మిషన్‌ 2018 - 8 లక్ష్యాలు | DGP Mahendar Reddy Speaks To Media Over 2018 Plans | Sakshi
Sakshi News home page

మిషన్‌ 2018 - 8 లక్ష్యాలు

Published Sun, Dec 31 2017 1:57 AM | Last Updated on Sun, Dec 31 2017 1:57 AM

DGP Mahendar Reddy Speaks To Media Over 2018 Plans - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పూర్తి భద్రమైన రాష్ట్రం కోసం పోలీసు శాఖ ‘నూతన’ఒరవడి వైపు అడుగులు వేస్తోంది. నూతన సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా విప్లవాత్మకమైన మార్పులు, టెక్నాలజీ వినియోగాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డి ‘మిషన్‌–2018’పేరిట ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సంవత్సరాంత మీడియా కాన్ఫరెన్స్‌లో దీనిని విడుదల చేశారు. ఎనిమిది లక్ష్యాలతో ఈ కార్యాచరణను అమలు చేయనున్నట్లు డీజీపీ తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు, శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపడతామన్నారు. హైదరాబాద్‌ కాప్‌ యాప్‌ను మరింత విస్తృతపరిచి రాష్ట్ర పోలీసులందరికీ అందుబాటులో ఉండేలా ‘టీఎస్‌ కాప్‌’యాప్‌ను తీసుకువస్తున్నామని చెప్పారు. పోలీసు సిబ్బందికి నేర నియంత్రణ, దర్యాప్తులో మెళకువల కోసం ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్, మహిళల భద్రత, ఎమర్జెన్సీ రెస్పాన్స్, సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ సర్వీస్‌ తదితర వ్యవస్థలన్నింటినీ త్వరలోనే జిల్లా పోలీసు విభాగాల్లో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. సమాజ భద్రత కోసం హైదరాబాద్‌లో అమలుచేస్తున్న ‘నేను సైతం’ కార్యక్రమాన్ని జిల్లాల్లోనూ అమలుచేస్తామని తెలిపారు.

డీజీపీ వెల్లడించిన 8 లక్ష్యాలివీ సేవల్లో పురోగతి
ప్రజలు సంతృప్తి చెందేలా పోలీసు సేవలను అందించాలని నిర్ణయించారు. ఏదైనా ఘటన జరిగిన ప్రాంతానికి అతి త్వరగా చేరుకునేందుకు కార్యాచరణ అమలు చేస్తారు. పోలీసులు ప్రతి ఒక్కరికీ దగ్గరయ్యేందుకు  ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతున్నామని డీజీపీ వెల్లడించారు. ఆన్‌లైన్‌ సర్వీస్, ఫీడ్‌ బ్యాక్, కొత్త యాప్స్, పబ్లిక్‌ అలర్ట్‌ వంటివి దీని కిందకు వస్తాయని తెలిపారు.
 
సమర్థవంతంగా నేరాల నియంత్రణ
సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న నేరాలు, ముఠాలు, గ్యాంగులను నియంత్రించడంతోపాటు కొత్తగా పుట్టుకువచ్చే నేరాలను మొగ్గలోనే తుంచేందుకు ‘కంబాట్‌ ఎగ్జిస్టింగ్‌ అండ్‌ ఎమర్జింగ్‌ క్రైమ్‌’పేరుతో కార్యాచరణ అమలు చేస్తారు. నేరాల దర్యాప్తులో అధికారులు, సిబ్బందికి మెళకువలు, ప్రొఫెషనలిజం పెంపొందించడం, జాతీయ, అంతర్గత భద్రత వ్యవహారాలు, బెదిరింపులకు తగ్గట్టుగా చర్యలు చేపట్టడం దీనిలో కీలకంగా ఉంటాయని డీజీపీ తెలిపారు.
 
పునర్నిర్మాణం–పటిష్టత
ప్రస్తుతం పోలీసు శాఖలో ఉన్న వివిధ విభాగాలను పునర్నిర్మించి మరింత పటిష్టంగా పనిచేసేలా కార్యాచరణ (ఆర్గనైజేషన్‌ బిల్డింగ్‌ అండ్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌) చేపడతారు. ప్రత్యేక విభాగాల పటిష్టానికి కృషి, క్రాక్‌జాక్‌ సెంటర్, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ, స్టేషన్‌ హౌజ్‌ మేనేజ్‌మెంట్, జెండర్‌ రీసోర్స్‌ సెంటర్, ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌ మోడల్స్, సిబ్బంది, అధికారుల వైఖరిలో మార్పు తదితర అంశాలు ఈ ప్రణాళిక కిందకు వస్తాయి.
 
వర్క్‌ ఫోర్స్‌ మేనేజ్‌మెంట్‌

పోలీసు సిబ్బందిలో కెరీర్‌ మేనేజ్‌మెంట్, శిక్షణకు సంబంధించి ప్రత్యేక అంశాలు దీని కిందకు వస్తాయి. ఉద్యోగి చేసే పనులు, వాటి ఫలితాలు, తగిన ప్రోత్సాహకాలు, సంక్షేమం, ఇన్వెస్టిగేషన్‌ సపోర్ట్‌ సెంటర్, ఎఫ్‌ఎస్‌ఎల్, ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో తదితరాలన్నింటిలో ఈ కార్యచరణ కీలకంగా మారనుంది.
 
టెక్నాలజీని అందిపుచ్చుకోవడం
టెక్నాలజీని వినియోగించుకుని నిఘా (స్మార్ట్‌ సర్వైలెన్స్‌), కమాండ్‌ కంట్రోల్‌ సిస్టమ్, సైబర్‌ టెక్నో కమాండ్‌ సెంటర్, స్మార్ట్‌ పోలీసింగ్‌ అంశాలను అందుబాటులోకి తెస్తారు. తద్వారా సైబర్‌ నేరాల నియంత్రణ, 360 డిగ్రీ ప్రొఫైల్, జియోట్యాగ్‌ మ్యాపింగ్, ఇంటిగ్రేటెడ్‌ పోలీస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్వహణ, ఇంట్రిగేటెడ్‌ డేటాబేస్‌ తదితరాలన్నీ ఎప్పటికప్పుడు, ఎలా పనిచేయాలన్నదాని కోసం ఈ ప్రణాళిక రూపొందించినట్టు డీజీపీ తెలిపారు.
 
కమ్యూనిటీ భాగస్వామ్యం, నిపుణుల పర్యవేక్షణ
ప్రజల భాగస్వామ్యం, నిపుణులు సలహాలు, సహాయంతో నేరాల నియంత్రణకు కృషిచేయడం ఈ కార్యచరణలోకి వస్తాయి. ఇందులో సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ వ్యవస్థ, నవ సమాజ స్థాపనకు కావాల్సిన అంశాల స్వీకరణ, స్టూడెంట్‌ పోలీస్‌ కేడర్‌ కార్యక్రమాలు, అకడమిక్‌ ఇన్‌పుట్స్‌ ఫార్ములా తదితరాలు ఉంటాయి.
 
రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌

రోడ్డు ప్రమాదాల నియంత్రణ, సమీకృత ట్రాఫిక్‌ నిర్వహణ వ్యవస్థ, క్యాష్‌లెస్‌ చలాన్లు, రోడ్‌ సేఫ్టీ పోలీస్‌స్టేషన్లు, గోల్డెన్‌ అవర్‌ ప్రొటెక్షన్‌ మేనేజ్‌మెంట్, ప్రత్యేక రోడ్‌సేఫ్టీ విభాగం ఏర్పాటు ఈ కార్యాచరణలోకి వస్తాయి. ఇందులో ట్రామా కేర్‌ సెంటర్ల ఏర్పాటు, అభివృద్ధి, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక యాప్స్‌ రూపకల్పన, ఇంటిగ్రేటెడ్‌ డేటా మెయింటెనెన్స్, ఆటోమేటెడ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, లైసెన్సుల సస్పెన్షన్‌ తదితర అంశాలు ఉంటాయి.
 
భద్రమైన ప్రాంతాలుగా మార్చడం (సేఫర్‌ అవర్‌ సిటీస్‌ సేఫర్‌)
సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ, అర్బన్‌ ప్రాంతాల భద్రతకు పటిష్ట చర్యలు, డిజిటల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ సెంటర్‌ ఏర్పాటు, నేర నియంత్రణ కోసం వ్యూహాల రచన, ఉగ్రవాద నియంత్రణకు స్పెషల్‌ స్క్వాడ్స్, భారీ వాణిజ్య ప్రాంతాలు, భవనాల భద్రతకు స్టాండర్ట్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ తదితరాలను ఈ ప్రణాళికలో భాగంగా అమలు చేస్తామని డీజీపీ వెల్లడించారు.

అంతా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచే..
అన్ని జిల్లాల్లోని హెడ్‌క్వార్టర్లు, ప్రధాన పట్టణాలు, ఇతర ముఖ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్న సీసీ కెమెరాలను అక్కడి కమాండ్‌ సెంటర్లకు అనుసంధానం చేస్తారని డీజీపీ వెల్లడించారు. ఆ కమాండ్‌ సెంటర్లను హైదరాబాద్‌లోని సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానిస్తామని చెప్పారు. జీపీఎస్‌ ఆధారిత గస్తీ వాహనాలు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. మరిన్ని వాహనాలు కొనుగోలు చేసి.. జిల్లా పోలీసు యంత్రాంగాలకు అందిస్తామని తెలిపారు. ప్రతి జిల్లాలో సోషల్‌ మీడియా ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని.. తద్వారా పుకార్ల నియంత్రణ, వాటి ద్వారా జరిగే నష్టాలను నిరోధించవచ్చని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు క్లూస్‌టీంలు, ఇన్వెస్టిగేషన్‌ సపోర్ట్‌ సెంటర్లను త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement