేకాట వల్ల కలిగే దుష్పరిణామాలు తెలిసినా ఆడడం బలహీనత. దాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి. చేసే ఉద్యోగం, వ్యాపారంపై మనసు పెట్టాలి. పేకాట మిత్రులకు ఎంత దూరంగా అంటే అంత మంచిది. కాలక్షేపానికి టీవీ చూడ్డం, సినిమాలకు వెళ్లడం చేయాలి. లేదంటే దూరంగా ఉండే మిత్రులు, బంధువుల ఇళ్లకు వెళ్లాలి. కుటుంబ సంక్షేమంపై దృష్టి సారించాలి. ఇలా చేస్తే క్రమంగా పేకాటకు దురమవుతారు.
 సిగరేట్ అలవాటు నిలిపేయండిలా..
 మనసుంటే దేనికైనా మార్గం ఉంటుంది. సిగరేట్ మానేయాలనుకోవడం పెద్ద సమస్య కాదు. సిగరేట్ తాగడం వల్ల మనకు అనారోగ్యంతోపాటు ఇతరులకూ ఇబ్బందిగా ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో సిగరేట్ తాగడం చట్టరీత్యా నేరం. అంతేకాకుండా క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. సిగరేట్‌కు దూరంగా ఉంటే రెండు మూడు రోజులు ఇబ్బందిగానే ఉంటుంది. సిగరేట్ తాగాలనిపిస్తే వెంటనే చూయింగ్ గమ్ నమలాలి. నమలడం వల్ల సిగరేట్‌పై ధ్యాస తగ్గుతుంది. వాకింగ్ చేయడం, శ్వాస బాగా పీల్చుకోవడం ద్వారా మనసు అదుపులో ఉంటుంది. ఆ తర్వాత పూర్తిగా సిగరేట్‌పై ఆసక్తి తగ్గుతుంది.
 
 ధ్యానంతో పని ఒత్తిడికి చెక్
 కొత్త సంవత్సరంలో ఆరోగ్యకరమైన సంవత్సరంగా మలుచుకోవడం మన చేతిలోనే ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడిని అధిగమించడానికి అనేక మార్గాలున్నాయి. వాటిని ఆచరణలో పెడితే సమస్య పరిష్కారమవుతుంది. ముందుగా కోపాన్ని తగ్గించుకోవాలి. మనసును అదుపులో పెట్టుకోవాలి. ఎంత పెద్ద సమస్యనైనా అధిగమిస్తాననే విశ్వాసంతో ఉండాలి. చిరునవ్వుతో పనులు చక్కబెట్టుకోవాలి. శత్రువులుంటే వారి మాటలను పట్టించుకోవద్దు. ప్రతి రోజు వాకింగ్, వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలి. పని ఒత్తిడి ఉంటే కొంత సేపే కుర్చీలో కూర్చుని విశ్రాంతి తీసుకోవడం మంచిది. బీపీ, షుగర్ ఉంటే వైద్యుల సలహా మేరకు ప్రతి రోజు మందులు వాడాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఏడాదంతా ప్రశాంతతే ఉంటుంది.
 
 టీవీ వీక్షణంతో ఆటంకం
 టీవీ వీక్షణం వల్ల పిల్లల చదువు, నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. చాలామంది తల్లిదండ్రులు వార్తలు, సీరియళ్లు అంటూ టీవీలకు అతుక్కుపోతే పిల్లలు ఎలా చదువుతారు. పిల్లలు చదువుకునే సమయంలో టీవీ పెట్టడం వల్ల చదువుకు నష్టం కలుగుతుంది. టీవీ పెట్టకుండా ఉంటే ఈ కొత్త సంవత్సరంలో తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే మంచి బహుమానం అదే అవుతుంది. సెలవుల్లో, పాఠశాల నుంచి ఇంటికి రాగానే పిల్లలు ఆటలంటూ బయటకు వెళ్తారు. అలా వెళ్లకుండా చూడాలి.
 
 పొదుపు.. జీవితానికి మలుపు
 మధ్య తరగతి కుటుంబాలు సంపాదనలో కొంత భాగం పొదుపు చేయాలని అనుకుంటాయి. కానీ సాధ్యం కాదు. పొదుపు మంత్రదండం మనచేతుల్లోనే ఉందనేది గుర్తించాలి. ఆదాయానికి అనుగుణంగా ఖర్చు చేయాలి. దుబారా వ్యయాన్ని నియంత్రించాలి. ఇరుగు పొగురు వారిని చూసి పోటీగా అనవసర ఖర్చులు చేయొద్దు. సినిమాలు, షికారులకు దుబారా ఖర్చు మానుకోవాలి. వచ్చే ఆదాయాన్ని ఎలా ఖర్చు చేయాలనే దానిపై ప్రణాళిక రూపొందించుకోవాలి. అప్పుడే ఎంత డబ్బు పొదుపు చేయగలమో తెలుస్తుంది. బ్యాంకులు, చిట్టీలు, పోస్టాఫీసుల్లో పొదుపు చేస్తే పిల్లల ఉన్నత చదువుకు ఉపయోగపడుతాయి. ప్రతి మాసం 30 శాతం డబ్బు పొదుపు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.  
 
