
మిషన్ కాకతీయలో జిల్లా ఫస్ట్
అధికారులకు డిప్యూటీ సీఎం అభినందనలు
చెరువు పనులు ఇంకా వేగవంతం చేయాలని పిలుపు
అధికారులతో సమీక్షించిన కడియం శ్రీహరి
వరంగల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ పనుల్లో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఈ మేరకు జిల్లా అధికారులను ఆయన అభినందించారు. చెరువు పనుల పురోగతి, పనుల జాప్యంపై మంగళవారం ఆయన హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో కలెక్టర్ కరుణ, ఎస్‌ఈ పద్మారావు, ఈఈలతో సమీక్షించారు. జూన్ రెండోవారం నుంచి వర్షాలు పడే సూచనలు ఉన్నందున మొదటి విడతలో మంజూరైన పనులన్నీ వేగంగా పూర్తి చేయాలన్నారు. అవినీతికి తావులేకుండా అధికారులు పర్యవేక్షించాలని, అక్రమాలు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. మంజూరై టెండర్ పూర్తయిన పనులను వెంటనే చేపట్టాలన్నారు. పూడికతీతపై పూర్తిగా దృష్టి పెట్టినట్లే మత్తడి, తూములు, కట్ట మరమ్మతులు పూర్తి చేయాలన్నారు.
పనుల పర్యవేక్షణ కోసం ప్రతి చెరువుకు ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ అయినట్లు చెప్పారు. చెరువులకు అధికారులను నియమించకుంటే కలెక్టర్ దృష్టికి తీసుకుపోవాలన్నారు. చెరువుల ప్రత్యేక అధికారులు పనుల పురోగతిని నిర్ణీత నమూనాలో పొందుపర్చి... రోజు వారీ నివేదికలు అందజేయాలన్నారు. సంబంధిత ఏఈలతో నిత్యం సమీక్ష నిర్వహించాలని, తద్వారా పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని ఎస్‌ఈకి సూచించారు. పూడికతీత అనంతరం ఏ మేరకు చెరువుల్లో నిల్వ సామర్థ్యం పెరుగుతుందో అంచనాలు వేయాలన్నారు. కలెక్టర్ కరుణ మాట్లాడుతూ చెరువుల పూడికతీత, మట్టి రవాణా, మత్తడి మరమ్మతుల వివరాలు రోజూ వారి నిర్ణీత నమూనాలో పొందుపర్చి అందజేయాలని ఎస్‌ఈకి సూచించారు.
18.02 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత
కాకతీయ మిషన్‌లో చేపట్టిన పూడికతీతల్లో సుమారు 18.02లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసినట్లు ఎస్‌ఈ పద్మారావు తెలిపారు. ఇప్పటి వరకు 20-25లక్షల క్యూ.మీ మట్టి తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అటవీశాఖ అభ్యంతరాల వల్ల కొన్ని చెరువుల పనులు ప్రారంభం కాలేదన్నారు. ఈనెల 18నుంచి ఇప్పటి వరకు అకాల వర్షాల కారణంగా పనుల పురోగతి తగ్గిందన్నారు. నె క్కొండ మండలంలో అలంకానిపేట, గూడూరు మండలం బొద్దుగొండ, కురవి మండలం నేరడ గ్రామాల్లోని చెరువుల పునరుద్ధరణ పనులను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బుధవారం పరిశీలిస్తున్నట్లు యన తెలిపారు. పనులు పూర్తికావొచ్చిన నెక్కొండ మండలం పత్తిపాక గ్రామంలోని ఊరచెరువు పనులను పరిశీలించాలని కోరగా... వీలుంటే తప్పకుండా వస్తామని డిప్యూటీ సీఎం చెప్పారన్నారు.