ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువ... టెక్నాలజీ వినియోగంతో నేరాలు, నేరగాళ్లకు అడ్డుకట్ట... పోలీస్ స్టేషన్లకు కొత్త రూపురేఖలు ఇవ్వడంలో నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తనదైన ముద్ర వేశారు. మూడున్నరేళ్లలో నగర పోలీస్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారంచుట్టి ప్రత్యేకత నిలుపుకొన్న మహేందర్‌రెడ్డి తెలంగాణ డీజీపీగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్‌కమిషనర్‌గా ఆయన సేవలు.. సంస్కరణలపై ప్రత్యేక కథనం...
సాక్షి, సిటీబ్యూరో: ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలు కలిగి ఉండే, నిత్యం కంటి ముందు కనిపించే తొలి ప్రభుత్వోద్యోగి పోలీస్. అతని పనితీరు ఆధారంగానే ప్రజలకు ప్రభుత్వంపై ఓ అభిప్రాయం ఏర్పడుతుంది. ఠాణాల్లోని మౌలిక వసతుల్ని బట్టే బాధితుడికి ప్రాథమిక భరోసా వస్తుంది. టెక్నాలజీ వినియోగం, కఠిన చర్యలతోనే నేరాలు నియంత్రించడం, నేరగాళ్లకు కళ్లెం వేయడం సాధ్యం. ప్రజలతో పోలీసులు ఎంత స్నేహభావంతో, మర్యాదపూర్వకంగా నడుచుకుంటే.. ప్రజల్లో వారి ప్రతిష్ట అంతగా పెరుగుతుంది. గడిచిన మూడున్నరేళ్లలో ఇవన్నీ నగర పోలీస్ విభాగంలో కనిపించాయి. వీటికి కారణమైన ఒకేఒక్కరు పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో పర్యటించిన, అక్కడి విధానాలు అ«ధ్యయనం చేసిన ఆయన.. హైదరాబాద్‌నూ వాటి సరసన చేర్చేందుకు తనవంతు కృషి చేశారు. ఇన్‌చార్జి డీజీపీ హోదాలో మహేందర్‌రెడ్డి సిటీని ‘విడిచి వెళ్తున్న’ నేపథ్యంలో పోలీసింగ్‌లో ఆయన చేపట్టిన సంస్కరణలు, తీసుకువచ్చిన మార్పులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
రూపురేఖలు మారిన ఠాణాలు..
ఒకప్పుడు సిటీలోని చాలా ఠాణాలు భూత్‌బంగ్లాలను తలపించేవి. బాధితులు పోలీసుల వద్దకు వచ్చినప్పుడు ఆహ్లాదకరమైన, సౌకర్యవంతమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో మహేందర్‌రెడ్డి అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రిసెప్షన్ సెంటర్ సహా పలు సౌకర్యాలతో మోడల్ పోలీసుస్టేషన్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆధునికీకరణకు అనువుగా లేని వాటిని కూల్చి కొత్తవి నిర్మించారు. ప్రస్తుతం కమిషనరేట్‌లో పనులు జరుగుతున్న 11 ఠాణాల మినహా మిగిలినవన్నీ ఆధునిక హంగులు సమకూర్చుకున్నవే.
నేరగాళ్ల ‘ఆడిటింగ్’..
నగర పోలీసు విభాగం తీసుకున్న మరో కీలక నిర్ణయం నేరగాళ్ల ‘ఆడిటింగ్’. నేరాలు నిరోధించడంతో పాటు వారిపై నిఘా ఉంచే చర్యల్లో భాగంగా ఠాణాలో ఉండే కానిస్టేబుల్ నుంచి ఇన్‌స్పెక్టర్ వరకు ప్రతి అధికారీ పోలీసు రికార్డుల్లో ఉన్న స్థానిక నేరగాళ్ల ఇళ్లకు వెళ్లారు. దీంతో వారి చిరునామాలతో సహా మారిన వివరాలు అప్‌డేట్ అయ్యాయి. వీటిని జియో ట్యాగింగ్ చేయడం ద్వారా గస్తీ నిర్వహించే రక్షక్, బ్లూకోల్ట్ సిబ్బందితో పాటు ప్రతి అధికారీ విధిగా తమ పరిధిలో నివసించే ఎంఓ క్రిమినల్స్ ఇళ్లకు వెళ్లి తనిఖీ చేసేలా ఏర్పాటు చేశారు.
ఆధారాలు ‘పదిలం’..
నేరం చేసిన నిందితుడిని పట్టుకోవడంలోనే కాదు... న్యాయస్థానంలో దోషిగా నిరూపించడంలోనూ క్లూస్ టీమ్స్ సేకరించే ఆధారాలదే కీలకపాత్ర. ఈ నేపథ్యంలోనే నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో క్లూస్‌టీమ్స్‌ను కొత్వాల్ మహేందర్‌రెడ్డి పరిపుష్టం చేశారు. ఒకప్పుడు ఒకే ఒక్క టీమ్ ఉండగా.. దేశంలోని మరే ఇతర నగరంలోనూ అందుబాటులో లేని విధంగా సబ్–డివిజన్ స్థాయిలో మొత్తం 17 బృందాలు ఏర్పాటు చేశారు.
లక్ష దాటిన ‘నిఘా నేత్రాలు’..
మహేందర్‌రెడ్డి నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న తొలిరోజు నుంచీ సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో మూడున్నరేళ్లలో నగరంలోని సీసీ కెమెరాల సంఖ్య 1.45 లక్షలకు చేరింది. వీటి ఏర్పాటులో ప్రజలకూ భాగస్వామ్యం కల్పిస్తూ ‘నేను సైతం’ అనే ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టారు. సిటీలో నేరాలు తగ్గడానికి, నిందితులను పట్టించడంలో ఇవి కీలక భూమిక పోషిస్తున్నాయి.
బిగిసిన ‘పిడి’కిలి..
గడిచిన మూడున్నరేళ్లలో నగరంలో నేరాలు 30 శాతం వరకు తగ్గాయి. ఒకప్పుడు గడగడలాడించిన చైన్‌స్నాచర్లు తోక ముడవడంతో ఈ కేసుల్లో 90 శాతం తగ్గుదల నమోదైంది. దీనికి సీసీ కెమెరాల ఏర్పాటు ఓ కారణమైతే.. పీడీ యాక్ట్ ప్రయోగం మరో కీలకాంశం. మహేందర్‌రెడ్డి హయాంలో దీన్ని 621 మందిపై ప్రయోగించారు.
‘షీ’కి ప్రత్యేక ‘భరోసా’..
ఈవ్ టీజర్ల పీచమణచడంతో పాటు అతివలకు ఎదురవుతున్న అన్ని రకాల ఇబ్బందులను పరిష్కరించడానికి సిటీలో ‘షీ–టీమ్స్’ను ఏర్పాటు చేయించారు. బస్సుల్లో మహిళలు, పురుషులు కూర్చునే/నిల్చునే ప్రాంతాలకు మధ్య మెష్ ఏర్పాటు ‘షీ–టీమ్స్’ సిఫార్సుతోనే అమలైంది. వివిధ రకాల కేసుల్లో బాధిత మహిళలకు సహాయ సహకారాలు అందాలనే ఉద్దేశంతో ‘భరోసా’ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ రెండూ ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి.
ప్రత్యేకంగా ‘శవాల’ బండి..
నగరంలో ఎక్కడైనా మృతదేహం కనిపిస్తే దాన్ని తరలించడం పోలీసులకు పెద్ద సమస్యగా ఉండేది. స్థానికంగా ఉంటే ఆటోట్రాలీ, వ్యాన్ డ్రైవర్లను బతిమాలో, భయపెట్టో తమ పని కానివ్వాల్సి వచ్చేది. దీన్ని గమనించిన కొత్వాల్ ఇలాంటి సందర్భాల్లో ఉపయోగపడటానికి ప్రత్యేక వాహనాన్ని డిజైన్ చేయించారు. ‘ఫొరెన్సిక్ కారŠప్స్ వెహికిల్’ పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చారు.
పోలీసులకూ ప్రోగ్రెస్ రిపోర్ట్..
నగర పోలీసులకూ ఓ ‘ప్రోగ్రెస్ రిపోర్ట్’ను ప్రవేశపెట్టారు మహేందర్‌రెడ్డి. దీన్ని అధికారులు తమ పరిధిలో నివసించే ప్రజలకు ‘అందించేలా’ ఏర్పాటు చేశారు. ఏడాదికోసారి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వార్షిక పనితీరు నివేదికను పోలీసులు ప్రజల ముందు ఉంచుతున్నారు. ఆయా సమావేశాలు జరిగినన్నాళ్లూ వాటి నిర్వహణ, ప్రగతిని ప్రతి రోజూ కొత్వాల్ స్వయంగా పర్యవేక్షించారు.
ఉద్యోగాలకు ‘వారధి’గా వాహనం..
ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలను అవలంబిస్తున్న నగర పోలీసులు ప్రజలకు మరింత చేరువకావడంతో పాటు వారికి ఉపయుక్తంగా ఉండేందుకు ఏర్పాటు చేసిందే ‘జాబ్ కనెక్ట్’ వాహనం. ఓ పక్క కమ్యూనిటీ పోలీసింగ్ విధానాలు ప్రచారం చేయడంతో పాటు నిరుద్యోగుల నుంచి వివరాలు సేకరించి, వారికి ఉద్యోగాలు చూపించడానికి దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ వాహనం ప్రతి రోజూ కొన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో సంచరిస్తూ ఉంటుంది.
దర్యాప్తు దిశానిర్దేశానికి ఐఎస్‌సీ..
ప్రస్తుత పోలీసు అధికారుల్లో అన్ని స్థాయిల వారికీ అన్ని రకాల నేరాల దర్యాప్తుపై పట్టు ఉండట్లేదు. ఇలాంటి పోలీసు అధికారులకు కేసుల దర్యాప్తులో సహకరించడానికి అవసరమైన సహాయ సహకారాలు, సలహాలు సూచనలు అందించడానికి ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ (ఐఎస్‌సీ) ఏర్పాటు చేశారు.
ఇంకా మరెన్నో..
- బంజారాహిల్స్‌లో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌తో పాటు కమిషనరేట్‌లో ఆధునిక కంట్రోల్ రూమ్ నిర్మాణాలు.
- నగర వ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషన్లు, డివిజన్లు, జోన్లను అనుసంధానిస్తూ వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థ.
- హాక్–ఐ, లాస్ట్ రిపోర్ట్, హైదరాబాద్ కాప్, హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్, వెరిఫై, 360 డిగ్రీస్ వ్యూ వంటి యాప్స్.
- ట్రాఫిక్ విభాగంలో క్యాష్‌లెస్ ఎన్‌ఫోర్స్‌మెంట్, చెస్ట్ మౌంటెడ్ కెమెరాల పరిచయం.
- సీసీ కెమెరాల ఏర్పాటు నేపథ్యంలో సిటీలోని అనేక జంక్షన్లను కాప్‌లెస్‌గా మార్పు.
- సైబర్, క్రైమ్ ల్యాబ్స్, ఐటీ సెల్, వీడియో ఎన్‌హ్యాన్స్‌మెంట్ ల్యాబ్ ఏర్పాటు.
- చిన్న చిన్న నేరాలు, ఉల్లంఘనలకు చెక్ చెప్పడానికి ఈ–పెట్టీ కేస్ విధానం.
- అధికారులు, సిబ్బందిని ప్రోత్సహించడానికి నెలవారీ కీ పెర్ఫామెన్స్ ఇండికేటర్ (కేపీఐ) అవార్డులు.
- సీసీ కెమెరా వ్యవస్థలో ఫేషియల్ రికగ్నైజేషన్ వంటి ఆధునిక పరిజ్ఞానంతో కూడిన ఎనలటిక్స్ ఏర్పాటు.
- గస్తీ వాహనాల జియో ట్యాగింగ్, అన్ని స్థాయిల సిబ్బందికి ట్యాబ్స్ జారీ.
- ప్రతి పోలీసుస్టేషన్‌లోనూ జిమ్‌తో పాటు ఠాణాలపై జాతీయ జెండాల ఏర్పాటు.
- కల్తీలపై ఉక్కుపాదం మోపడానికిఫోరెన్సిక్ అడాల్ట్రేషన్ క్లూస్ టీమ్‌కు రూపమిస్తున్నారు.
- పోలీసుల పని తీరు, ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు.
Comments
Please login to add a commentAdd a comment