సాక్షి, హైదరాబాద్: దేశమంతా లాక్‌డౌన్‌తో షట్‌డౌన్ అయింది. ఎక్కడివారక్కడే ఇళ్లకు పరిమితమయ్యారు. కొందరు ఉద్యోగులు ఇళ్లనుంచే పనిచేస్తున్నారు. ఇంకొందరు విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు.. ఇలా అత్యవసర సేవల కేటగిరీల్లోని వారు విధిగా విధులకు హాజరవుతున్నారు. బ్యాంకులూ అందులో భాగమే. అందుకే బ్యాంకులు తెరిచే ఉంటున్నాయి. కరోనా విస్తరిస్తున్న వేళ భయంగానే ఆఫీసులకు వెళ్లి ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. కానీ.. ‘కరోనా’పట్టింపు లేకుండా, అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలను పట్టించు కోకుండా కొన్ని ప్రైవేటు బ్యాంకులు ఉద్యోగులకు ‘టార్గెట్’విధిస్తూ బిజినెస్ పెంచాలని ఒత్తిడి తెస్తు న్నాయి. సాధారణంగా బ్యాంకులకు ఆర్థిక సంవ త్సరం ప్రారంభంతోనే పని ఒత్తిడి మొదలవు తుంది. క్రితం ఏడాది ఎంత బిజినెస్ జరిగిందో అంతకు ఒకటిన్నర రెట్లు కొత్త సంవత్సరంలో జరగా లని లక్ష్యం నిర్ధారించి యాజమాన్యాలు పరుగు పెట్టిస్తాయి. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలై మూడు రోజులైంది. దీంతో నాలుగైదు రోజులుగా నిత్యం కాన్ఫరెన్స్, వీడియోకాల్స్ ద్వారా సమావేశాలు ఏర్పాటుచేస్తూ కొత్త లక్ష్యాలను నిర్దేశిస్తున్నాయి. వాటిని సాధించాలని ఒత్తిడి తెస్తున్నాయి. కరోనా వైరస్ విస్తరిస్తూ ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ టార్గెట్లపై ఉద్యోగులు విస్తుపోతున్నారు.
రోజూ రూ.3 కోట్ల వ్యాపారం
ప్రస్తుతం కొన్ని ప్రధాన ప్రైవేటు బ్యాంకుల మధ్య తీవ్ర పోటీ ఉంది. వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో శాఖలు తెరుస్తున్నాయి. ఓ ప్రాంతంలో ఓ ప్రైవేటు బ్యాంకు శాఖను ప్రారంభించగానే, అదే ప్రాంతంలో మరో పోటీ బ్యాంకు బ్రాంచీ ప్రారంభిస్తోంది. ఇలా ప్రధానంగా మూడు ప్రైవేటు బ్యాంకులు పోటీపడుతున్నాయి. తాజాగా ఇవి నాలుగు రోజులుగా కాన్ఫరెన్స్, వీడియో కాల్స్ రూపంలో సమావేశాలు ఏర్పాటుచేస్తూ ఉద్యోగులకు బిజినెస్ అప్పగిస్తున్నారు. కొత్తగా ప్రారంభమైన బ్రాంచీల్లో నెలకు కనీసం రూ.3 కోట్ల వ్యాపారం చేయాలని టార్గెట్ విధిస్తున్నారు. అప్పటికే ప్రారంభమై కనీసం ఏడాదైన బ్రాంచీలకు గతేడాది చేసిన బిజినెస్ మొత్తంలో అదనంగా 50 శాతం, పెద్ద బ్రాంచీలైతే ఒకటిన్నర రెట్లు వ్యాపారం చేయాలని లక్ష్యం విధించేశారు. కాస్త అటూఇటూగా ఈ పోటీ బ్యాంకులు కొత్త టార్గెట్లతో ఉద్యోగులను పరుగులు పెట్టిస్తున్నాయి.
కొత్త ఖాతాలు, బీమా పాలసీలు, ఫారెక్స్ కార్డులు..