 సాధనతో ప్రభుత్వ ఉద్యోగం
 సుదీర్ఘ కాలం తర్వాత ప్రభుత్వం వీఆర్వో, వీఆర్‌ఏ, పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. నోటిఫికేషన్లు వెలువడ్డాయి. నిరుద్యోగులకు మంచి రోజులని చెప్పువచ్చు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అందరూ ఆరాట పడుతారు. ఎలా సాధించాలి, ఎలాంటి సాధన చేయాలనేదే ముఖ్యం. రేపు మాపు అంటూ వాయిదా వేయకుండా ఇప్పటినుంచే సాధన ప్రారంభించాలి. పట్టుదలతో చదవాలి. పరీక్షలకు సిద్ధం కావడానికి శిక్షణ పొందాలి. నమూనా ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి.
 
 పరీక్షా కాలం..
 కొత్త సంవత్సరం విద్యార్థులకు పరీక్షా కాలం. ఆరు మాసాలు.. వార్షిక పరీక్షలు కొత్త సంవత్సరం నుంచే ఆరంభమవుతాయి. విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదవాలి. ఆరు మాసాల పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే వార్షిక పరీక్షల దృష్ట్యా మెదడుకు మరింత పదును పెట్టాలి. పోటీగా చదవాలి. పాఠశాల, కళాశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మంచి మార్కులు సాధిస్తాననే పట్టుదలతో చదవాలి. ఆంగ్లం రాని వారు కూడా బాధపడుతుంటారు. ఈ మధ్య కాలంలో స్పోకెన్ ఇంగ్లిషు కేంద్రాలు వెలిసాయి. అక్కడ శిక్షణ పొందితే ఆంగ్లంలోనూ అనర్గళంగా మాట్లాడడం వస్తుంది. మీలోని ఆత్మన్యూనతా భావం మటుమాయం అవుతుంది.
 
 డైరీ మంచి నేస్తం
 డైరీ రాయాలని చాలామంది కొత్త సంవత్సరంలో కొనుగోలు చేస్తారు. నెల రోజులు బాగానే రాస్తారు. రెండో నెల నుంచి ఏడాది ముగింపు వరకు డైరీలోని పేజీలు ఖాళీగానే ఉంటాయి. డైరీ రాయడం మంచి అలవాటు. రోజు జరిగిన అనుభవాలను డైరీలో అక్షర రూపంలో నిక్షిప్తం చేయాలి. తీపి, చేదు జ్ఞాపకాలను డైరీతో పంచుకోవాలి. పేజీలు తిరగేసిన కొద్దీ పాత జ్ఞాపకాలు కళ్ల ముందు కదలాడుతాయి. మనం చేసిన తప్పులను గుర్తించి సవరించుకునే అవకాశం ఏర్పడుతుంది. అందుకే డైరీ మంచి నేస్తం అన్నారు పెద్దలు.
 
 వ్యాయామం ఆరోగ్యానికి రక్ష
 ప్రతి వ్యక్తి ఆరోగ్యం కాపాడుకోవడానికి తప్పని సరిగా వ్యాయామం చేయాలి. ఇటీవల కాలంలో మనం తినే ఆహారం, పని ఒత్తిడి వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. బీపీ, షుగరు, గుండెజబ్బులు, ఊబకాయం వస్తున్నాయి. వీటిని అధిగమించాలంటే వ్యాయామం ఉత్తమం. ప్రతి రోజు వాకింగ్ చేయాలి. ధ్యానం, యోగా, వామప్స్ చేయడం వల్ల అనారోగ్యం దరిచేరదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేదా సాయంత్రం వాకింగ్, షటిల్ ఆడడం మంచిది.
 
 కొత్తదనం కోరుకుంటున్న..
 సారంగాపూర్ : గతంలో ప్రతి రోజు చెడు వ్యసనాలు, సహవాసాలకు అలవాటు పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న. అందుకే ఈ ఏడాది పాత జ్ఞాపకాలను వదిలి 2014లో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్న. జీవితంలో కొత్తదనాన్ని కోరుకుంటున్న.
 -రవికుమార్, జామ్
 
 కుటుంబానికి సమయం కేటాయిస్తా..
 సారంగాపూర్ : పని ఒత్తిడి కారణంగా కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేశాను. దీని వల్ల నేను బాధపడడమే కాకుండా నా కుటుంబ సభ్యులను బాధపెట్టానని గుర్తించాను. అందుకే ఇక నుంచి కొంత సమయం కుటుంబానికి కేటాయించాలని నిర్ణయించుకున్న.  
 - ఆనంద్, జామ్
 
 వ్యసనాలను వదులుకుంటా..
 సారంగాపూర్ : గతేడాది తెలిసీ తెలియకుండా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. నాలో ఉన్న చెడు వ్యసనాలకు స్వస్తి చెప్పాలని నిశ్చయించుకున్న. నలుగురికి సహాయపడే విధంగా జీవిస్తాను. దీనికి కట్టుబడి ఉంటా.
 - సందీప్, యాకర్‌పెల్లి
 
 ఉన్నతోద్యోగం సాధిస్తా..
 సారంగాపూర్ : పెళ్లాయ్యాక నా భర్త నన్ను డిగ్రీ చదివించారు. ఆయన ఆశయాలను నెరవేర్చడానికి ఉన్నతోద్యోగం సాధించాలని లక్ష్యంగా ఏర్పర్చుకున్న. 2014లో పట్టుదలతో చదివి కచ్చితంగా ఉద్యోగం సాధిస్తా. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న.
 - నేహ రాంపూర్, జామ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement