
6 వేల చెరువుల్లోనే ‘మిషన్’!
9,577 చెరువుల పునరుద్ధరణ లక్ష్యం ఎండమావే
అనుమతులు, ఒప్పందాల జారీలో జాప్యమే కారణం
జూన్ వరకు 6 వేల చెరువుల పనులు చేయాలని ప్రభుత్వ యోచన
మిగతా 3 వేల చెరువుల పనులు వచ్చే ఏడాదిలోనే మొదలు
హైదరాబాద్: మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులు ఈ ఏడాది నిర్ణీత లక్ష్యాన్ని చేరుకునేలా కనిపించట్లేదు. మరో 10-15 రోజుల్లో వర్షాకాలం మొదలు కానుండటంతోపాటు పరిపాలనా అనుమతులు పొందిన చెరువులకు ఒప్పందాలు కుదిరి పనులు జరగడం సాధ్యమయ్యేలా లేదు. దీంతో ఇప్పటివరకూ కుది రిన ఒప్పందాల మేరకైనా జూన్‌లోగా ఎంత వీలైతే అంత పని పూర్తి చేయాలని, మిగతా పనులను వచ్చే ఏడాది ప్రారంభించాలని చిన్న నీటిపారుదలశాఖ యోచిస్తోంది. రాష్ట్రంలో మొత్తంగా గుర్తించిన 46,531 చెరువులకుగానూ ఈ ఏడాది 9,577 చెరువుల పునరుద్ధరణను లక్ష్యంగా పెట్టుకోగా అంచనాల తయారీ, పరిపాలనా అనుమతులు, ఒప్పం దాల ప్రక్రియలో జరిగిన జాప్యం కారణంగా పనులు ఫిబ్రవరి వరకు మొదలుకాలేదు. దీంతో మొత్తం లక్ష్యంలో ఇప్పటివరకు 7,879 చెరువులకు మాత్రమే పరిపాలనా అనుమతులు లభించగా, ఇందులో 6,261 చెరువులకు మాత్రమే కాంట్రాక్టర్లతో ఒప్పందాలు జరిగాయి. ఇందులో 5,557 చెరువుల్లో పనులు మొదలయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 82 చెరువుల్లో పనులు ప్రారంభమయ్యాయి.
హడావుడి పనులతో లక్ష్యానికి విఘాతం
ప్రస్తుతం ఒప్పందాలు కుదుర్చుకున్న చెరువుల్లోనే మరో 704 పనులను త్వరితగతిన ప్రారంభించాల్సి ఉంది. ప్రస్తుతం పనులు మొదలు పెట్టినా జూన్‌లో వర్షాలు మొదలయ్యే నాటికి పనులు పూర్తి చేయడం సాధ్యమవుతుందా? అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ఒకవేళ హడావుడిగా పనులు చేసినా, అది ఆశించిన ఫలితాన్ని ఇస్తుందా అనే సందేహం కూడా కలుగుతోంది. ప్రస్తుతం పనులు జరుగుతున్న చెరువుల పరిధిలో పూడికతీతతోపాటు కట్టు కాల్వల మరమ్మతులు, అలుగు పనులు చేయాల్సి ఉంది. ఇంకా ఆ పనులు చాలా చెరువుల పరిధిలో పూర్తి కాలేదు. అయితే జూన్ మొదటివారం నుంచే వర్షాలు మొదలైనా భారీ వర్షాలు కురిసేందుకు సమయం పడుతుందని, ఈలోగా వీలైనన్ని ఎక్కువ పనులు చేసేలా కసరత్తు చేస్తున్నామని అధికారులు అంటున్నారు. అదే నిజమైనా మొత్తంగా 6 వేల చెరువులకు మించి ఈ ఏడాది చెరువుల పునరుద్ధరణ సాధ్యం కానందున అంతవరకు లక్ష్యాన్ని చేరుకోవాలని నీటిపారుదలశాఖ యోచిస్తోంది. మిగతా 3,500 చెరువుల పనులను వచ్చే ఏడాదే చేపట్టాలని భావిస్తోంది.
ఖమ్మం ఫస్ట్.. మహబూబ్‌నగర్ లాస్ట్
ఇప్పటికే పునరుద్ధరణ ప్రారంభమైన చెరువుల్లో మొత్తంగా 70 శాతం పనులు పూర్తైట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో కృష్ణా బేసిన్ పరిధిలో 63 శాతం, గోదావరి బేసిన్‌లో 78 శాతం పనులు పూర్తైట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం 90 శాతం పనుల పూర్తితో ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో ఉండగా 55 శాతం పనుల పూర్తితో మహబూబ్‌నగర్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.