బ్యాంకు ఉద్యోగులకు తొలి టార్గెట్ కొత్త ఖాతాలే. సేవింగ్స్, కరెంటు ఖాతాలతోపాటు, ఫిక్స్‌డ్, రికరింగ్ డిపాజిట్లు పెంచటం తదుపరి టార్గెట్. ప్రస్తుతం అన్ని వాణిజ్య బ్యాంకులు బీమా కంపెనీలతో టైఅప్ కుదుర్చుకున్నాయి. కొన్నింటికి సొంత బీమా సంస్థలున్నాయి. ఖాతాలు తెరిచే వారితో ఏదోఒక బీమా పాలసీ కూడా తీసుకునేలా చేస్తున్నాయి. జీవిత, వాహన, ఆరోగ్య బీమాలు తీసుకోవాలని ఖాతాదారులను ఒత్తిడి చేస్తుంటారు. వీటికి తోడు గృహ, వ్యాపార, విద్యారుణాలు.. ఇలా ఏదోఒక లోన్ తీసుకునేలా ఒప్పిస్తుంటారు. ఈ టార్గెట్లను సులభంగా సాధించేందుకు బ్యాంకులు తెలివిగా రుణాలతో బీమా పాలసీలను అనుసంధానిస్తున్నాయి. వీటన్నింటికి సంబంధించి విడివిడిగా టార్గెట్లను ఫిక్స్ చేసి బ్రాంచీల ముందుంచారు. కరోనా భయం, లాక్‌డౌన్ నిబంధనలతో అసలు బ్యాంకులకు ఖాతాదారులు రావటమే తగ్గింది. ఈ తరుణంలో టార్గెట్లను ఎలా సాధించాలని ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు.
పదోన్నతులతో ముడిపెడుతూ..
బ్యాంకుల్లో పదోన్నతి రావాలన్నా, జీతం పెరగాలన్నా వ్యక్తిగత టార్గెట్లను సాధించడంపైనే ఆధారపడి ఉంటుంది. టార్గెట్లపై ఏమరుపాటుగా ఉంటే దాని ఫలితం ప్రమోషన్లు, జీతాల పెరుగుదలపై ఉంటుందని పరోక్ష హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దీంతో రెండ్రోజులుగా బ్యాంకు ఉద్యోగులు ఖాతాదారులకు సంబంధించిన బ్యాంకు అంతర్గత పనులు చూస్తూనే బిజినెస్ పెంచుకునే కసరత్తు ప్రారంభించారు. ఎక్కువ మంది ఫోన్లలో ఖాతాదారులతో మాట్లాడుతూ ఏదో ఓ పాలసీ తీసుకునేలా, ఖాతాలో డిపాజిట్లను పెంచేలా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లాక్‌డౌన్ వల్ల వేతనాల్లో కోతపడే పరిస్థితి ఉందని, ఇప్పుడు ఇటువంటివి తలకెత్తుకోలేమని ఖాతాదారులు చెబుతుండటంతో బ్యాంకు ఉద్యోగులకు దిక్కుతోచడం లేదు.
‘పీఎం కేర్స్’భారం కవరింగ్ కోసం..
చాలా బ్యాంకులు ప్రస్తుతం పీఎం కేర్స్ ఫండ్ కు భారీగా విరాళాలిస్తున్నాయి. ఇది అభినందించాల్సిన విషయమే. మరోపక్క వాటికిది అదనపు ఖర్చు కూడా. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం బిజినెస్‌ను మరింత పెంచుకోవటం ద్వారా ఈ భారాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఫలితంగా ఈ భారం కూడా వినియోగదారులపై పడనుంది.
టార్గెట్లు.. ఆప్షన్లు
►బ్యాంకు సిబ్బందిలో ప్రతి ఒక్కరు రోజూ కనీసం ఆరుకు తగ్గకుండా లావాదేవీలు చేయాలని ఓ ప్రధాన వాణిజ్యబ్యాంకు టార్గెట్ పెట్టింది. కొత్త ఖాతాలు, కొత్త డిపాజిట్లు, డిపాజిట్ల మొత్తం పెంపు, బీమా పాలసీలు.. వీటిలో ఏవైనా ఆరు చేయాలి.
►రుణాలకు సంబంధించి ప్రత్యేకంగా పాయింట్స్ విధానం ఉంటుంది. పంట, గృహ, విద్య, విదేశీ రుణాలు... ఇలా ఆయా రుణాలకు సంబంధించి నెలకు 600 పాయింట్లకు తగ్గకుండా సాధించాలని మరో బ్యాంకులో లక్ష్యం విధించారు.
►ఎన్‌ఆర్‌ఐలు పంపే డబ్బులను ఒడిసిపట్టుకునే (ఫారిన్ రెమిటెన్స్) విషయంలోనూ టార్గెట్లున్నాయి. వీరు ఇండియాలో ఉండే తమవారికి పంపే డబ్బును తమ బ్యాంకులో ఖాతా తెరిచి జమ చేసేలా చేయటం అన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment