restoration of the pond
-
6 వేల చెరువుల్లోనే ‘మిషన్’!
9,577 చెరువుల పునరుద్ధరణ లక్ష్యం ఎండమావే అనుమతులు, ఒప్పందాల జారీలో జాప్యమే కారణం జూన్ వరకు 6 వేల చెరువుల పనులు చేయాలని ప్రభుత్వ యోచన మిగతా 3 వేల చెరువుల పనులు వచ్చే ఏడాదిలోనే మొదలు హైదరాబాద్: మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులు ఈ ఏడాది నిర్ణీత లక్ష్యాన్ని చేరుకునేలా కనిపించట్లేదు. మరో 10-15 రోజుల్లో వర్షాకాలం మొదలు కానుండటంతోపాటు పరిపాలనా అనుమతులు పొందిన చెరువులకు ఒప్పందాలు కుదిరి పనులు జరగడం సాధ్యమయ్యేలా లేదు. దీంతో ఇప్పటివరకూ కుది రిన ఒప్పందాల మేరకైనా జూన్‌లోగా ఎంత వీలైతే అంత పని పూర్తి చేయాలని, మిగతా పనులను వచ్చే ఏడాది ప్రారంభించాలని చిన్న నీటిపారుదలశాఖ యోచిస్తోంది. రాష్ట్రంలో మొత్తంగా గుర్తించిన 46,531 చెరువులకుగానూ ఈ ఏడాది 9,577 చెరువుల పునరుద్ధరణను లక్ష్యంగా పెట్టుకోగా అంచనాల తయారీ, పరిపాలనా అనుమతులు, ఒప్పం దాల ప్రక్రియలో జరిగిన జాప్యం కారణంగా పనులు ఫిబ్రవరి వరకు మొదలుకాలేదు. దీంతో మొత్తం లక్ష్యంలో ఇప్పటివరకు 7,879 చెరువులకు మాత్రమే పరిపాలనా అనుమతులు లభించగా, ఇందులో 6,261 చెరువులకు మాత్రమే కాంట్రాక్టర్లతో ఒప్పందాలు జరిగాయి. ఇందులో 5,557 చెరువుల్లో పనులు మొదలయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 82 చెరువుల్లో పనులు ప్రారంభమయ్యాయి. హడావుడి పనులతో లక్ష్యానికి విఘాతం ప్రస్తుతం ఒప్పందాలు కుదుర్చుకున్న చెరువుల్లోనే మరో 704 పనులను త్వరితగతిన ప్రారంభించాల్సి ఉంది. ప్రస్తుతం పనులు మొదలు పెట్టినా జూన్‌లో వర్షాలు మొదలయ్యే నాటికి పనులు పూర్తి చేయడం సాధ్యమవుతుందా? అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ఒకవేళ హడావుడిగా పనులు చేసినా, అది ఆశించిన ఫలితాన్ని ఇస్తుందా అనే సందేహం కూడా కలుగుతోంది. ప్రస్తుతం పనులు జరుగుతున్న చెరువుల పరిధిలో పూడికతీతతోపాటు కట్టు కాల్వల మరమ్మతులు, అలుగు పనులు చేయాల్సి ఉంది. ఇంకా ఆ పనులు చాలా చెరువుల పరిధిలో పూర్తి కాలేదు. అయితే జూన్ మొదటివారం నుంచే వర్షాలు మొదలైనా భారీ వర్షాలు కురిసేందుకు సమయం పడుతుందని, ఈలోగా వీలైనన్ని ఎక్కువ పనులు చేసేలా కసరత్తు చేస్తున్నామని అధికారులు అంటున్నారు. అదే నిజమైనా మొత్తంగా 6 వేల చెరువులకు మించి ఈ ఏడాది చెరువుల పునరుద్ధరణ సాధ్యం కానందున అంతవరకు లక్ష్యాన్ని చేరుకోవాలని నీటిపారుదలశాఖ యోచిస్తోంది. మిగతా 3,500 చెరువుల పనులను వచ్చే ఏడాదే చేపట్టాలని భావిస్తోంది. ఖమ్మం ఫస్ట్.. మహబూబ్‌నగర్ లాస్ట్ ఇప్పటికే పునరుద్ధరణ ప్రారంభమైన చెరువుల్లో మొత్తంగా 70 శాతం పనులు పూర్తైట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో కృష్ణా బేసిన్ పరిధిలో 63 శాతం, గోదావరి బేసిన్లో 78 శాతం పనులు పూర్తైట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం 90 శాతం పనుల పూర్తితో ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో ఉండగా 55 శాతం పనుల పూర్తితో మహబూబ్‌నగర్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. -
మిషన్ కాకతీయకు గ్లాండ్ ఫార్మా విరాళం
మంత్రి హరీశ్‌రావుకు రూ.50 లక్షల చెక్కు అందించిన చైర్మన్ రాజు హైదరాబాద్: రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయకు గ్లాండ్ ఫార్మా చైర్మన్ వీపీఎన్ రాజు రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఆయన శనివారం చెక్కును నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావుకు అందజేశారు. ఈ మొత్తాన్ని మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని మల్కబంధం కొత్తపేట్, అల్లీపూర్‌లోని పెద్దచెరువుల పునరుద్ధరణకు వినియోగించనున్నారు. అలాగే సోమయాజి అనే ఎన్ఆర్ఐ మిషన్ కాకతీయకు రూ.లక్ష విరాళం ప్రకటించగా, వికాస్‌రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రూ.10వేల చెక్కును మంత్రికి అందజేశారు. మిషన్ కాకతీయకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోందని, ఇప్పటివరకు రూ.42కోట్ల మేర విరాళాలు అందాయని మంత్రి హరీశ్ తెలిపారు. -
మిషన్ కాకతీయలో జిల్లా ఫస్ట్
అధికారులకు డిప్యూటీ సీఎం అభినందనలు చెరువు పనులు ఇంకా వేగవంతం చేయాలని పిలుపు అధికారులతో సమీక్షించిన కడియం శ్రీహరి వరంగల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ పనుల్లో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఈ మేరకు జిల్లా అధికారులను ఆయన అభినందించారు. చెరువు పనుల పురోగతి, పనుల జాప్యంపై మంగళవారం ఆయన హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో కలెక్టర్ కరుణ, ఎస్ఈ పద్మారావు, ఈఈలతో సమీక్షించారు. జూన్ రెండోవారం నుంచి వర్షాలు పడే సూచనలు ఉన్నందున మొదటి విడతలో మంజూరైన పనులన్నీ వేగంగా పూర్తి చేయాలన్నారు. అవినీతికి తావులేకుండా అధికారులు పర్యవేక్షించాలని, అక్రమాలు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. మంజూరై టెండర్ పూర్తయిన పనులను వెంటనే చేపట్టాలన్నారు. పూడికతీతపై పూర్తిగా దృష్టి పెట్టినట్లే మత్తడి, తూములు, కట్ట మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. పనుల పర్యవేక్షణ కోసం ప్రతి చెరువుకు ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ అయినట్లు చెప్పారు. చెరువులకు అధికారులను నియమించకుంటే కలెక్టర్ దృష్టికి తీసుకుపోవాలన్నారు. చెరువుల ప్రత్యేక అధికారులు పనుల పురోగతిని నిర్ణీత నమూనాలో పొందుపర్చి... రోజు వారీ నివేదికలు అందజేయాలన్నారు. సంబంధిత ఏఈలతో నిత్యం సమీక్ష నిర్వహించాలని, తద్వారా పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని ఎస్ఈకి సూచించారు. పూడికతీత అనంతరం ఏ మేరకు చెరువుల్లో నిల్వ సామర్థ్యం పెరుగుతుందో అంచనాలు వేయాలన్నారు. కలెక్టర్ కరుణ మాట్లాడుతూ చెరువుల పూడికతీత, మట్టి రవాణా, మత్తడి మరమ్మతుల వివరాలు రోజూ వారి నిర్ణీత నమూనాలో పొందుపర్చి అందజేయాలని ఎస్ఈకి సూచించారు. 18.02 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత కాకతీయ మిషన్‌లో చేపట్టిన పూడికతీతల్లో సుమారు 18.02లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసినట్లు ఎస్ఈ పద్మారావు తెలిపారు. ఇప్పటి వరకు 20-25లక్షల క్యూ.మీ మట్టి తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అటవీశాఖ అభ్యంతరాల వల్ల కొన్ని చెరువుల పనులు ప్రారంభం కాలేదన్నారు. ఈనెల 18నుంచి ఇప్పటి వరకు అకాల వర్షాల కారణంగా పనుల పురోగతి తగ్గిందన్నారు. నె క్కొండ మండలంలో అలంకానిపేట, గూడూరు మండలం బొద్దుగొండ, కురవి మండలం నేరడ గ్రామాల్లోని చెరువుల పునరుద్ధరణ పనులను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బుధవారం పరిశీలిస్తున్నట్లు యన తెలిపారు. పనులు పూర్తికావొచ్చిన నెక్కొండ మండలం పత్తిపాక గ్రామంలోని ఊరచెరువు పనులను పరిశీలించాలని కోరగా... వీలుంటే తప్పకుండా వస్తామని డిప్యూటీ సీఎం చెప్పారన్నారు. -
‘మిషన్ కాకతీయ’కు మరో రూ.12.13కోట్లు
ఇప్పటివరకు రెండు విడతల్లో రూ.38.57 కోట్లు విడుదల మొత్తం 131 చెరువుల పునరుద్ధరణకు మార్గం సుగమం పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశం సాక్షి, రంగారెడ్డి జిల్లా : మిషన్ కాకతీయలో భాగంగా మరికొన్ని చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. తొలివిడత కింద గత నెలలో 44 చెరువుల మరమ్మతులు, అభివృద్ధికి సర్కారు రూ.26.44కోట్లు విడుదల చేసింది. తాజాగా 87 చెరువుల పునరుద్ధరణ కోసం రూ.12.13కోట్లు విడుదల చేసింది. ఈమేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా ఇప్పటివరకు 131 చెరువుల అభివృద్ధికి రూ.38.57కోట్లు విడుదలయ్యాయి. రెండు విడతలుగా నిధులు.. జిల్లాల వారీగా సమీక్షలో భాగంగా గతేడాది చివర్లో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు జిల్లా యంత్రాం గంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో తొలివిడత తలపెట్టే 555 చెరువుల పునరుద్ధరణపై చర్చించిన అనంతరం విడతలుగా నిధులు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు రెండు విడతలుగా నిధులు మంజూరయ్యాయి. ఇందులో జనవరి ఏడో తేదీన ఎనిమిది మండలాల్లోని 44 చెరువులకు రూ.26.44 కోట్లు మంజూరయ్యాయి. తాజాగా 13 మండలాల్లోని 87 చెరువులకుగాను రూ.12.13కోట్లు విడుదల చేశారు. ఇక పనులు ఉరకలెత్తించాలి.. విడతలవారీగా నిధులు మంజూరు అవుతుండడంతో పనులు ప్రారంభించేందుకు అధికారులకు వెసులుబాటు కలిగింది. తొలివిడత నిధులు మంజూరు కావడంతో.. ఆయా పనులకు సంబంధించి జిల్లా నీటిపారుదల శాఖ ఇంజినీర్లు టెండర్లు ఖరారు చేసి పనులను ఇప్పటికే ప్రారంభించారు. తాజాగా రెండోవిడత నిధులు రావడంతో ఒకట్రెండు రోజుల్లో టెండర్లు పిలవాల్సి ఉంది. ఈ ప్రక్రియ అనంతరం పనులు ప్రారంభిస్తారు. ఇదిలా ఉంటే త్వరలో మరిన్ని నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఆలోపు తాజాగా చేపట్టిన పనులన్నీ పూర్తిచేసేలా నీటిపారుదల అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.